Sunday, 16 December 2018

sale of goods act 1930 వస్తు విక్రయ చట్టం 1930

వస్తు విక్రయ చట్టం 1930 for telugu medium students click the below link


వస్తు విక్రయ చట్టం 1930 in telugu medium

భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా మంచి ఆప్షన్!


 భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా మంచి ఆప్షన్!

భారత విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎంచుకునే దేశాల్లో ఆస్ట్రేలియా కూడా టాప్ ప్లేస్ లో ఉంటోంది. అమెరికా, యూకేల తర్వాత ప్రపంచంలో అత్యధికంగా విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశం ఆస్ట్రేలియా. 2014లో సుమారు నాలుగు లక్షల మంది విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాకు వెళ్లగా.. అందులో 50వేలకు పైగానే భారత్ నుంచి ప్రవేశాలు పొందారు. 40కుపైగా యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి విద్యా సంస్థలు అందించే వొకేషనల్, టెక్నికల్ కోర్సులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలన్నీ ఇక్కడి విద్యా సంస్థల సర్టిఫికెట్లను గుర్తిస్తున్నాయి. అమెరికా, యూకేల కంటే నివాస వ్యయం తక్కువ. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో విద్యకు సంబంధించి అందుబాటులో ఉన్న వివిధ వీసాల గురించి తెలుసుకుందాం... 
ఇవి తప్పనిసరి...
ముందుగా విద్యకు సంబంధించి ఆస్ట్రేలియాలో అనువైన విద్యా సంస్థను ఎంపిక చేసుకోవాలి. చాలా విద్యా సంస్థలకు సొంత వెబ్ సైట్లు ఉన్నాయి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఇవి వీలు కల్పిస్తున్నాయి. చేరబోయే విద్యా సంస్థలు, కోర్సులకు ప్రభుత్వ అనుమతి ఉందో, లేదో కూడా చూసుకోవాలి. cricos.deewr.gov.au, http://www.studyinaustralia.gov.au/ ఈ వెబ్ సైట్లలో ఆయా సమాచారం లభిస్తుంది. కోర్సు ఎంపిక అనంతరం ఆయా విద్యా సంస్థల వెబ్ సైట్ల ద్వారా నేరుగా అడ్మిషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజెంట్ సాయం తీసుకునేట్లయితే గుర్తింపు ఉన్న ఏజెంట్ల వివరాలను వెబ్ సైట్ నుంచి తెలుసుకోవాలి. అడ్మిషన్ ఖరారుకు ముందు అవసరమైతే యూనివర్సిటీలు ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తాయి. అంతా సవ్యంగా జరిగితే కోర్సు ఫీజు చెల్లించాలి. దీనికి ముందు లిఖిత పూర్వక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకుంటున్న కోర్సు, నిబంధనలు, ఫీజులు, ఇతరత్రా నిబంధనలతో ఈ ఒప్పందం ఉంటుంది. దీన్ని పూర్తిగా చదివి ఆమోదించాలి. అలాగే, దీనికి సంబంధించిన జిరాక్స్ కాపీలను దగ్గర ఉంచుకోవడం మంచిది. 
అదే విధంగా ప్రవేశాల కోసం కావాల్సిన అర్హతల వివరాలు కూడా యూనివర్సిటీ వెబ్ సైట్ల నుంచి తెలుసుకోవచ్చు. ఏసీటీ (యాక్ట్), స్కాలస్టిక్ అసెస్ మెంట్ టెస్ట్ (శాట్) లను రాయడం ద్వారా ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి వీలవుతుంది. టోఫెల్, ఐఈఎల్టీఎస్, పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ (పీటీఈ) వంటి పరీక్షల్లో ఏదేనీ ఒకదాన్ని రాయడం ద్వారా ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని వ్యక్తీకరించాల్సి ఉంటుంది. అలాగే, మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు జీఆర్ఈ, జీమ్యాట్ పరీక్షలు అర్హత కల్పిస్తాయి. 
కళాశాలకు విద్యార్థులు వారి గురించి లేఖ రూపంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఫలానా కళాశాలకే దరఖాస్తు చేసుకోవడానికి కారణాలు, అడ్మిషన్ పొందడానికి ఉన్న అర్హతలు అనే అంశాలతో వ్యక్తిగత లేఖను అడ్మిషన్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, వృత్తిపరమైన ఆకాంక్షలు, బలాబలాలు, నైపుణ్యాలు, అనుభవం తదితర అంశాలతో వ్యాసాలు రాయాలని కూడా యూనివర్సిటీలు అడుగుతాయి.  
ఆస్ట్రేలియాలో ఫిబ్రవరి లేదా జూలై నెలల్లో కోర్సులు ప్రారంభమవుతాయి. గడువుకు ఆరు నెలల ముందే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో చేరాలనుకుంటే డిసెంబర్ నాటికి దరఖాస్తు ప్రక్రియ, ఇంటర్వ్యూలకు హాజరు, వీసా దరఖాస్తు ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది. జీమ్యాట్ లో 520, జీఆర్ఈలో వెర్బల్ లో 145, క్వాంట్ లో 160 మార్కులను యూనివర్సిటీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.  
ఏజెంట్, మరెవరి ఒత్తిడితోనూ ఎక్కడా సంతకం చేయరాదు. అన్నీ నచ్చాకే ఫీజులు చెల్లించాలి. విద్యార్థుల వీసా అప్లికేషన్లు, శాశ్వత నివాస అనుమతి దరఖాస్తులను ఆస్ట్రేలియా ప్రభుత్వమే ప్రాసెస్ చేస్తుంది. ఈ విషయంలో ఏజెంట్ల మాటలు నమ్మవద్దు. పార్ట్ టైమ్ వర్క్ విషయంలో ఏజెంట్ల మాటలపై ఆధారపడవద్దు. విద్యా సంస్థల్లోని విదేశీ విద్యార్థుల సేవా కేంద్రాలను ఆశ్రయించడం ద్వారా వసతి, ఉద్యోగం, ఇంగ్లిష్ భాష మెరుగుకు సాయం పొందవచ్చు. ఒంటరితనం భావనలో ఉంటే భాతర హైకమిషన్/కాన్సులేట్ ను సంప్రదిస్తే... స్థానిక భారతీయ సంఘాలకు పరిచయం చేస్తారు. దాంతో కొత్త ప్రాంతంలో ఉన్నామన్న భావన నుంచి బయటకు రావచ్చు.
ఆస్ట్రేలియాలో విద్యకు అయ్యే వ్యయం ఇలా…
2015 సంవత్సరానికి సంబంధించి ఆస్ట్రేలియాలో కోర్సుల ఫీజులు ఇలా ఉన్నాయి. బాచిలర్స్ డిగ్రీకి ట్యూషన్ ఫీజు 15వేల ఆస్ట్రేలియా డాలర్లు (భారతీయ కరెన్సీలో ఒక డాలరు సుమరుగా 49 రూపాయలు) ఉంది. అంటే 7.35 లక్షల రూపాయలు డిగ్రీ కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇది యూనివర్సిటీని బట్టి మారుతూ ఉంటుంది. అదే పీజీ డిగ్రీకి అయితే 20వేల ఆస్ట్రేలియా డాలర్లు, పీహెచ్ డీ కోర్సుకు 14వేల డాలర్ల ఫీజు ఉంది. మెడిసిన్ చేయాలంటే ఇంతకంటే ఎక్కువే చెల్లించుకోవాలి. కోర్సుల ఫీజుల వివరాలను http://www.studyinaustralia.gov.au/global/australian-education/education-costs/education-costs-in-australia వెబ్ సైట్ నుంచి, అలాగే చేరబోయే విద్యా సంస్థల వెబ్ సైట్ల నుంచి తెలుసుకోవచ్చు.
సొంతంగా ఆర్థిక వనరులు ఉండాల్సిందేనా..?
చదువుతూ పార్ట్ టైమ్ జాబ్ ద్వారా కోర్సు ఫీజులు పూర్తిగా చెల్లించడం సాధ్యమయ్యేది కాదు. ట్యూషన్ ఫీజు,  మిగతా ఖర్చులకు సరిపడా సంపాదించాలంటే… చదువును పక్కన పెట్టాల్సిందే. చన్నీళ్లకు కాసిన్ని వేడి నీళ్లు తోడన్నట్టు.. విద్యకు సరిపడా వ్యయాన్ని ముందే సమకూర్చిపెట్టుకుని వెళ్లడమే సరైనది. వారానికి 20 గంటల పాటు పనిచేసుకోగల సౌలభ్యం ఉన్నప్పటికీ సరైన పని దొరుకుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు కదా. పైగా ఆదాయం కోసం ఎక్కువ గంటల పాటు పనిచేస్తే వీసాను క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉంది. విద్యార్థులు ఒక్కోసారి గంటకు 3 నుంచి 5 డాలర్లకు కూడా పనిచేయాల్సి రావచ్చు. పనికి సంబంధించి యజమానితో ఏవైనా విభేదాలు వచ్చినా, తగినంత వేతనం ఇవ్వకపోయినా అంబుడ్స్ మెన్ ను సంప్రదించవచ్చు. చదువుతూ పనిచేసుకునే విద్యార్థులకు ఉండే హక్కుల గురించి https://www.fairwork.gov.au/ వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చు.
పార్ట్ టైమ్ జాబ్ గురించి..
అమెరికాలో వలే ఆస్ట్రేలియాలోనూ విద్యార్థులు వారానికి 20 గంటలు మించకుండా ఉద్యోగాలు చేసుకోవచ్చు. సెలవుల్లో వారానికి 40 గంటల వరకు పనిచేసుకోవచ్చు. వేతనాన్ని వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి తీసుకోవచ్చు. ఆస్ట్రేలియాలో కనీస వేతనం ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇక్కడ కనీస వేతనం గంటకు 17 ఆస్ట్రేలియా డాలర్లు. వారాంతపు  రోజులు, సెలవు రోజుల్లో ఇది ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. రెస్టారెంట్లలో వెయిటర్ కు గంటకు 23 డాలర్ల వేతనంగా ఉంది. సూపర్ మార్కెట్లో 20 డాలర్లు చెల్లిస్తున్నారు. 
నాణేనికి మరో వైపు
అయితే, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. విదేశీ విద్యార్థుల అవసరాలను అవకాశంగా మలుచుకుంటున్న సంస్థలు కూడా లేకపోలేదు. సిడ్నీ తదితర ప్రాంతాల్లో విదేశీ విద్యార్థులు గంట పని చేసినందుకు గాను 8 డాలర్లు మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు రిస్క్ తీసుకుంటున్నారు. అంటే వారానికి 20 గంటల కంటే అదనంగా పనిచేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇది బయటపడితే అక్కడి నుంచి వెనక్కి పంపించే ప్రమాదం ఉంటుంది. 
దేనికి ఏ వీసా...?
స్టూడెంట్ వీసాను పలు సబ్ క్లాస్ లుగా పేర్కొన్నారు. ప్రైమరీ లేదా సెకండరీ స్కూల్స్ లో ప్రవేశాల కోసం, విద్యార్థుల మార్పిడి కార్యక్రమం కింద వెళ్లే వారు సబ్ క్లాస్ 571 అనే రకం వీసా తీసుకోవాల్సి ఉంటుంది.  వృత్తి విద్యా కళాశాలల్లో డిప్లొమా, అడ్వాన్స్ డ్ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల కోసం 572 వీసా తీసుకోవాలి. యూనివర్సిటీల్లో బాచిలర్స్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ డిప్లొమా, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు గాను 573 వీసా... మాస్టర్, పీహెచ్ డీ కోర్సుల్లో ప్రవేశాలకు 574 వీసాను తీసుకోవాల్సి ఉంటుంది. 
ఫౌండేషన్ కోర్సుల కోసం..
ఫౌండేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 575 వీసా తీసుకోవాలి. ప్రత్యేకమైన విద్యార్హతలు ఏమీ లేకున్నా ఫౌండేషన్ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. కోర్సు ముగిసిన తర్వాత ఎలాంటి డిగ్రీలు, సర్టిఫికేట్లు ప్రదానం చేయరు. 576 వీసా చాలా ప్రత్యేకమైనది. ఆస్ట్రేలియా ప్రభుత్వం లేదా ఆ దేశ రక్షణ విభాగం సహకారంతో చదువుకోడానికి ఇది వీలు కల్పిస్తుంది. తమపై ఆధారపడిన వారిని కూడా అక్కడికి తీసుకెళ్లవచ్చు. అంతేకాదు జీవిత భాగస్వామి కూడా మూడు నెలల పాటు చదువుకునేందుకు అవకాశం ఉంది. వీసా సబ్ క్లాస్ 580... ఇది గార్డియన్ వీసా. ఆస్ట్రేలియాకు వెళ్లే విద్యార్థులు ఈ వీసాతో తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులను తమ వెంట తీసుకెళ్లవచ్చు. ఇంగ్లిష్ కోర్సులు చదివేందుకు వెళ్లేవారు 570 వీసా తీసుకోవాల్సి ఉంటుంది. 
చదువుతూనే పార్ట్ టైం జాబ్   
విద్యార్థులు ఒకవైపు చదువుకుంటూనే వారానికి 20 గంటల పాటు ఉద్యోగం చేసుకోవచ్చు. సెలవుల్లో పరిమితి లేకుండా పనిచేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు కూడా వారానికి 20 గంటల పాటు పనిచేసుకోగల సౌలభ్యం ఉంది. కుటుంబ సభ్యులకు వీసా కోసం దరఖాస్తు చేసుకునేట్లు అయితే జీవనానికి సరిపడా ఆర్థిక వనరులు ఉన్నాయని ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ముందుగా వైద్య పరీక్షలకు హాజరు కావాలి.   
ఆస్ట్రేలియాకు బయల్దేరుతున్నారా...? ఒక్క నిమిషం!
ఆస్ట్రేలియాలో కొంత కాలం క్రితం జాతి ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మెల్ బోర్న్ సహా పలు ప్రాంతాల్లో భారతీయ విద్యార్థులపై దాడులు, వారి నుంచి దోచుకోవడం వంటి ఘటనలు జరిగాయి. కనుక విద్యార్థులు భద్రత కోసం బయట ఎక్కువగా సంచరించకుండా విద్యకు పరిమితం కావడం మంచిది. కొన్ని ప్రైవేటు కళాశాలల నిర్వహణ అక్కడి ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఉండదు. అయినా అలాంటి కళాశాలలు భారీగా భారత విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ప్రమాణాలు లేని విద్యా సంస్థల్లో చేరితే ఇబ్బందే. అందుకే చేరుతున్న విద్యా సంస్థకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవాలి www.acpet.edu.au ఈ సైట్ అందుకు వీలు కల్పిస్తుంది.
ముందు చూపు అవసరం
ఖర్చు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా తక్కువ అద్దెలు ఉండే ప్రాంతాల్లో ఉండేందుకు మొగ్గు చూపుతుంటారు. అద్దె భారం తగ్గించుకునేందుకు ఇద్దరు ముగ్గురు కలసి ఒక గదిని షేర్ చేసుకుంటుంటారు. దీంతో ఆయా ప్రాంతాలు రద్దీగా ఉండడమే కాకుండా పరిశుభ్రంగా కనిపించవు. పైగా అలాంటి ప్రాంతాల్లో నేరాలకు కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతాలు విద్యా సంస్థలకు దూరంగానూ ఉంటాయి. ఆదాయం కోసం విద్యార్థులు రాత్రి పూట పనులకు వెళుతుంటారు. అర్ధరాత్రి సమయంలో మెల్ బోర్న్ వంటి నగరాల్లో మెట్రో రైళ్లల్లో ప్రయాణించడం ఏంతమాత్రం సురక్షితం కాదు. దొంగలు దాడి చేసే అవకాశాలు ఎక్కువ. కనుక ఆస్ట్రేలియాకు వెళ్లే ముందే అక్కడి విద్యా సంస్థలు, నివాసానికి అనువైన ప్రాంతాలు, పార్ట్ టైమ్ జాబ్స్ వల్ల వచ్చే ఆదాయం, ఫీజులు, నివాస వ్యయం తదితర అంశాల గురించి సమగ్రంగా తెలుసుకునే ఫ్లయిట్ ఎక్కాలి.
ముఖ్యమైన పత్రాలు, డబ్బులను జాగ్రత్త చేసుకోవాలి. అన్ని ముఖ్యమైన పత్రాలకు సంబంధించిన జిరాక్స్ కాపీలు మెయిల్ చేసి ఉంచుకోవడం శ్రేయస్కరం. అర్ధరాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణించరాదు. ఎక్కడికైనా వెళ్లే ముందు స్థానికంగా తెలిసిన వారికి ఆ సమాచారం తెలియజేయాలి. అవసరమైన సమయాల్లో పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సాయం పొందవచ్చు. రద్దీ ప్రాంతాల్లో తోసుకోవడం నేరం. క్యూలైన్లను బ్రేక్ చేసి వెళ్ల కూడదు. పెద్దగా మాట్లడరాదు. ఇరుగు, పొరుగు వారిని వ్యక్తిగత ప్రశ్నలు వేయకుండా ఉండడం మంచిది. అందరితోనూ మర్యాదగా మాట్లాడాలి. ప్లీజ్, థ్యాంక్యూ పదాలు అవసరమైనప్పుడల్లా ఉపయోగించడం మంచి ఫలితాన్నిస్తుంది.
భారత ఎంబసీకి వివరాలు అందించడం వల్ల...
విలువైన వస్తువులు కలిగి ఉంటే వాటికి ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆహార పదార్థాలను తీసుకెళుతుంటే వాటిని స్పష్టంగా ముందే తెలియజేయాలి. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత తమ పూర్తి వివరాలు, చిరునామా, ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు, ఆస్టేలియాలో ఎక్కడ ఉంటున్నారు? తదితర పూర్తి వివరాలను భారతీయ కాన్సులేట్ లో తెలియజేయడం అత్యవసర పరిస్థితుల్లో సాయానికి ఉపకరిస్తుంది. న్యూ సౌత్ వేల్స్ లో ఉండేవారు www.indianconsulatesydney.org, విక్టోరియా, తాస్మానియాలో ఉండేవారు  www.cgimelb.org, ఆస్ట్రేలియాలోని మిగతా ప్రాంతాల్లో నివసించే వారు www.hcindia-au.orgవెబ్ సైట్ల ద్వారా తగిన సమాచారం, అధికారుల సాయం తీసుకోవచ్చు.
వీసా అధికారులు ఇవి చూస్తారు సుమా!
ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం, ప్రవర్తన, ఆరోగ్యం, కోర్సు పూర్తి చేసేందుకు, నివాసానికి కావాల్సిన ఆర్థిక వనరులు, విద్యార్హతలు, విద్య కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నారా?, స్వదేశంలో వారి కుటుంబ పరిస్థితులు తదితర అంశాలను ఆస్ట్రేలియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (డీఐబీపీ) విభాగం పరిశీలిస్తుంది. అసెస్ మెంట్ లెవల్స్ ను బట్టి విద్యార్థి వీసాలను క్షుణంగా పరిశీలిస్తారు. ఇమిగ్రేషన్ రిస్క్ ఆధారంగా వివిధ దేశాల వారికి వివిధ లెవల్స్ కేటాయించారు. లెవల్ 1 అంటే తక్కువ ఇమిగ్రేషన్ రిస్క్ ఉన్నట్టు. వీరు చాలా సులభంగా వీసా పొందవచ్చు. ఐదే లెవల్ 5 ఉంటే ఎక్కువ రిస్క్ ను సూచిస్తుంది. దీంతో అభ్యర్థులు ఆస్ట్రేలియా విద్యా సంస్థలో అడ్మిషన్ కు సంబంధించిన లేఖతోపాటు తమకున్న అర్హతల విషయంలో అన్ని ఆధారాలనూ సమర్పించాల్సి ఉంటుంది. భారత విద్యార్థులకు సంబంధించి... 570 వీసాకు లెవల్ 4 కేటాయించారు. 571 (2), 572(4), 573(4), 574(4), 575(3), 576 వీసాకు లెవల్ 2 కేటాయించారు. పూర్తి వివరాలు, సందేహాలను సమీపంలోని ఆస్ట్రేలియన్ ఎంబసీ నుంచి పొందవచ్చు.
457 వీసాటెంపరరీ వర్క్ (నైపుణ్యాలు కలిగిన) వీసా (సబ్ క్లాస్ 457) అన్నది విదేశీయులకు ఇచ్చే తాత్కాలిక వీసా. నిపుణులైన కార్మికులు ఈ వీసా కింద ఆస్ట్రేలియాలోని సంస్థల్లో ఉద్యోగావకాశాన్ని సంపాదించి నాలుగేళ్ల పాటు అక్కడ పనిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సంబంధిత ఉద్యోగానికి అర్హుడైన మరో నిపుణుడు లభించలేదన్న ఆధారాలు చూపించి సంస్థలు విదేశీ నిపుణులను భర్తీ చేసుకోవచ్చు. అయితే, ఈ వీసాల కారణంగా ఆస్ట్రేలియన్ల ఉద్యోగావకాశాలను విదేశీయులు తన్నుకుపోతున్నారంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఇందులో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ వీసాలు సైతం ఏడాదికి ఇంతమందికే అన్న పరిమితి కూడా ప్రస్తుతం లేదు. 2012-13లో 1,26,000 మంది ఈ వీసా పొందారు. గతేడాది ఇది 96,000గా ఉంది.

వీసాల్లో మార్పులు457 వీసా సబ్ క్లాస్ ను పూర్తిగా రద్దు చేస్తూ దీని స్థానంలో రెండు కొత్త వీసా కార్యక్రమాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదించింది.  ఒకటి రెండేళ్ల కాల వ్యవధి, మరొకటి నాలుగేళ్ల కాలవ్యవధితో  ఉంటుంది. టెంపరరీ స్కిల్ షార్టేజ్ వీసా (తాత్కాలిక నైపుణ్య కొరతను తీర్చే వీసా అని అర్థం). ఈ కొత్త వీసాలు 2018 మార్చి నుంచి అమల్లోకి వస్తాయి. ఇక గతంలో 457 వీసా కింద 650 ఉద్యోగాల్లో ప్రవేశాలకు వీలు ఉండేది. దాన్ని 200కు కుదించారు. కొత్త వీసా నిబంధనల కింద అధిక ప్రమాణాలతో కూడిన ఇంగ్లిష్ పరిజ్ఞానం అవసరం. అలాగే సరైన పోలీసు ధ్రువీకరణ, నేరపూరిత పరిశీలన కూడా తప్పనిసరి. అలాగే, రెండేళ్ల పని అనుభవం, లేబర్ మార్కెట్ టెస్టింగ్ కూడా అవసరం.

ఆస్ట్రేలియన్లు అందుబాటులో ఉంటే వారికే ఉద్యోగాలు ఇవ్వడం, ఒకవేళ నైపుణ్య మానవ వనరులు ఆస్ట్రేలియాలో అందుబాటులో లేకుంటేనే విదేశీ నిపుణులను భర్తీ చేసుకోవడం అన్నవి నూతన వీసాల ప్రధానోద్దేశం. 457 వీసా కింద పూర్తి స్థాయి నివాసిత హోదా పొందేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. అయితే, కొత్తగా తీసుకొస్తున్న రెండేళ్ల వర్క్ వీసా కింద ఈ అవకాశం ఉండబోదు. నాలుగేళ్ల వీసా కింద అవకాశం ఇస్తున్నా, అందుకు కఠిన నిబంధనలను ప్రతిపాదించనున్నారు. అలాగే, నాలుగేళ్ల వీసా రుసుమును సైతం 1,150 డాలర్ల నుంచి 2,400 డాలర్లకు పెంచారు. ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీ పనివారిలో భారత్ నుంచి 24.6 శాతం, బ్రిటన్ నుంచి 19.5 శాతం, చైనా నుంచి 5.8 శాతం ఉంటున్నారు.

వర్కింగ్ హాలిడే ప్రొగ్రామ్ లోనూ మార్పులుఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి అక్కడి అందాలను చూడడంతోపాటు కొంత కాలం పాటు పనిచేసుకోవాలనుకునే వారు గమనించాల్సిన అంశాలున్నాయి. 2017 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల మేరకు వర్కింగ్ హాలిడే వీసా చార్జీలు 50 డాలర్లు తగ్గి 390 డాలర్లుగా ఉంది. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు వయసు పరిమితి గతంలో 30 ఏళ్లుగా ఉండగా దాన్ని 35కు పెంచారు. ఒకే సంస్థలో 12 నెలల పాటు ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాకపోతే ఒక చోట ఆరు నెలలకు మించి పనిచేయడానికి లేదు. 37,000 ఆస్ట్రేలియన్ డాలర్ల వరకూ ఆదాయం ఆర్జించే వారిపై పన్ను రేటు ను 32.5 శాతం నుంచి 19 శాతానికి తగ్గించారు. వర్కింగ్ హాలిడే వీసా 417, వీసా ఎక్స్ టెన్షన్ పోగ్రామ్ 417, వర్క్ అండ్ హాలిడే వీసా 462కు ఈ మార్పులు అమలవుతాయి.

అమెరికాలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలు

అమెరికాలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలు


అమెరికాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులు అందుకు ప్రాథమికంగా కొన్ని అర్హతలు సాధించాల్సి ఉంటుంది. ప్రధానంగా బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకు శాట్ లేదా యాక్ట్ పరీక్ష... మాస్టర్స్ డిగ్రీలలో ప్రవేశాలకు జీమ్యాట్, జీఆర్ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వీటికి తోడు ఇంగ్లిష్ భాషా నైపుణ్యానికి సంబంధించి టోఫెల్ లేదా ఐఈఎల్టీఎస్ పరీక్షలను రాయడం తప్పనిసరి. అసలు ఈ పరీక్షల ప్రాధాన్యం, అవసరాలు, రిజిస్ట్రేషన్ తదితర వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్)
అమెరికాలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు శాట్ పరీక్ష అర్హత కల్పిస్తుంది. సింగపూర్, కెనడా సహా పలు దేశాల్లోని ప్రముఖ వర్సిటీలు సైతం శాట్ స్కోర్ ను గుర్తిస్తున్నాయి. ఈ పరీక్షను కాలేజ్ బోర్డ్ అనే లాభాపేక్ష రహిత సంస్థ నిర్వహిస్తోంది. విద్యార్థులందరికీ ప్రతిభ ఆధారంగా సమాన అవకాశాలు కల్పించడమే ఈ సంస్థ ఆశయం. ఇంటర్ పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్షలో రీజనింగ్, సబ్జెక్ట్ టెస్టులనే రెండు విభాగాలు ఉన్నాయి.  
రీజనింగ్ టెస్ట్
శాట్ రీజనింగ్ పరీక్షను రైటింగ్, క్రిటికల్ రీడింగ్, మ్యాథ్స్ అంశాలపై నిర్వహిస్తారు. విద్యలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను, విశ్లేషణాత్మక, సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాలను ఇందులో చూస్తారు. మూడు పేపర్లు కలిపి మొత్తం 2,400 మార్కులకు ఉంటుంది. ప్రతీ విభాగానికి 800 మార్కులు. మ్యాథ్స్ సగటు స్కోర్ 516 మార్కులు, క్రిటికల్ రీడింగ్ పేపర్ సగటు మార్కులు 501 మార్కులు, రైటింగ్ సగటు మార్కులు 492. పరీక్షా సమయం 3 గంటల 45 నిమిషాలు. మొత్తం పది సెక్షన్లు. ప్రతీ సెక్షన్ లోనూ మూడు విభాగాలతోపాటు ఈక్వేటింగ్ సెక్షన్ ఒకటి ఉంటుంది. ఒకరు ఎన్నిసార్లయినా పరీక్షను రాయవచ్చు. కొన్ని టాప్ కాలేజీలు, యూనివర్సిటీలు 2200 స్కోర్ అడుగుతాయి. చాలా కాలేజీలు, యూనివర్సిటీలు సగటు స్కోరును అడ్మిషన్లకు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
క్రిటికల్ రీడింగ్ సెక్షన్ లో మూడు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు 25 నిమిషాల చొప్పున, ఒక పేపర్ 20 నిమిషాలకు ఉంటుంది. క్రిటికల్ రీడింగ్, సెంటెన్స్ లెవల్ రీడింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కంప్లీషన్స్, పేరాగ్రాఫ్ లెంత్ క్రిటికల్ రీడింగ్ అంశాలపై పరీక్ష ఉంటుంది. ఇక, మ్యాథమేటిక్స్ సెక్షన్ లోనూ 25 నిమిషాల చొప్పున రెండు పేపర్లు, 20 నిమిషాలతో మరో పేపర్ ఉంటుంది. నంబర్లు, ఆపరేషన్లు, అల్జీబ్రా, ఫంక్షన్స్, జామెట్రీ, స్టాటిస్టిక్స్ తదితర అంశాల్లో పరీక్ష నిర్వహిస్తారు. కాలిక్యులేటర్ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. మూడో పరీక్ష ప్రాబ్లమ్ సాల్వింగ్ పై ఉంటుంది. 60 నిమిషాల వ్యవధిలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 35 నిమిషాలు, వ్యాసరచనకు 25 నిమిషాల సమయం ఇస్తారు. 
శాట్ సబ్జెక్ట్ టెస్టులు
ఇంగ్లిష్, హిస్టరీ, మ్యాథమేటిక్స్, సైన్స్, లాంగ్వేజ్ అంశాల్లో పరీక్షలు ఉంటాయి. అప్పటి వరకు స్టూడెంట్ లైఫ్ లో విద్యార్థి ఈ సబ్జెక్టులలో ఆర్జించిన విజ్ఞానాన్ని పరీక్షిస్తారు. వీటిలో కనీసం రెండు సబ్జెక్ట్ అంశాల్లో మంచి స్కోరును అమెరికాలోని చాలా కళాశాలలు అడుగుతున్నాయి. కళాశాలలను సంప్రదించినప్పుడు శాట్ లో ఏ సబ్జెక్టులలో స్కోరు కావాలన్న విషయం తెలుస్తుంది. మరికొన్ని కళాశాలలు సబ్జెక్ట్ అంశాన్ని విద్యార్థుల ఇష్టానికే వదిలేస్తున్నాయి. ప్రిపరేషన్ పుస్తకాలను యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సహా పలు సంస్థలు అందిస్తున్నాయి. ఏటా అక్టోబర్ నుంచి జూన్ మధ్యలో ఆరు సార్లు పరీక్ష నిర్వహిస్తారు. దేశంలో హైదరాబాద్ తోపాటు అన్ని ప్రముఖ నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.
శాట్ స్కోరుతోపాటు హైస్కూల్లో గ్రేడ్ పాయింట్ యావరేజ్, టీచర్ల నుంచి రికమెండేషన్ లెటర్లు, ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థుల అర్హతలను తేలుస్తాయి. అలాగే, ప్రవేశానికి ముందు వ్యాస రచన, పర్సనాలిటీ టెస్టుల్లో కూడా విద్యార్థుల సామర్థ్యాన్ని కొన్ని కళాశాలలు పరీక్షిస్తాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎక్కడ కూడా బ్యాక్ లాగ్స్ లేకుండా చూసుకోవాలి. భవిష్యత్తులో అమెరికాలో చదువుకోవాలనే కలలతో ఉన్నవారు  హైస్కూల్ నుంచి ఇంటర్ వరకు మెరిట్ పరంగా ఉన్నత స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. సగటున 65 శాతానికి తగ్గకుండా చూసుకుంటే మంచిది.  వివరాలకు http://studyabroad.shiksha.com/  https://collegereadiness.collegeboard.org/satవెబ్ సైట్ లను చూడవచ్చు.
శాట్ పరీక్ష కోసం ప్రిపరేషన్ ఇంటర్ మొదటి సంవత్సరం తర్వాత నుంచే ప్రారంభించడం మంచిది. ఓ నెల కఠిన సాధన చాలా వరకు ఉపకరిస్తుంది. ఆ తర్వాత మాక్ టెస్టులు రాస్తూ ఉంటే మంచి అనుభవం పొందవచ్చు. పరీక్ష పూర్తయ్యే వరకూ రోజుకో టెస్ట్ రాసేవారూ ఉన్నారు. అదే సమయంలో మంచి కాలేజీని ఎంచుకుకోవడంపైనా దృష్టి సారించాలి. 

అమెరికన్ కాలేజీ టెస్టింగ్ (ఏసీటీ/యాక్ట్)
అమెరికాలోని కొన్ని యూనివర్సిటీలు బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు యాక్ట్ టెస్టును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇది అచ్చం శాట్ పరీక్ష వంటిదే. శాట్ పరీక్ష, యాక్ట్ పరీక్షకు మధ్య తేడా ఏమీ లేదు. కాకపోతే యాక్ట్ లో ఎక్కువగా విద్యార్థి ఆప్టిట్యూడ్ ను పరీక్షిస్తారు. అయితే అమెరికాలోని చాలా వర్సిటీలు శాట్, యాక్ట్ రెండింటినీ ఆమోదిస్తున్నాయి. కొన్ని మాత్రం శాట్ ఒక్కదాన్నే ఆమోదిస్తున్నాయి. కనుక అడ్మిషన్ కోరుకునే యూనివర్సిటీని బట్టి రెండింటిలో ఏ పరీక్ష రాయలన్న విషయాన్ని నిర్ణయించుకోవచ్చు. ఇంటర్ పూర్తయిన వారు లేదా ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న వారు సైతం యాక్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే ఐదేళ్ల పాటు గడువు ఉంటుంది. అంటే ఆ లోపు తిరిగి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. 
ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, రీడింగ్, సైన్స్ అంశాల్లో యాక్ట్ పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్ 75 ప్రశ్నలతో 45 నిమిషాల పాటు ఉంటుంది. మ్యాథమేటిక్స్ 60 ప్రశ్నలతో 60 మార్కులకు, రీడింగ్ 40 ప్రశ్నలతో 35 నిమిషాల పాటు, సైన్స్ 40 ప్రశ్నలతో 35 నిమిషాల పాటు ఉంటుంది. యాక్ట్ ప్లస్ పరీక్షలో అప్షనల్ గా 30 నిమిషాలకు రాత పరీక్ష కూడా ఉంటుంది. ఇందులో హైస్కూల్ స్థాయి ఇంగ్లిష్ రచనా నైపుణ్యాన్ని చూస్తారు. యాక్ట్ పరీక్షకు 2.55 గంటలు, యాక్ట్ ప్లస్ పరీక్షకు 3.25 గంటల పాటు పరీక్షా సమయం ఉంటుంది. సెప్టెంబర్ నుంచి జూన్ వరకు ఏటా ఆరు సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంటారు. రిజిస్ట్రేషన్ ఇతర పూర్తి వివరాలకు http://www.act.org/ వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. 

టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారీన్ లాంగ్వేజ్ (టోఫెల్)
అమెరికా వర్సిటీల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు శాట్ తో పాటు టోఫెల్ పరీక్ష కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారీన్ లాంగ్వేజ్ (టోఫెల్) అనేది అభ్యర్థుల ఇంగ్లిష్ నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు నిర్వహించే పరీక్ష. అభ్యర్థి విదేశీ యూనివర్సిటీలలో చేరితే అక్కడి ఇంగ్లిష్ బోధనను అర్థం చేసుకోగలడా? మాట్లాడగలడా? రాయడంలో అతడికి ఉన్న నైపణ్యం, ఇతరత్రా సామర్థ్యాలను ఈ పరీక్ష ద్వారా చూస్తారు. 10 2 పూర్తి చేసిన వారు దీన్ని రాసేందుకు అర్హులు. ఇంగ్లిష్ మాతృ భాషగా లేని దేశాల వారు అమెరికా వంటి ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో ఉన్నత విద్య కోసం ఈ పరీక్ష ద్వారా ఇంగ్లిష్ భాషా సామర్థ్యాలు ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని కళాశాలలు శాట్ లో టాప్ స్కోరు ఉన్న వారికి టోఫెల్ నుంచి మినహాయింపు కల్పిస్తున్నాయి. ఈ అవకాశం అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న యూనివర్సిటీలో ఉందా? లేదా? అన్నది పరిశీలించుకుని తదుపరి అడుగు వేయాలి. యూనివర్సిటీని సంప్రదించినప్పుడు ఇలాంటి మినహాయింపులు, కావాల్సిన అర్హతలపై పూర్తి వివరాలు పొందవచ్చు. 
ఇంగ్లిష్ మాట్లాడడం, రాయడం, చదవడం, వినడం అనే అంశాలపై పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. రీడింగ్ విభాగంలో 36 నుంచి 56 ప్రశ్నలు ఉంటాయి. 60 నుంచి 80 నిమిషాల వ్యవధి ఉంటుంది. మూడు నుంచి నాలుగు ప్యాసేజీలను చదివి వాటికి జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. రెండో పరీక్షలో లెక్చర్లు, క్లాస్ రూమ్ లో చర్చలు, సంభాషణలను విని 34 నుంచి 51 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సమయం 60 నుంచి 90 నిమిషాలు ఇస్తారు. స్పీకింగ్ సెక్షన్ లో టాపిక్స్ పై మాట్లాడాల్సి ఉంటుంది. ఇందులో ఆరు టాస్క్ లకు గాను 20 నిమిషాల సమయం ఇస్తారు. చివరిగా ఇంగ్లిష్ రాసే విభాగంలో రెండు టాస్క్ లు ఇచ్చి 50 నిమిషాల సమయం ఇస్తారు. 
అమెరికాలో చాలా వరకు టాప్ యూనివర్సిటీలలో ఎంఎస్ వంటి మాస్టర్స్ డిగ్రీలలో ప్రవేశాలకు టోఫెల్ లో 100 స్కోరు తప్పనిసరి. కొన్ని ప్రముఖ వర్సిటీలు 90 మార్కులు వచ్చినా ఆమోదిస్తున్నాయి. మిగతా వర్సిటీలో ప్రవేశాలకు కనీసం 80 స్కోరు అయినా ఉండాలి. ఏ యూనివర్సిటీ ఎంత స్కోరును చూస్తుందన్న విషయాన్ని http://www.msinus.com/content/toefl-cut-off-score-323/#.VvK2G9J95kg వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. యూనివర్సిటీ వెబ్ సైట్లలోనూ సమాచారం అందుబాటులో ఉంటుంది. 
టోఫెల్ పరీక్షను వారాంతపు రోజుల్లో ఏడాది పొడవునా నిర్వహిస్తుంటారు. దేశవ్యాప్తంగా 71 సెంటర్లలో జరుగుతుంది. పరీక్షకు సంబంధించి మరిన్ని వివరాలకు http://www.ets.org/toeflhttp://studyabroad.shiksha.com/exams/toefl/home ని సందర్శించవచ్చు. భారతీయులైతే స్వదేశంలో ఇంటర్నెట్ ఆధారిత పరీక్ష(ఐబీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుంతో మూడు రోజుల ముందు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ఫోన్, మెయిల్ ద్వారా, వ్యక్తిగతంగానూ మాస్టర్ టోఫెల్ ఐబీటీ సెంటర్ కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రం వివరాలకు https://www.ets.org/ వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా పూర్తి వివరాలపై అవగాహనకు రావచ్చు. పరీక్ష ఫీజు 160 నుంచి 250 డాలర్ల మధ్య ఉంటుంది.

ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్)
ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్) కూడా టోఫెల్ వంటిదే. దీన్ని బ్రిటిష్ కౌన్సిల్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, ఐడీపీ ఐఈఎల్టీఎస్ ఆస్ట్రేలియా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియంలో చదివేందుకు వీలుగా విద్యార్థికి అవసరమైన భాషా నైపుణ్యాలను ఈ పరీక్షలో భాగంగా అంచనా వేస్తారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అకడమిక్ లేదా జనరల్ ట్రైనింగ్ రీడిండ్... రైటింగ్ మాడ్యూల్స్ లో ఒక దాన్ని ఎంచుకునే సౌలభ్యం ఉంది. ఉన్నత విద్య కోసం అయితే అకడమిక్… విద్యాయేతర శిక్షణ, పని అనుభవం, ఇమిగ్రేషన్ అవసరాల కోసం అయితే, జనరల్ ట్రైనింగ్ పరీక్ష రాయాలి. అమెరికాలోని మూడువేల విద్యా సంస్థలతోపాటు బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని విద్యా సంస్థలు ఐఈఎల్టీఎస్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అమెరికాలోని చాలా వర్సిటీలు ఐఈఎల్టీఎస్ లో కనీసం 6 స్కోరును అడుగుతున్నాయి. యూనివర్సిటీల వెబ్ సైట్లలోనూ ఈ సమాచారం లభిస్తుంది. అలాగే http://www.msinus.com/content/180-ielts-universities-ielts-score-6-700/#.VvK4jdJ95kg  వెబ్ సైట్ ను చూడడం ద్వారా కొంత సమాచారం తెలుసుకోవచ్చు.  
ప్రపంచ వ్యాప్తంగా 1100 కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుంది. టెస్ట్ ఫార్మాట్ లో నాలుగు ఉప పరీక్షలు ఉంటాయి. రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ అంశాలపై పరీక్ష ఉంటుంది. ఈ నాలుగింటినీ రాయాల్సి ఉంటుంది. అకడమిక్, నాన్ అకడమిక్ రాసే వారు అందరూ లిజనింగ్, స్పీకింగ్ కామన్ గా రాయాలి. రీడింగ్, రైటింగ్ మాత్రం ఇద్దరికీ వేర్వేరుగా ఉంటుంది. మొత్తం 2.45 గంటల పాటు పరీక్ష ఉంటుంది. లిజనింగ్ విభాగంలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో దానిలో పది ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 30 నిమిషాల సమయం ఉంటుంది. స్పీకింగ్ పరీక్షకు 11 నుంచి 14 నిమిషాల సమయం ఇస్తారు. రీడింగ్ పేపర్ లో 60 నిమిషాల చొప్పున సమయం ఇస్తారు. మూడు సెక్షన్లు, నలభై ప్రశ్నలు ఉంటాయి. రైటింగ్ విభాగంలో రెండు టాస్క్ లు ఇస్తారు. 150 నుంచి 2750 వరకు పదాలు ఉంటాయి. 60 నిమిషాల సమయం ఉంటుంది. లిజనింగ్, రీడింగ్, రైటింగ్ ఈ మూడు విభాగాల్లోని పరీక్షలు ఒకరోజులోనే పూర్తవుతాయి. స్పీకింగ్ మాడ్యూల్ మరో రోజు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు https://www.britishcouncil.in/exam/ielts/test-dates-fees-and-locationshttps://www.ielts.org/ వెబ్ సైట్లను పరిశీలిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. 

గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ (జీఆర్ఈ)
ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్) అనే సంస్థ జీఆర్ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఎంఎస్, ఎంబీయే, ఎంఈఎం, డాక్టోరల్ వంటి కోర్సులలో ప్రవేశాలకు, ఫెలోషిప్ లు, పరిశోధన కార్యక్రమాల్లో ప్రవేశాల కోసం జీఆర్ఈ రాయాల్సి ఉంటుంది. భారత్ నుంచి ఎక్కువ మంది అమెరికాలో ఎంఎస్, బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సులు చేసేందుకు వెళుతున్న విషయం తెలిసిందే. గతంలో బిజినెస్ కోర్సుల కోసం వెళ్లేవారు కచ్చితంగా జీమ్యాట్ రాయాల్సి వచ్చేది. అయితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 600 వరకు బిజినెస్ స్కూళ్లు జీఆర్ఈ ఆధారంగానూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. యూరోప్, యూకే, ఆస్ట్రేలియా వర్సిటీలు సైతం జీఆర్ఈ స్కోరును ఆమోదిస్తున్నాయి. 
బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సు చేసిన వారు లేదా 16 సంవత్సరాల విద్య పూర్తి చేసుకున్న వారు ఎవరైనా సరే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, అమెరికాలోని వర్సిటీల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ అగ్రికల్చరల్, బీఆర్క్ కోర్సుల్లో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వారు జీఆర్ఈ రాయకుండానే నేరుగా మాస్టర్స్ ప్రోగ్రాములలో ప్రవేశం పొందవచ్చు. 
జీఆర్ఈలో హై స్కోరు ఉంటే సీటు వచ్చేస్తుందని అనుకోవద్దు. ఇంకా చాలా పారా మీటర్లలో అభ్యర్థుల అర్హతలను తేల్చిన తర్వాతే ప్రవేశం కల్పిస్తారు. భారత్ లో కంప్యూటర్ పై ఈ పరీక్ష ఉంటుంది. వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్ (క్వాంట్), అనలైటికల్ రైటింగ్ అనే మూడు విభాగాల్లో పరీక్ష ఉంటుంది. ప్రముఖ కళాశాలల్లో ప్రవేశం కావాలనుకుంటే కనీసం 320 మార్కులు సాధించాలి.  ఒక అభ్యర్థి ఏడాదిలో ఐదు సార్లు ఈ పరీక్ష రాయవచ్చు. రెండు పరీక్షల మధ్య 21 రోజుల విరామం ఉండాలి. 
సబ్జెక్ట్ టెస్టులు
జీఆర్ఈ జనరల్ టెస్ట్ తో పాటు ఏడు రకాల సబ్జెక్ట్ టెస్టులు కూడా ఉంటాయి. వీటి ద్వారా ప్రత్యేకంగా ఆ రంగంలో అభ్యర్థి నాలెడ్జ్ ను పరీక్షిస్తారు. బయోకెమిస్ట్రీ, సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, బయాలజీ, కెమిస్ట్రీ, లిటరేచర్ ఇన్ ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ సబ్జెక్టుల్లో ఒక దానిలో అభ్యర్థి విజ్ఞానాన్ని పరీక్షిస్తారు. 160 దేశాల్లో ఈ పరీక్ష జరుగుతుంటుంది. ఒకసారి పరీక్ష రాస్తే ఆ స్కోరును రెండేళ్ల వరకు యూనివర్సిటీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా కశాశాలలు, భారత్ లోని బిజినెస్ కళాశాలలు కూడా ప్రవేశాలకు జీఆర్ఈ స్కోర్ ను ఆమోదిస్తున్నాయి. 
జీఆర్ఈ జనరల్ టెస్ట్ ద్వారా వెర్బల్ రీజనింగ్, క్వాంట్, క్రిటికల్ థింకింగ్, అనలైటికల్ రైటింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. సబ్జెక్ట్ టెస్టులో ప్రత్యేకంగా ఆయా సబ్జెక్ట్ నైపుణ్యాన్ని అంచనా వేస్తారు. మొత్తం పరీక్షా సమయం 3 గంటల 45 నిమిషాలు. ఆరు సెక్షన్లు ఉంటాయి. అనలైటికల్ రైటింగ్ మొదటిది. ప్రతీ పరీక్షకు ఒక నిమిషం మాత్రమే బ్రేక్ ఉంటుంది. క్వాంట్ సెక్షన్ లో పదో తరగతి స్థాయి మ్యాథ్స్ పై ప్రశ్నలు ఇస్తారు. 20 ప్రశ్నలకు 35 నిమిషాల సమయం ఉంటుంది. 
వెర్బల్ రీజనింగ్ సెక్షన్ లో వొకాబ్యులరీ, ఇంగ్లిష్ లో ప్రాథమిక పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయి. దీనికి 30 నిమిషాల్లో 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఈ పరీక్షలో మంచి స్కోరు రావాలంటే కొన్ని నెలల ముందు నుంచే సాధన ప్రారంభించడం మంచిదని సీనియర్ విద్యార్థుల సలహా. అనలైటికల్ రైటింగ్ అసెస్ మెంట్ (ఏడబ్ల్యూఏ) సెక్షన్ లో రెండు చిన్న వ్యాసాలను రాయాల్సి ఉంటుంది. ఇందుకు 30 నిమిషాల సమయం ఇస్తారు. ప్రిపరేషన్ బుక్స్ ను పరిశీలించడం ద్వారా ఏ విధమైన రచనా తీరును కోరుతున్నదీ అభ్యర్థులు అర్థం చేసుకోవచ్చు.  ఒక్కో సెక్షన్ కు 170 మార్కుల చొప్పున మొత్తం 340 మార్కులు ఉంటాయి. రైటింగ్ పరీక్షకు ఆరు మార్కులు ఉంటాయి గానీ, దీన్ని మెయిన్ స్కోర్ కు కలపరు.  
అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలలో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారు జీఆర్ఈలో కనీసం 320 మార్కులు తెచ్చుకోవడం మంచిదని సీనియర్లు, నిపుణుల సూచన. 320 నుంచి 330 మధ్య స్కోరు ఉంటే సురక్షితమని భావిస్తారు. అత్యధిక స్కోరు ఉన్నంత మాత్రాన అడ్మిషన్ వస్తుందనే గ్యారంటీ లేదు. 338 మార్కులు తెచ్చుకున్నవారి దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురైన సందర్భాలు ఉన్నాయి. 300 మార్కులతోనూ పలు యూనివర్సిటీలలో ప్రవేశం సాధించవచ్చు. టాప్ యూనివర్సిటీలు ఎంత స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయన్న సమాచారాన్ని http://www.msinus.com/content/average-gre-scores-us-universities-219/#.VvKYmdJ95kh,  http://www.atozbulletin.com/2013/09/list-of-all-us-universities-based-on.html వెబ్ సైట్ లింకుల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఆయా యూనివర్సిటీ వెబ్ సైట్లను చూడడం ద్వారాను సమాచారం తెలుస్తుంది.  
ఆన్ లైన్, ఫోన్, ఫ్యాక్స్, మెయిల్ ద్వారా జీఆర్ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. ముందుగా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా తగిన మెటీరియల్ పొంది ప్రిపేర్ అవడానికి తగినంత సమయం ఉంటుంది. ww.gre.org వెబ్ సైట్ ను సందర్శించి మరిన్ని వివరాలు పొందడంతోపాటు పరీక్షకు నమోదు చేసుకోవచ్చు. 91-124-4147700 ఫోన్ నంబర్ కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చు. హైదరాబాద్ లో జీఆర్ఈ పరీక్షా కేంద్రం చిరునామా చూస్తే… 
HYDERABAD 8908, INDIA
PROMETRIC TESTING PVT LTD
Plot # 96, Road #2, Meenakshi Banjara Ville,
HYDERABAD

గ్రాడ్యుయేట్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్ )
అమెరికాతోపాటు పలు దేశాల్లో బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాల కోసం. ఎంబీయే వంటి డిగ్రీలు చేయాలనుకునే విద్యార్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్, మ్యాథ్స్ అంశాలతోపాటు, అనలైటికల్, లాజికల్ స్కిల్స్ ను పరిశీలిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల ప్రొగ్రామ్ లలో అడ్మిషన్లకు ఈ పరీక్షను ప్రామాణికంగా తీసుకుంటున్నారు .అమెరికాలోని బిజినెస్ స్కూళ్లు, యూరప్, ఇతర దేశాల్లో బిజినెస్ స్కూళ్లలో జీమ్యాట్ ద్వారా ప్రవేశం పొందవచ్చు. స్టాన్ ఫర్డ్, హార్వర్డ్, యేల్ వంటి టాప్ టెన్ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాలు పొందాలనుకుంటే జీమ్యాట్ లో 800 మార్కులకు గాను 720పైన మార్కులు తెచ్చుకోవాలి. మధ్యస్థాయి కాలేజీల్లో సీటు కోసం కనీసం 570 మార్కులైనా తెచ్చుకోవాలి. పరీక్ష రాసిన వారిలో మూడింట రెండు వంతుల మంది స్కోరు 400 నుంచి 600 మధ్యలో ఉంటోంది. 
ఈ పరీక్షలో భాగంగా డిగ్రీ కోర్సుల్లో అభ్యర్థి సాధించిన అనుభవం, మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఉన్న సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. భారత్ లోని మేనేజ్ మెంట్ స్కూళ్లు సైతం జీమ్యాట్ పర్సంటైల్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. దీనితోపాటు పర్సంటైల్, గ్రూపు డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థుల అర్హతను నిర్ణయిస్తారు. అనలైటికల్ రైటింగ్ అసెస్ మెంట్ సెక్షన్ కు 30 నిమిషాల సమయం ఇస్తారు. ఇంటెగ్రేటెడ్ రీజనింగ్ సెక్షన్ లో 12 ప్రశ్నలకుగాను 30 నిమిషాల సమయం ఉంటుంది. క్వాంట్ పై 37 ప్రశ్నలకు 75నిమిషాల వ్యవధి ఇస్తారు. వెర్బల్ కు సంబంధించి 41 ప్రశ్నలకు 75 నిమిషాల సమయంలో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. 
అనలైటికల్ రైటింగ్ అసెస్ మెంట్
అనలైటికల్ రైటింగ్ అసెస్ మెంట్ లో అభ్యర్థి కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని చూస్తారు. ఐడియాలు, తన ఆలోచనలను అభ్యర్థి ఎంత సమర్థవంతంగా చెప్పగలడనేది వ్యాసరచన ద్వారా నిర్ణయిస్తారు. 30 నిమిషాల సమయం ఇస్తారు. రాసిన తర్వాత అభ్యర్థి వ్యాసాన్ని కంప్యూటర్ ప్రోగ్రామ్ మదించి ఒక స్కోరు ఇస్తుంది. ఇది కాకుండా ఓ నిపుణుడు కూడా ప్రతీ పేపర్ ను ప్రత్యక్షంగా వాల్యుయేషన్ చేసి స్కోరు ఇస్తారు. రెండు స్కోర్లను కలిపి సగటు స్కోర్ ను ఖరారు చేస్తారు. 
ఇంటెగ్రేటెడ్ రీజనింగ్
భిన్న రకాల వేదికల నుంచి ఏరి కోరి తీసుకొచ్చిన డేటాను ఇచ్చి ఒక్కటిగా మదింపు చేయమంటే ఎలా చేస్తారు?  ఈ పరీక్షలో ఇలాంటివే అడగడం ద్వారా అభ్యర్థి సామర్థ్యాన్ని చూస్తారు. 12 ప్రశ్నలు, వాటిలో సబ్ పార్ట్స్ కూడా ఉంటాయి. టేబుల్, గ్రాఫ్స్ లు కూడా ఇస్తారు. 
క్వాంట్ సెక్షన్
ఆల్జీబ్రా, జామెట్రీ, అర్థమెటిక్ పై ప్రశ్నలు ఉంటాయి. గ్రాఫిక్ డేటా ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని అడుగుతారు. స్కోర్ రేంజ్ 0 నుంచి 60 మధ్యలో ఉంటుంది. 
వెర్బల్ సెక్షన్
డేటాను చదివి దాన్ని విశ్లేషించడం, సమాచారాన్ని సరిదిద్దడం వంటి టాస్క్ లు ఇందులో ఉంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్, క్రిటికల్ రీజనింగ్, సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది. జీమ్యాట్ పరీక్ష పూర్తయిన తర్వాత రాసిన తీరుపై సంతృప్తి అనిపించకపోతే పరీక్షా ఫలితాలను రద్దు చేయాలని కోరేందుకు అవకాశం ఉంది. అలా కోరిన తర్వాత తిరిగి పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. ఏడాదిలో ఐదు పర్యాయాలు మాత్రమే రాయడానికి అవకాశం ఉంటుంది. నాలుగు విభాగాలుగా ఈ పరీక్ష ఉంటుంది. 
జీమ్యాట్ పరీక్ష ఏడాది పొడవునా జరుగుతుంది. పరీక్షకు కొన్ని నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవడం నయం. స్లాట్లు పరిమితంగా ఉంటాయి కనుక ముందుగా బుక్ చేసుకుంటేనే స్లాట్ లభిస్తుంది. ఆన్ లైన్, ఫోన్, మెయిల్, ఫ్యాక్స్ ద్వారానూ నమోదు చేసుకోవచ్చు. జీమ్యాట్ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలకు http://www.mba.com/india వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు.
మెడికల్ కాలేజీ అడ్మిషన్ టెస్ట్ (ఎంక్యాట్)
నార్త్ అమెరికాలోని మెడికల్ కాలేజీలలో చేరాలంటే ఎంక్యాట్ రాయడం తప్పనిసరి. ఏడాది పొడవునూ ఈ పరీక్ష ఉంటుంది. నాలుగున్నర గంటల పాటు జరిగే పరీక్షలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. వెర్బల్ రీజనింగ్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్సెస్, వాలంటరీ ట్రయల్ సెక్షన్లున్నాయి. మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో జరిగే ఈ పరీక్షలో ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, రైటింగ్ నైపుణ్యాలు ఎలా ఉన్నదీ చూస్తారు. 

అమెరికాలో ఉన్నత విద్య కలను సాకారం చేసుకునేది ఎలా...?


అమెరికాలో ఉన్నత విద్య కలను సాకారం చేసుకునేది ఎలా...?


అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడం అన్నది భారతీయ విద్యార్థులకు అదొక ఎయిమ్! ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు, యూనివర్సిటీలు అక్కడ గణనీయ సంఖ్యలో ఉన్నాయి. వాటిల్లో చదివితే ఆ గుర్తింపే వేరు. పైగా అక్కడే ఉద్యోగం చేసుకోగల అవకాశాలు, రూపాయితో పోలిస్తే డాలర్ విలువ, సౌకర్య జీవనం ఇవన్నీ కూడా భారతీయ విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు చదువుతూనే ఉద్యోగం (పార్ట్ టైం) చేసుకుంటూ తగినంత ఆదాయాన్ని పొందే వెసులుబాటు కూడా ఉంది. అందుకే పేరొందిన విద్యా సంస్థలు ఆస్ట్రేలియా, యూకే, కెనడా తదితర దేశాల్లో ఎన్నో ఉన్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం అమెరికాకే మొగ్గు చూపుతుంటారు. ఎం.ఎస్.తో బాటు బిజినెస్ అండ్ మేనేజ్ మెంట్ కోర్సుల కోసం ఎక్కువ మంది అమెరికాను ఎంచుకుంటున్నారు.
స్వేచ్ఛతో కూడిన అత్యుత్తమ విద్య
స్వేచ్ఛతో కూడిన విద్య, బహుముఖ సంస్కృతి అమెరికాలోని అనుకూలతలు. అమెరికాలోని విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ముందుగా అభ్యర్థులు కొన్ని అర్హతలు సాధించాల్సి ఉంటుంది. టోఫెల్, శాట్ వంటి పరీక్షలు ఇందుకు అవకాశం కల్పిస్తాయి. అమెరికాలోని కళాశాలలు సాధారణంగా ప్రవేశాలు కల్పించే ముందు అభ్యర్థుల గ్రేడ్ పాయింట్ యావరేజ్, ప్రవేశ పరీక్షలో మార్కులు, ఇంగ్లిష్ భాషా నైపుణ్యం ఇతరత్రా అంశాల ఆధారంగా ఓ నిర్ణయానికి వస్తాయి. స్కాలస్టిక్ అసెస్ మెంట్ టెస్ట్ (శాట్), అమెరికన్ కాలేజీ టెస్టింగ్ (ఏసీటీ), శాట్ పరీక్షలను కళాశాలలు నిర్వహిస్తుంటాయి. ఇంగ్లిష్ పరిజ్ఞానం తగినంత లేదని భావిస్తే కొన్ని కళాశాలలు కోర్సు ప్రారంభానికి ముందుగా ఇంగ్లిష్ క్లాసులకు హాజరుకావాలనే నిబంధన మేరకు అవకాశం కల్పిస్తాయి. అడ్వాన్స్ డ్ ప్లేస్ మెంట్ ప్రొగ్రామ్ (ఏపీ)  కాలేజీ క్రెడిట్ కు అవకాశం కల్పిస్తుంది. ఏపీ ఎగ్జామ్స్ స్కోరు ఉంటే ప్రవేశాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఈ పరీక్షను అమెరికాతోపాటు 60 దేశాల్లోని కళాశాలలు గుర్తించాయి. అమెరికా ప్రభుత్వం విద్యా సంస్థలకు గుర్తింపు ఇచ్చేందుకు స్వతంత్ర విభాగాలను ఏర్పాటు చేసింది. ఇవే విద్యా సంస్థలకు గుర్తింపు ఇస్తాయి. అడ్మిషన్ తీసుకునే ముందు ఆయా సంస్థలకు గుర్తింపు ఉందా లేదా? పరీశీలించుకోవాలి. 
మూడు రకాల వీసాలు..
అమెరికాలో విద్యకు సంబంధించి స్టూడెంట్ వీసాల్లో ఎఫ్1, ఎం1, జే1 అని మూడు రకాలు ఉన్నాయి. అకడమిక్ కోర్సులైన ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్, డాక్టరేట్ ప్రోగ్రామ్స్ చేయాలనుకునే విద్యార్థులు ఎఫ్ 1 వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్2 అనే మరో వీసా ఉంది. ఎఫ్1 వీసా తీసుకునే వారిపై ఆధారపడినవారు.. అంటే భార్య, పెళ్లి కాని పిల్లలు (21 ఏళ్ల లోపు) కోసం ఉద్దేశించినది. ఎఫ్2 వీసాతో అమెరికా వెళ్లిన పిల్లలు అక్కడ ఎలిమెంటరీ, సెకండరీ స్కూళ్లలో చదువుకునేందుకు అవకాశం ఉంది. పైన చెప్పినవి కాకుండా నాన్ అకడమిక్ లేదా ఒకేషనల్ కోర్సుల కోసం ఎం1 వీసా తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తిపరమైన, భాషాపరమైన సర్టిఫికెట్ కోర్సుల్లాంటివి ఈ విభాగంలోకి వస్తుంటాయి. అలాగే, ఎం1 వీసా హోల్డర్లపై ఆధారపడిన వారి కోసం ఎం2వీసా. మూడో విభాగమైన జే1 వీసా విద్యా సంస్థల మధ్య ఒప్పందంలో భాగంగా విద్యార్థుల మార్పిడి, పరిమిత కాలం పాటు శిక్షణ కోసం వెళ్లే వారికి ఉద్దేశించినది. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, డాక్టరేట్ కోర్సుల తర్వాత పరిశోధనల కోసం ఈ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. వీరిపై ఆధారపడిన వారు అమెరికా వెళ్లేందుకు జే2 వీసా తీసుకోవాలి. 
నిబంధనలు పాటిస్తేనే...
స్టూడెంట్ వీసా తీసుకునే వారు అమెరికా చట్టాలకు అనుగుణంగా అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలి. వీసా జారీ చేయాలా? లేదా? అన్న సంపూర్ణ అధికారం కాన్సులర్ ఆఫీసర్ కు ఉంటుంది. కోర్సు ముగియగానే అమెరికా విడిచి వెళ్లిపోతామని స్పష్టంగా పేర్కొనాలి. కోర్సు పూర్తి చేసేందుకు అవసరమైన ఫీజులు, అమెరికాలో నివాసానికి అవసరమైన ఖర్చులకు తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయని అందుకు ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఎఫ్2, ఎం2, జే2 వీసా తీసుకునే వారు తమని తాము పోషించుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయని, కాలపరిమితి ముగియగానే అమెరికాను విడిచి వెళతామని ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఎఫ్2, ఎం2, జే2 వీసా కలిగిన వారు అమెరికాలో ఉద్యోగం, సంపాదించుకునేందుకు అవకాశం లేదు. 
వీసా కోసం ముందు ఇవి
ఎఫ్, ఎం వీసాలకు దరఖాస్తు చేసుకోవాలంటే... ముందుగా అమెరికాలో సంబంధిత విద్యా సంస్థలు ఐ20 పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుంది. జే వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు డీఎస్ 2019 పత్రాన్ని పొందాలి. ఈ పత్రాలతోనే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సు ప్రారంభానికి 120 రోజుల్లోపు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, కోర్సు ప్రారంభానికి 30 రోజుల ముందుగానే అమెరికాలో ప్రవేశించడానికి అనుమతిస్తారు. ఎఫ్1 వీసా హోల్డర్లకు పాస్ పోర్ట్ విషయంలో వెసులుబాటు ఉంది. కోర్సు పూర్తి కాకముందే పాస్ పోర్ట్ గడువు తీరిపోయినా కూడా అక్కడ ఉండేందుకు అనుమతి ఉంటుంది. అయితే, స్వదేశానికి తిరిగి వెళ్లాలంటే మాత్రం ముందుగా అక్కడి భారత ఎంబసీ నుంచి నూతన పాస్ పోర్ట్ తీసుకోవాలి. 
అమెరికాలోని స్కూళ్లల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విదేశీయులు చదువుకోవడానికి అవకాశం లేదు. సెకండరీ విద్య అంటే 9, 10 తరగతులు చదవాలని అనుకుంటే వారికి కూడా ఎఫ్1 వీసా జారీ చేస్తారు. అయితే, దీనికింద గరిష్ఠంగా 12 నెలలు మాత్రమే అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యకయ్యే వ్యయాన్ని సంబంధిత విద్యార్థి చెల్లించినట్టుగా ఆయా స్కూళ్లు ఐ20 పత్రంలో పేర్కొంటేనే వీసా జారీ అవుతుంది. 
ఎఫ్ 1 వీసాపై మొదటి ఏడాది క్యాంపస్ బయట పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడానికి నిబంధనలు అనుమతించవు. అమెరికా పౌర, వలసవాదుల సేవా విభాగం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మొదటి ఏడాది తర్వాత క్యాంపస్ వెలుపల పార్ట్ టైమ్ ఉద్యోగానికి అనుమతించవచ్చు. క్యాంపస్ లో చదువుకుంటూనే అక్కడే పార్ట్ టైమ్ ఉద్యోగ అవకాశం వస్తే ఎవరి అనుమతి లేకుండా చేసుకోవచ్చు. అది కూడా వారంలో 20 గంటలకు మించకూడదు. సెలవుల్లో, సమ్మర్ బ్రేక్ లో వారంలో 40 గంటల వరకు పని చేసుకోవచ్చు. నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం అమెరికా నుంచి అర్థాంతరంగా పంపించేస్తారు. ఎం1, జే1 వీసా హోల్డర్లు కూడా ఉద్యోగం చేయడానికి వీలు లేదు. 
ఫెడరల్ గవర్నమెంట్ చట్టాల ప్రకారం... 20 ఏళ్లలోపు వయసు ఉన్న పనివారికి గంటకు కనీసం 4.25 డాలర్లు వేతనంగా చెల్లించాలి. ఇది ఆ ఏడాదిలో మొదటి 90 రోజులకు వర్తిస్తుంది. 90 రోజులు దాటిన తర్వాత లేదా 20 ఏళ్ల వయసు వచ్చిన వారికి (ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది) గంటకు కనీసం 7.25 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులకు ఈ కనీస వేతనాల్లో 85 శాతానికి తగ్గకుండా చెల్లించాలి.
కొన్నింటిలో ఎక్కువే...
అయితే ఇవి కనీస వేతనాలు మాత్రమే. ఇంతే ఇవ్వాలని లేదు. డిమాండ్ ను బట్టి  పనిచేస్తున్న రంగాన్ని బట్టి ఇంతకంటే వేతనాలు ఎక్కువే చెల్లించవచ్చు. ఉదాహరణకు ట్యూటర్లు గంటకు సగటున 17 డాలర్లు వేతనంగా పొందుతున్నారు. అనుభవం ఎక్కువగా ఉంటే ఈ వేతనం కూడా అధిక స్థాయిలోనే ఉంటుంది. రెస్టారెంట్లలో ఫుడ్ వర్కర్ల వేతనం సగటున గంటకు 8 డాలర్లుగా ఉంది. కనీసం 7 డాలర్ల నుంచి గరిష్ఠం 9 డాలర్ల వరకు చెల్లిస్తుంటారు. అనుమతి లేకపోయినా చట్టవిరుద్ధంగా చాలా మంది విదేశీ విద్యార్థులు అమెరికాలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు. అక్కడి వ్యాపారస్థులు వీరి అవసరాన్ని అవకాశంగా తీసుకుని తక్కువ మొత్తాలకే పనిచేయించుకుంటుంటారు. పట్టుబడితే ఇరువురిపై చర్యలు తప్పదు. 
అమెరికాలో టాప్ వర్సిటీలు..
2015-16 సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో 30వరకు అమెరికా నుంచే ఉన్నాయి... వాటిపై ఓ సారి లుక్కేద్దాం... ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే నంబర్ 1గా మసాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నిలిచింది. ఫిజికిల్ సైన్సెస్, ఇంజనీరింగ్, బయాలజీ, ఎకనమిక్స్, లింగ్విస్టిక్స్, మేనేజ్ మెంట్ కోర్సులకు ఈ యూనివర్సిటీకి మంచి పేరుంది. హార్వర్డ్ యూనివర్సిటీ రెండో ర్యాంకులో ఉంటుంది. ఈ వర్సిటీ అందించే లైఫ్ సైన్సెస్, మెడిసిన్ కోర్సులకు మంచి గుర్తింపు  ఉంది.  స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ(3)లో బిజినెస్ కోర్సులు చదివితే తిరుగు ఉండదు. అంతేకాదు, ఈ యూనివర్సిటీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల విషయంలో ఎంఐటీ తర్వాత వరల్డ్ నంబర్ 2 స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఉన్న క్యాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...  రీసెర్చ్, సైన్స్, ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో టాప్ ప్లేస్ లో ఉంటుంది. ప్రపంచంలో పదో ర్యాంకులో నిలిచిన యూనివర్సిటీ ఆఫ్ చికాగో సైన్స్ ఆర్ట్స్ కోర్సులకు అత్యున్నతమైన విద్యా సంస్థగా పేర్కొంటారు. 89 మంది నోబెల్ బహుమతి విజేతలు ఇదే యూనివర్సిటీలో చదివిన వారే. తర్వాతి స్థానం ప్రిన్స్ టన్ యూనివర్సిటీది. 1746లో ఏర్పాటైన ఈ యూనివర్సిటీ అందించే ఆర్ట్స్, హ్యుమానిటీ కోర్సులకు చక్కని గుర్తింపు కలదు. యేల్ యూనివర్సిటీ అమెరికాలో టాప్ 7స్థానంలో ఉంది. ప్రపంచంలో 15వ ర్యాంకు సొంతం చేసుకుంది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన వారిలో ఐదుగురు ఈ వర్సిటీ విద్యార్థులే. అమెరికాలో తొలి పీహెచ్ డీ అందించింది కూడా ఇదే యూనివర్సిటీ. 
ప్రపంచంలో 16వ ర్యాంకులో ఉన్న జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధనల పరంగా విశిష్టత కలిగినది. కార్నెల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.స్వార్త్ మోర్ కాలేజ్, ద కాలేజీ ఆఫ్ విలియమ్ అండ్ మేరీ, విలియమ్స్ కాలేజీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా, డ్యూక్ యూనివర్సిటీ, వాషింగ్టన్ అండ్ లీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ విర్జీనియా, వాండర్ బిల్ట్ యూనివర్సిటీ, కాల్గేట్, రైస్, బ్రౌన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, కాపర్ యూనియన్, టెక్సాక్ ఏఅండ్ఎం యూనివర్సిటీ, జార్జియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కార్నెల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, అండ్ ఆస్టిన్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో, యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా ఎట్ లాస్ ఏంజెల్స్, నార్త్ వెస్ట్రన్స్ యూనివర్సిటీ, కొలంబియా, జార్జిటౌన్ యూనివర్సిటీ వంటివి ప్రముఖ వర్సిటీల జాబితాలో ఉన్నాయి.
విద్యకు కేంద్రాలుగా ఉన్న ప్రముఖ నగరాలు.. 
న్యూయార్క్ సిటీ: నిద్రించని నగరంగా దీనికి పేరు. కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు ఇది కేంద్రంగా ఉంది. 
బోస్టన్: మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీ, టఫ్స్ యూనివర్సిటీ, బ్రాండీస్ యూనివర్సిటీ, బోస్టన్ కాలేజీ, నార్త్ఈస్ట్రన్ కాలేజీ, నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలు ఇక్కడే ఉన్నాయి. సమీపంలోనే కేంబ్రిడ్జ్ సిటీ కూడా ఉంది.
చికాగో: యూనివర్సిటీ ఆఫ్ చికాగో, నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ఎట్ అర్బన్ క్యాంపెయిన్, ద యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగో, ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర విద్యాసంస్థలు ఇక్కడ కొలువై  ఉన్నాయి.
శాన్ ఫ్రాన్సిస్కో: స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా, బెర్క్ లీ ప్రపంచంలో టాప్ 50లో చోటు దక్కించుకున్న విద్యా సంస్థలు ఈ నగరంలో కొలువుదీరాయి.  
లాస్ఏంజెల్స్: ప్రపంచంలో 27వ ర్యాంకు సొంతం చేసుకున్న యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ ఇక్కడే ఉంది.
అమెరికాలో విద్యకు సంబంధించి పూర్తి వివరాలు, సహాయ సహకారాల కోసం చాలా సంస్థలు, విభాగాలు, సంఘాలు పనిచేస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అందులో ఒకటి. వివరాలకు http://www.usief.org.in/Study-in-the-US.aspx సైట్ చూడవచ్చు. http://www.usembassy.gov/http://travel.state.gov/content/visas/en.html సైట్ల నుంచి కూడా సమాచారం పొందవచ్చు. అలాగే, దగ్గర్లోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్ లోనూ సంప్రదించవచ్చు. 
ఎలా ఉండాలో తెలుసా...?
మొదటి సారి అమెరికా వెళ్లిన వారికి అక్కడ అంతా కొత్తగా అనిపిస్తుంది. తెలియని ప్రాంతం, పరిచయాలు లేని మనుషులు, కొత్త వాతావరణం, వేష భాషలు వేరు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్తదనాన్ని స్వీకరించి దానిలో ఇమిడిపోయేలా ప్రయత్నించాలి. అమెరికా వర్సిటీలు అన్నింటిలోనూ విదేశీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఓ కేంద్రం ఉంది. విద్యార్థులు తమకు కావాల్సిన సమాచారాన్ని, సాయాన్ని ఇక్కడ పొందవచ్చు. విదేశీ విద్యార్థులకు తరచూ ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. ఇతర విద్యార్థులు మీతో మాట్లాడుతున్నప్పుడు అడ్డు పడకుండా శ్రద్ధగా వినడమే మంచిది.
భారతీయ విద్యార్థులు డార్మిటరీలు, ప్రైవేటు గదుల్లో ఉండేందుకు మొగ్గు చూపుతుంటారు. అయితే, ఎందులో ఉన్నప్పటికీ యూనివర్సిటీకి దగ్గర ఉండేలా చూసుకోవాలి. యూనివర్సిటీ దగ్గర్లోని మెట్రో స్టేషన్ కు సమీపంలోనైనా ఉండేలా చూసుకోవాలి. ప్రైవేటు గదిలో ఉండడం కన్నా డార్మిటరీల్లో ఉండడమే తగినది, గ్యాస్, నీరు, కరెంటు బిల్లుల సమస్య ఉండదు. విదేశీ విద్యార్థులు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లేకుండా వైద్యం పొందడం గగనమే అవుతుంది. అందుకే యూనివర్సిటీలోని విదేశీ విద్యార్థుల సేవా కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.

మాట నిదానం...
అమెరికన్లతో మాట్లాడేప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... వారితో నిదానంగా స్పష్టంగా మాట్లాడాలి. అమెరికన్ల మాట తీరు చాలా వేగంగా ఉంటుంది. దాన్ని చూసి తాము కూడా వేగంగా మాట్లాడాలని భారతీయులు  ప్రయత్నిస్తుంటారు. దీంతో స్పష్టత లోపించి, భారతీయులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక అమెరికన్లు జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. ప్రొఫెసర్లు, అమెరికన్ విద్యార్థులతో ముచ్చటించడం ద్వారా అక్కడి చరిత్ర, సంస్కృతి తదితర విషయాలను తెలుసుకోవచ్చు. సాధారణంగా భారతీయ విద్యార్థులు ఇతర భారతీయ విద్యార్థులతో కలసి  వెళుతుంటారు. అయితే, అన్ని సార్లూ అలా చేయకుండా… అప్పుడప్పుడు అమెరికన్ సహచర విద్యార్థులతోనూ కలసి పనిచేయడం, ప్రయాణించడం వల్ల వారితో ఉన్న అంతరం తగ్గుతుంది.
అమెరికాలో భారతీయ వంటకాలు చాలా ఖరీదు. కనుక సొంతంగా వండుకోవడం వల్ల ఎంతో ఖర్చు ఆదా అవుతుంది. ఇంటి ఆహారమే తింటున్నామన్న సంతృప్తి కూడా ఉంటుంది. అమెరికాలో షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో కావాల్సిన వన్నీ అభిస్తాయి. ఇక్కడ వినియోగదారులపై అన్ని రకాల నిఘా ఉంటుంది. కనుక తీసుకున్న ప్రతీ వస్తువును బిల్ చేయించి చెల్లించడం మంచిది.
సోషల్ సెక్యూరిటీ నంబర్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు తదితర సున్నితమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. అలాగే, ఏటీఎం, ఆన్ లైన్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ లు తెలపాలంటూ వచ్చే మెయిల్స్ కు కూడా స్పందించవద్దు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. చుట్టూ ఉన్నవారిపై, పరిసరాలపై కన్నేసి ఉంచాలి. అప్రమత్తంగా ఉండడం ద్వారా చాలా నేరాలను తప్పించుకోవచ్చని అక్కడి పోలీసులు చెబుతుంటారు. రాత్రి సమయాల్లో క్యాంపస్ నుంచి బయటకు ఒంటరిగా రాకూడదు. గ్రూపుగా వెళ్లాలి. కంప్యూటర్, బుక్స్, సెల్ ఫోన్ ఇలా వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేదంటే చోరులు చిటికెలో మాయం చేసేస్తారు. ఎవరో వచ్చి తలుపు తడితే తీయవద్దు. సాధారణంగా అమెరికన్లు తెలిసిన వారయితేనే అదీ కనుక్కున్న తర్వాతే తీస్తారు. అదే సురక్షిత విధానం. పిలవకుండా తమంతట తాము ఎవరైనా వచ్చి తలుపుతడితే లోపలి నుంచి మాట్లాడడమే మంచిది. తలుపులు ఎప్పుడూ లాక్ చేసి ఉంచుకోవాలి. 

ఆయన ప్రస్థానం ఒక విజయ గ్రంథం... గ్రంధి మల్లికార్జునరావు

ఆయన ప్రస్థానం ఒక విజయ గ్రంథం... గ్రంధి మల్లికార్జునరావు


గ్రంధి మల్లికార్జునరావు.. క్లుప్తంగా జీఎంఆర్...ఈ పేరు చాలా మందికి సుపరిచితమే. అనతికాలంలోనే అసమాన్యరీతిలో భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించేశారు. ఒక్క రంగమనేమిటీ, పలు రంగాలను స్పృశించారు. మౌలిక సదుపాయాల కల్పనకే మొగ్గుచూపారు. దేశంలోనే అత్యంత వేగంగా దూసుకెళుతున్న కంపెనీని ఆవిష్కరించారు. బిలియనీర్ గా అవతరించారు. వేలాది మందికి ఉపాధి చూపారు. లక్షలాది మందికి చేయూతనందిస్తున్నారు. ఇంత ఎత్తుకు ఎదిగినా... సిబ్బంది, కుటుంబ సభ్యుల సహకారంతోనే పైకెదిగానంటూ వినమ్రంగా సెలవిచ్చే జీఎంఆర్.. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కార్యకలాపాలను విశ్వవ్యాప్తం చేసేశారు.
‘పది’తో సమస్య... పనితో పరిష్కారం 
తెలుగు ప్రజల మదిలో పదో తరగతి గట్టెక్కితే...ఫరవా లేదు, బాగానే చదివేస్తాడంటూ గూడుకట్టుకున్న భావనను అప్పటికి ఆ పదహారేళ్ల మల్లికార్జున రావు గ్రహించలేకపోయాడేమో. అందుకే ఆయన పదో తరగతి పరీక్ష తప్పినట్లుగా ఉంది. అయితే ఫెయిలైన అతడిని, తండ్రి బడి మాన్పించేశారు. తాను చేస్తున్న బంగారం వ్యాపారంలో సాయంగా ఉండమన్న తండ్రి ఆజ్ఞతో రెండేళ్ల పాటు విద్యకు దూరంగానే ఉన్నాడు. చదువుకుంటానన్న కోరికను తల్లికి చెప్పి, ఎలాగోలా మళ్లీ బడిబాట పట్టాడు. ఈసారి కాస్త గట్టిగానే చదువుపై దృష్టిపెట్టిన అతడు ఆంధ్రా యూనివర్సిటీలో మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ పట్టా సాధించాడు. ఆపై ఓ రెండు ఉద్యోగాలు చేసి, ఏకంగా సొంతంగా కంపెనీనే ప్రారంభించిన అతడు, ఆపై వెనుదిరిగి చూడలేదు. 1950 జూలై 14న శ్రీకాకుళం జిల్లా రాజాంలో పుట్టిన మల్లికార్జున రావు... జీఎంఆర్ గా బెంగళూరును తన నివాసంగా మార్చుకుని తన ప్రత్యర్థులకు అందనంత వేగంగా వ్యాపార విపణిలో దూసుకుపోతున్నారు.
జ్యూట్ మిల్లుతో మొదలుపెట్టి...
తండ్రి మరణం తర్వాత శ్రీకాకుళంలోని బంగారం, జ్యూట్ వ్యాపారాన్ని వదులుకుని మల్లికార్జున రావు రాజమండ్రిలోని ఏపీ పేపర్ మిల్లు ఉద్యోగంలో చేరారు. అనంతరం వంశధార ప్రాజెక్టులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరారు. రాజమండ్రిలో ఉండగానే, జ్యూట్ వ్యాపారంలో మార్వాడీల నైపుణ్యతను, వివిధ వర్గాల వారు చేసే గిమ్మిక్కులను తొందరగానే ఔపోసన పట్టారు. వంశధార ప్రాజెక్టు విధుల్లో భాగంగా నిర్మాణ రంగంలోని మెళకువలను నేర్చుకున్న మల్లికార్జున రావు 1978లో సొంతంగా ‘కాటన్ ఇయర్ బడ్స్’ ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఈ నేపథ్యంలోనే షావాలెస్ భాగస్వామ్యంతో నెలకొల్పిన బ్రూవరీని, ఆ తర్వాత లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అమ్మేశారు. దానితో పాటుగా స్వల్ప మోతాదులో చేపట్టిన ఇన్స్యూరెన్స్ వ్యాపారాన్ని రహేజాలకు విక్రయించారు.
ఒక్క ’అవకాశం’ జీవితాన్నే మార్చేసింది
అలా కాలం నడుస్తున్న క్రమంలో ఓ భారీ కాంట్రాక్టు మల్లికార్జునరావును జీఎంఆర్ గా మార్చేసింది. వ్యాపార దిగ్గజాలు కూడా ఈర్ష్య పడే స్థాయికి ఎదిగేలా చేసింది. అదే, 1991లో ఆయన చేతికందిన హైదరాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టు. అప్పటికే మౌలిక సదుపాయాల రంగంలో ఆరితేరిన ఎల్ అండ్ టీ వంటి కంపెనీలు బిడ్లు వేసినా, ఆ టెండర్ ను జీఎంఆర్ చేజిక్కించుకున్నారు. కాంట్రాక్టైతే దక్కింది, మరి విమానాశ్రయ నిర్మాణంలో తనకు ఏమాత్రం అనుభవం లేదే, మరేం చేయాలన్న సంశయంలో నుంచి జీఎంఆర్, తన ఆలోచనల వేగం పెంచడమే కాక, వాటిని అంతే వేగంగా అమలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ రంగంలో అనుభవం గడించిన వారిని సంప్రదించిన జీఎంఆర్... జర్మనీ, మలేసియా, సింగపూర్ తదితర దేశాల నిపుణుల సలహాలు తీసుకున్నారు. తన సిబ్బందికి వారి చేత పాఠాలు చెప్పించారు. ఇంకేం, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. దీంతో ఒక్కసారిగా జీఎంఆర్ పేరు భారత్ లోనే కాక ఇతర దేశాల వాణిజ్య వర్గాల్లో మారుమోగింది. అంతేకాదు, ఆయన జీఎంఆర్ గ్రూప్ షేర్ విలువను అమాంతం పెరిగిపోయింది.
అంచెలంచెలుగా ఎదిగిన జీఎంఆర్ గ్రూప్
1978లో ఓ చిన్న ఫ్యాక్టరీతో మొదలైన జీఎంఆర్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగింది. విమానాశ్రయాల నిర్మాణంతో పాటు విద్యుత్ రంగంలోనూ కాలుమోపింది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలతో పాటు టర్కీ, మాల్దీవ్స్ దేశాల్లో కూడా విమానాశ్రయాలను నిర్మించింది. విద్యుత్ రంగంలోకి కాలిడిన అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా 13 విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో మూడు కేంద్రాలు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించగా, మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటితో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో ఒక్కో ప్రాజెక్టు చొప్పున సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పింది. జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే జీఎంఆర్ గ్రూప్, ఆరు ప్రాజెక్టులను పూర్తి చేసింది. మౌలిక సదుపాయాల రంగంలో భాగంగా జీఎంఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, భారత్ తో పాటు  నేపాల్ లోనూ పలు ప్రాజెక్టులు చేపట్టింది. జీఎంఆర్, దేశంలో అత్యంత వేగంగా దూసుకెళుతున్న సంస్థగా ఖ్యాతిగాంచింది. మరోవైపు జీఎంఆర్, ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పలు అవార్డులతో పాటు పలు వర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లను కూడా అందుకున్నారు. ఇక పేరు ప్రఖ్యాతులతో పాటు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న జీఎంఆర్... తెలుగు నేల కుబేరుడిగానూ ఖ్యాతి గాంచారు.
సామాజికాభివృద్ధికీ సముచిత స్థానం
ఓ వైపు జెట్ స్పీడ్ తో జీఎంఆర్ గ్రూపును పరుగులు పెట్టిస్తున్న జీఎంఆర్, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలనూ ముమ్మరం చేశారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి, భారీ నిధులతో సంక్షేమ కార్యక్రమాలకు తెరలేపారు. ఈ కార్యక్రమాలు జీఎంఆర్ గ్రూప్ ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతాల్లోనే కేంద్రీకృతమైనప్పటికీ... రాష్ట్రం, దేశం దాటి విశ్వవ్యాప్తమయ్యాయి. ఈ ఫౌండేషన్ కింద విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం, స్వావలంభన, జీవనోపాధి, సమాజ అభివృద్ధి తదితర విభాగాల్లో విశ్వవ్యాప్తంగా 22 ప్రదేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారత్ లో తన సొంత ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో పది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఈ కార్యక్రమాల కోసం జీఎంఆర్ పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తోంది.
కుటుంబం లాగే సిబ్బంది కూడా.
జీఎంఆర్ ఫిలాసఫీ ప్రకారం, కుటుంబాన్ని నడిపినట్లుగానే కంపెనీని నడపాలట. ఇదే సిద్ధాంతం ప్రకారం ముందుకెళుతున్న జీఎంఆర్, సిబ్బందిని కూడా కుటుంబ సభ్యుల్లాగే పరిగణిస్తారని పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. కుటుంబాన్ని సమర్ధవంతంగా నడపగలిగితే, కార్పోరేట్ సంస్థను కూడా విజయవంతంగా నడపడం అంత కష్టమైన పనేమీ కాదని జీఎంఆర్ తన మిత్రులతో గట్టిగానే చెప్పేస్తారు. తాను సాధించిన విజయంలో తన కుటుంబ సభ్యుల పాత్ర ఎంత ఉందో, సిబ్బంది పాత్ర కూడా అంతే ఉందని చెప్పే ఆయన, సిబ్బంది సహకారం లేకుండా ఏ కంపెనీ కూడా ముందడుగు వేయలేదన్న విశ్వాసాన్ని ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే జీఎంఆర్ గ్రూపు దేశంలోని ఏ ఒక్క కంపెనీ అందుకోలేనంత వేగంతో దూసుకెళుతోంది.
ఆస్తి మొత్తం ఫౌండేషన్ కే...
జీఎంఆర్, మూడు సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తారని ఆయన కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది నిత్యం చెప్పుకుంటారు. అందులో వ్యాపార నిర్మాణం మొదటిదైతే, వ్యవస్థ నిర్మాణం రెండోదిగా చెబుతారు. ఇక మూడోదిగా కుటుంబ సమర్ధ నిర్వహణ. ఇప్పటిదాకా ఈ మూడింటిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేసిన ఆయన తాజాగా నాలుగో సిద్ధాంతాన్ని అమలులోకి తీసుకొచ్చారని వల్లె వేస్తున్నారు. ఆ నాలుగోదే, సమాజం నుంచి తీసుకున్న దానిని తిరిగి సమాజానికి ఇవ్వడం! దీనిపై ప్రస్తుతం కాస్త ఎక్కువగా దృష్టి సారించిన జీఎంఆర్, తన తదనంతరం తన వ్యక్తిగత ఆస్తి మొత్తం, వరలక్ష్మి ఫౌండేషన్ కు చెందేలా 2011, మార్చిలోనే వీలునామా కూడా రాసేశారు. 

ముందుచూపే ఆయన విజయం... దేశీయ ఐటీ రంగంలో నాడార్ ముద్ర!

ముందుచూపే ఆయన విజయం... దేశీయ ఐటీ రంగంలో నాడార్ ముద్ర!


ఆర్థిక మాంద్యం... బడా పారిశ్రామిక వేత్తలనే ఊపిరి సలపనివ్వలేదు. ఇక ఐటీ రంగాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఐటీ ఉద్యోగులనూ రోడ్డు పాల్జేసింది. అయితే నాడార్ ను మాత్రం కనీసం తాకను కూడా తాకలేకపోయింది. అందరిలా కాకుండా కాస్త భిన్నంగా వెళ్లే ఆయన శైలే, ఆయనకు శ్రీరామ రక్షలా నిలిచింది. అవును మరి, అందరిలా ‘వినియోగదారుల తర్వాతే మాకు ఎవరైనా’ అనే కోవకు చెందిన వారు కాదు నాడార్. ‘ఫస్ట్ సిబ్బంది, తరువాతే వినియోగదారుడు’ అంటూ విభిన్నంగా ముందుకెళ్లిన తత్వమే  ఆయనను మాంద్యం బారిన పడకుండా కాపాడింది. మరి ఆయన కంపెనీలకు వినియోగదారులు అక్కర్లేదా? అంటే, సదరు జాబితాలో నోకియా, హెచ్ పీ తరహా కంపెనీలెన్నో. కష్టపడి పనిచేసే సిబ్బంది లేకపోతే, ఎదిగేదెలాగంటారు తమిళ నాడుకు చెందిన శివ్ నాడార్. నిజమే మరి.., సిబ్బంది కృషి లేకుండా ఎదిగిన కంపెనీలు దాదాపుగా ఉండవేమో. ఈ సూత్రం ఆధారంగానే దేశీయ స్థాయిని దాటి విశ్వ విపణిలో అద్భుతాలు నమోదు చేసిన ఆయన, ప్రస్తుతం తన దాతృత్వ గుణానికి పదును పెడుతున్నారు. 
అందరిలాగే...ఉద్యోగిగా మొదలై...!
తమిళ నాడు రాష్ట్రం ట్యూటికోరిన్ జిల్లా, మూలైపోజీ గ్రామంలో శివ సుబ్రహ్మణ్యం, వమ సుందరీ దేవీ దంపతులకు 1945లో జన్మించిన శివ్ నాడార్, మధురైలోని అమెరికన్ కాలేజీలో కళాశాల విద్య పూర్తి చేశారు. అనంతరం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో పీఎస్ జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా సాధించారు. అనంతరం అందరిలాగే ఆయన ఉద్యోగ వేట మొదలెట్టి, 1967లో పుణే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాల్ చంద్ గ్రూపు కంపెనీ ‘కూపర్ ఇంజినీరింగ్’ లో ఉద్యోగిగా చేరారు. ఇక్కడున్న సమయంలోనే ఆయన మదిలో సొంతంగా కంపెనీ ప్రారంభించాలనే యోచన మొగ్గ తొడిగింది. ఈ యోచనకు సహోద్యోగులుగానే కాక, స్నేహితులూ అయిన అజయ్ చౌధరి, అర్జున్ మల్హోత్రా, సుభాష్ అరోరా, యోగేశ్ వైద్య, డీఎస్ పూరిల సహకారం కూడా తోడైంది. ఇంకేముంది, అందరూ కూపర్ ఇంజినీరింగ్ నుంచి బయటకు వచ్చేశారు. చిన్న కంపెనీతో మొదలుపెట్టి, ఉన్నత శిఖరాల వైపు దూసుకెళ్లారు. 

క్యాలిక్యులేటర్ తయారీతో ప్రయాణం ప్రారంభం
తొలుత ఆరుగురు మిత్రులు  కలిసి ‘మైక్రోకాంప్’ అనే సంస్థను నెలకొల్పి ‘టెలివిస్టా’ పేరిట టెలీ డిజిటల్ క్యాలిక్యులేటర్ ను ఆవిష్కరించారు. ఆ తర్వాత 1976లో ఆరుగురు మిత్రులు తమ వద్దనున్న రూ.1,87,000లతో హెచ్ సీఎల్ ను నెలకొల్పారు. అదే సమయంలో నాటి పరిశ్రమల శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానాలతో విసుగెత్తిన ఐబీఎం భారత్ ను వదిలివెళ్లిపోయింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నాడర్ మిత్ర బృందం, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ముందుకెళ్లింది. ఐబీఎం నిష్క్రమణ నేపథ్యంలో నాడార్ కంపెనీ రూపొందించిన మైక్రో కంప్యూటర్ కు అసలు పోటీనే లేకుండా పోయింది. అంతేకాక అప్పుడప్పుడే మొదలైన సాంకేతిక విప్లవం, హెచ్ సీఎల్ లాభాల బాటలో శరవేగంగా పరుగెత్తేందుకు దోహదపడింది. ఈ వేగానికి ఏమాత్రం బ్రేకులు వేయరాదని నిర్ణయించిన నాడార్, కంపెనీ ప్రారంభమైన నాలుగేళ్లకే దాని పరిధిని దేశం దాటించేశారు. 

పెట్టుబడిదారుడిగానూ క్లిక్!
హెచ్ సీఎల్ మైక్రో కంప్యూటర్ ఇచ్చిన బూస్ట్ తో తొలుత సింగపూర్ లో కాలుమోపిన నాడార్, ఫార్ ఈస్ట్ కంప్యూటర్స్ పేరిట హార్డ్ వేర్ ను విక్రయించే సంస్థను నెలకొల్పారు. అదే సమయంలో మరో ముగ్గురితో కలిసి ఎన్ఐఐటీ (నిట్)కూ పునాది వేశారు. సంస్థ యాజమాన్యాన్ని తీసుకోని నాడార్, కేవలం అందులో పెట్టుబడిదారుడిగానే కొనసాగారు. అయితే సదరు కంపెనీలో 2003 దాకా మెజార్టీ వాటా నాడార్ దే కావడం గమనార్హం. కంప్యూటర్ విద్యా బోధనలోని భారీ అవకాశాలను చేజిక్కించుకునేందుకే ఆయన నిట్ ఏర్పాటుకు నడుం బిగించారు. ఆయన అంచనాల మేరకు నిట్, తారస్థాయికి చేరుకున్న సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ సంస్థగా ఖ్యాతిగాంచింది. ఇందులో చేరాలని ఆశపడని విద్యార్థి లేడంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. 1984లో పర్సనల్ కంప్యూటర్ సొల్యూషన్స్ విభాగంలో బిజీబీ, యునిక్స్ ఫ్లాట్ ఫామ్ లను అభివృద్ధి చేశారు. ఆఫ్ లైన్ సొల్యూషన్ విభాగంలో సేవలందించే క్రమంలో మొదలైన హెచ్ సీఎల్, 1987 నాటికి ఆ రంగంలో భారత్ లోనే తొలి స్థానంలో నిలవడంతో పాటు రూ.100 కోట్ల ఆదాయంతో ఒక్కసారిగా నాడార్ పేరును మారుమోగేలా చేసింది. 

విశ్వ విపణిలోకి మరింత దూకుడుగా...!
భారత ఐటీ రంగంలో శిఖరాగ్రానికి చేరుకున్న నాడార్, విశ్వ వాణిజ్య రంగంలో మరింత దూకుడును పెంచారు. భారత్ లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో అడుగేసిన ఆయన, విశ్వ వాణిజ్య రంగాన్ని దృష్టిలో పెట్టుకుని 1989లో హెచ్ సీఎల్ అమెరికాను నెలకొల్పారు. అయితే ఈ దూకుడు ఆయనను వెనక్కు తగ్గేలా చేసింది. ప్రపంచ ఐటీ రంగంలోని అవకాశాలపై నాడార్ అంచనాలు తల్లకిందులయ్యాయి. హెచ్ సీఎల్ లాభాలను తెచ్చిపెట్టకపోవడంతో పాటు నాడార్ గ్రాఫ్ ను కిందకు లాగేసింది. దీంతో అప్పటికే ఆ రంగంలో విశేష అనుభవం సాధించిన సంస్థలతో జతకట్టక తప్పలేదు. ఈ నేపథ్యంలో హ్యూలెట్ ప్యాకార్డ్ (హెచ్ పీ) తో కలిసి సంయుక్తంగా హెచ్ సీఎల్ హెచ్ పీ లిమిటెడ్ స్థాపనకు దారితీసింది. 1990 దశకం మధ్యలో నోకియా, ఎరిక్సన్ ల ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

 ఇలా  ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా ముందుకెళ్లిన నాడార్, 1995 నాటికి హెచ్ సీఎల్ ఛత్రం కింద 40 అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయగలిగారు. హార్డ్ వేర్, ఐటీ ఆధారిత సేవల రంగంపైనా దృష్టి సారించిన ఆయన హెచ్ సీఎల్ కన్సల్టింగ్ పేరిట మరో సంస్థను నిర్మించారు. అంతకుముందు హెచ్ పీతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ హెచ్ సీఎల్ కన్సల్టింగ్ లో విలీనమైపోయింది. దీంతో హెచ్ పీతో వ్యాపార బంధాన్ని ముగించినట్లైంది. ఆ తర్వాత 1996లో దీనినే హెచ్ సీఎల్ టెక్నాలజీస్ గా మార్చారు. 1998లో మొత్తం సంస్థలన్నింటినీ కలిపిన నాడార్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, హెచ్ సీఎల్ ఇన్ ఫో సిస్టమ్స్, హెచ్ సీఎల్ కామ్నెట్, హెచ్ సీఎల్ పెరాట్, నిట్ ల పేరుతో ఐదు విభాగాలుగా విభజించి ముందుకు సాగారు.

పబ్లిక్ ఇష్యూలతో సంచలనాలు
1999లో పబ్లిక్ ఇష్యూకెళ్లిన హెచ్ సీఎల్ సంచలనాలను నమోదు చేసింది. పబ్లిక్ ఇష్యూతో ఒక్కసారిగా రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది. అప్పుడప్పుడే ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న దశలో 2000లో తన పోటీదారులను వెనక్కి నెట్టేసిన నాడార్ సులువుగా ముందుకెళ్లిపోయారు. పబ్లిక్ ఇష్యూలో భారీ ఆదరణ కూడగట్టిన నాడార్, 2001లో ఇతర కంపెనీలను చేజిక్కించుకునేందుకు యత్నాలు మొదలుపెట్టారు.

ఈ క్రమంలో డచ్చీ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసిన ఆయన, ఆ తర్వాత అపోలో కాంట్రాక్ట్ ను చేజిక్కించుకుని ఫైనాన్సియల్ సర్వీస్ మార్కెట్ లోకి అడుగు పెట్టారు. 2005 వరకు ఈ తరహా యత్నాలను కొనసాగించారు. ఇదే క్రమంలో ఐదు విభాగాలుగా ఉన్న తన కంపెనీని, కొనుగోలు చేసిన కంపెనీలతో కలిపేసి రెండు విభాగాలుగా వర్గీకరించారు. అవే హెచ్ సీఎల్ టెక్నాలజీస్, హెచ్ సీఎల్ ఇన్ ఫో సిస్టమ్స్. 2007లో వినీత్ నాయర్ ను హెచ్ సీఎల్ సీఈఓగా నియమించిన నాడార్, తాను మాత్రం కంపెనీ చైర్మన్ పదవికి పరిమితమయ్యారు. అయితే అందులో ఇప్పటికీ నాడారే అతిపెద్ద షేర్ హోల్డర్ గా కొనసాగుతున్నారు. దేశీయ ఐటీ పరిశ్రమకు సరికొత్త జవసత్వాలు నింపిన కారణంగా భారత ప్రభుత్వం ఆయనను 2008లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 

సేవా కార్యక్రమాల్లోనూ ముందంజ
మూడు దశాబ్దాలుగా దేశీయంగానే కాక అంతర్జాతీయంగానూ వ్యాపార విస్తరణలో అలుపెరగకుండా పరుగులు తీసిన నాడార్, ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. సంపాదన మొదలైన నాటి నుంచే, తాను సంపాదించిన దానిలో నుంచి 10 శాతాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ వచ్చిన ఆయన, రానున్న ఐదేళ్లలో ఏకంగా రూ.4 వేల కోట్లను సేవా కార్యక్రమాలకు వెచ్చించనున్నారు. అంతేకాదు, తన కంపెనీలో తనకున్న వాటాలో నుంచి 2 శాతం వాటాను విక్రయించగా అందిన రూ.585 కోట్లను సేవా కార్యక్రమాలకే మళ్లించారు. అంతకుముందే విద్యపై తనకున్న మమకారం నేపథ్యంలో తండ్రి పేరుతో 1996లో శ్రీ సుబ్రహ్మణ్య నాడార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పేరిట కళాశాలను ఏర్పాటు చేశారు.

 ఈ మధ్యనే శివ నాడార్ ఫౌండేషన్ పేరిట ఓ సంస్థను నెలకొల్పి, పేదలకు విద్యాదానం చేసేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో ‘విద్యా జ్ఞాన్’ పేరిట ఓ పాఠశాలను 2008లో ఏర్పాటు చేశారు. ఇందులో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఒక్క పైసా తీసుకోకుండానే ఉత్తమ విద్యను అందిస్తున్నారు. ఇలాంటి మరో పాఠశాలను లక్నో సమీపంలోనూ ఏర్పాటు చేస్తున్నారు. మరో రెండు పాఠశాలలు కూడా భవిష్యత్తులో ఏర్పాటు కానున్నాయి. శివ్ నాడార్ వర్సిటీ పేరిట రూపొందించనున్న విద్యాలయంలో ఒకే ఏడాది  8,000 మంది విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసించేందుకు తగిన ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. సేవా కార్యక్రమాలన్నింటిలో విద్యాదానం మిన్నదని చెప్పే నాడార్, ఆ దిశగా స్థిర చిత్తంతో ప్రయాణిస్తున్నారు.

విలువల నిచ్చెనపై... 'విప్రో' సారథి!

విలువల నిచ్చెనపై... 'విప్రో' సారథి!


21 ఏళ్ల యవ్వనంలో ప్రతిష్ఠాత్మక వర్సిటీ... స్టాన్ ఫోర్డ్ లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న అజిమ్ హషిమ్ ప్రేమ్ జీ, ఇంకొంత కాలం ఉంటే చదువు పూర్తి చేసేవాడే. అయితే, ఓ రోజు పిడుగులాంటి వార్త అందింది. తండ్రి ఎంహెచ్ హషిమ్ ప్రేమ్ జీ మరణ వార్తను మోసుకొచ్చిన ఆ సందేశంతో ఉన్నపళంగా స్వదేశం వచ్చేయాల్సి వచ్చింది. అయితే మళ్లీ స్టాన్ ఫోర్డ్ వెళ్లే వెసులుబాటు అతడికి చిక్కలేదు. తండ్రి ఆకస్మిక మరణం నేపథ్యంలో కుటుంబంతో పాటు తమనే నమ్ముకున్న వందలాది మంది కార్మికుల జీవనోపాధిని అతడు భుజాన వేసుకోవాల్సి వచ్చింది. తప్పలేదు మరి. ఇంకేముంది... ఇంజినీర్ కావాలన్న కల మధ్యలోనే కొండెక్కేసింది. ఓనమాలు తెలియకుండానే వ్యాపార రంగంలోకి దిగాల్సి వచ్చింది. కాకపోతే తండ్రి తనలో నూరిపోసిన విలువల మంత్రం అప్పటికప్పుడు నిద్ర లేచింది. ముందడుగు వేయమంటూ ఉద్బోధిస్తూ ఊహించని తీరాలకు పరుగులు పెట్టించింది. వందలుగా ఉన్న కార్మికుల సంఖ్య వేలు కూడా దాటేసి, లక్షను తాకింది. అయితే ఈ పరిణామానికి కొంత కాలమైతే పట్టింది కాని, అతడి కీర్తితో పాటు భారత ప్రతిష్ఠ విశ్వవ్యాప్తవంగా మరింత ఇనుమడించింది. 
పట్టుదలతో ఇంజినీరింగ్ సాధించిన ప్రేమ్ జీ
తండ్రి ఆకస్మిక మరణం నేపథ్యంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ను మధ్యలోనే వదిలేసి వచ్చిన ప్రేమ్ జీ, ఎలాగైనా ఇంజినీరింగ్ పట్టాను చేపట్టాల్సిందేనని నిర్ణయించుకున్నారు. అందుకే వదిలేసి వచ్చిన పాఠాలను దూరవిద్య విధానంలో అభ్యసిస్తానని వర్సిటీ అధికారులను ఒప్పించి మరీ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇక చదువు మీదకు దృష్టి సారించే తీరిక ఆయనకు చిక్కలేదు. తండ్రి అప్పగించిపోయిన వ్యాపారాన్ని నిర్వహించేందుకే సమయమంతా సరిపోతుంటే, ఇక చదివెలా సాధ్యం? అందుకే చదువుపై మమకారం వదులుకున్న ప్రేమ్ జీ, దానికి దూరమైన పిల్లలకు మాత్రం చదువు చెప్పించేందుకు కష్టపడుతున్నారు. ఖర్చు పెడుతున్నారు కూడా.
1945, జూలై 24న ముంబైలో జన్మించిన ప్రేమ్ జీ...1966 నాటికే వ్యాపార పగ్గాలు చేపట్టారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుదామనుకుంటే... మెకానికల్, కంప్యూటర్ ఇంజినీరింగ్ నిపుణులు చేయాల్సిన పనులు చేపట్టాల్సి వచ్చిన ప్రేమ్ జీ, అందులో ఆ రంగాల నిపుణులను తలదన్నేలా రాణించారు. తనకు పరిచయం లేని రంగంలోకి కొండంత విశ్వాసంతో దిగి, అనూహ్య ఫలితాలు సాధించారు. మార్కెట్ వర్గాలు ముక్కున వేలేసుకునేలా చేశారు. ఆఖరుకు యావత్తు భారత దేశానికే టెక్నాలజీ కింగ్ గా అవతరించారు. 
నూనెల తయారీతో రంగ ప్రవేశం
జీవించి ఉన్నంత కాలం నూనెల తయారీ వ్యాపారం కొనసాగించిన హషిమ్ ప్రేమ్ జీ, పోతూపోతూ తన వ్యాపారాన్ని అజిమ్ ప్రేమ్ జీకి వారసత్వంగా ఇచ్చి వెళ్లారు. దీంతో అనుభవం, ఇష్టం లేకున్నా ఆ వ్యాపారంలోకి ప్రేమ్ జీ దిగేయాల్సి వచ్చింది. ఒక్కసారి అందులో కాలుపెట్టిన ఆయన, వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. నూనెలు, సబ్బులు, డిటర్జెంట్లు, టాయిలెటరీస్, చిన్నపిల్లల ఉత్పత్తులు తదితరాలతో దినదినాభివృద్ధి చెందిన వ్యాపారం నేడు దేశంలోనే కాక ప్రపంచంలోనూ అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటిగా నిలిచింది. అప్పట్లో 20 లక్షల డాలర్ల విలువ చేసే వ్యాపారాన్ని చేపట్టిన ప్రేమ్ జీ, 8 బిలియన్ డాలర్ల విలువకు తీసుకెళ్లారు. ఈ స్థాయికి చేరేందుకు ప్రేమ్ జీ, అహరహం కృషి చేయాల్సి వచ్చింది. అంతేకాక మరిన్ని కొత్త రంగాలకూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో ఎన్నడూ తొణుకుబెణుకు లేకుండానే ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. 
వెస్టర్న్ ఇండియా... సంక్షిప్తంగా విప్రో
తండ్రి కార్యకలాపాలు సాగించిన వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, కాలక్రమేణా విప్రోగా మారిపోయింది. ప్రస్తుతం విప్రో పూర్తి పేరు చెప్పమంటే ఏ కొద్ది మందో తప్పించి మెజార్టీ ప్రజలకు తెలియదు. అదే విప్రో పేరు చెబితే, ఠక్కున ప్రేమ్ జీ గుర్తుకొచ్చేస్తారు. ఈ గుర్తింపు ఒక్క భారత్ లోనే కాదు సుమా. విశ్వవ్యాప్తంగా విప్రో అంటే, ప్రేమ్ జీ గుర్తుకు రావాల్సిందే. ఐటీ సేవల్లో కాలిడిన ప్రేమ్ జీ అద్భుతాలనే సృష్టించారు. 1970 దశకం చివరలో మొదలైన సాఫ్ట్ వేర్ విప్లవం నేపథ్యంలో 1980లో విప్రో కూడా బెంగళూరు కేంద్రంగా ఐటీ వ్యాపారంలోకి అడుగిడింది. కాలుమోపిన 15 ఏళ్లలోనే భారత్ లోనే అతిపెద్ద ఐటీ ఆధారిత సేవల కంపెనీగా విప్రో అవతరించడం విశేషం. విప్రో టెక్నాలజీస్ పేరిట పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన ఈ సంస్థ, ఒక్కసారిగా రూ.1,042 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. 
వాటాలు కొనిపించి, కోటీశ్వరులుగా మార్చి..!
తన కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన సమయంలో తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్లు, నౌకర్లతో తన షేర్లను బలవంతంగా కొనిపించిన ప్రేమ్ జీ, వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దారు. అంతేకాక, స్నేహితులతో కూడా షేర్లను కొనిపించి, అప్పటిదాకా షేర్ మార్కెట్ దిశగా దృష్టి సారించని ఎందరినో అబ్బురపరిచారు.  
ఎంత ఎదిగినా, సామాన్యుడిగానే!
వ్యాపారంలో కోట్లకు పడగలెత్తిన ప్రేమ్ జీ, ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ఎప్పుడో స్థానం సంపాదించారు. ఒకానొక దశలో భారత్ లోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. అయితే ఇప్పటికీ ఆయన సాధారణ జీవితాన్నే ఇష్టపడతారు. ఎక్కడికెళ్లాలన్నా, ఎకానమీ తరగతిలోనే ప్రయాణిస్తారు. బయటి ప్రాంతాల్లో బస చేయాల్సి వస్తే, కంపెనీ అతిథి గృహాలను ఆశ్రయిస్తారు తప్పించి, లగ్జరీ హోటళ్ల దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. అంతేకాదు, కంపెనీ కార్యాలయ ప్రాంగణంలో ఆయన కారుకు అసలు రిజర్వడ్ పార్కింగ్ అన్న స్థలమే  వద్దంటారు. తానొచ్చిన సమయంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే కారును పార్క్ చేయమని చెబుతారట. ఇక కోట్లు సంపాదించిన ప్రేమ్ జీ, వాడే కారు ఎంత ఖరీదు ఉంటుందోనని ఆరా తీస్తే, ఆశ్చర్యపోక తప్పదు. తాను వాడే హోండా కారు పాతబడింది, కొత్తది కొనండన్న సిబ్బందికి ప్రేమ్ జీ షాకిచ్చారట. తనవద్ద పనిచేస్తున్న సిబ్బంది వాడిన సెకండ్ హ్యండ్ మెర్సిడెజ్ బెంజ్ ను కొనుక్కుని మురిసిపోయారట. 
దాతృత్వంలో అగ్రగణ్యుడు
ఇక సామాజిక సేవా కార్యక్రమాలకు పెద్ద పీట వేసే ప్రేమ్ జీ, అందుకు కేటాయించే నిధుల విలువ చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. గ్రామీణ భారతంలో విద్య, సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు ఒకేసారి రూ.8 వేల కోట్లను విడుదల చేసి, భారత్ లో సేవా కార్యక్రమాలకు అధిక మొత్తం వెచ్చించిన వ్యాపార వేత్తగా అవతరించారు. అంతేకాక తన వ్యక్తిగత ఆస్తిలో 25 శాతం వాటాను సేవా కార్యక్రమాలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుని భారత పారిశ్రామిక వేత్తలకే మార్గదర్శిగా నిలిచారు. 2001లో అజిమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిన ఆయన పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలకు తెరతీశారు. ఈ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల్లో విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలదే అగ్రతాంబూలం. 
విలువలను వల్లె వేస్తూ...!
కార్పోరేట్ ప్రపంచంలో అగ్రభాగాన నిలిచిన ప్రేమ్ జీ, నిత్యం వ్యాపారాంశాలను చర్చిస్తూ గడిపేస్తారనుకుంటే మనం పొరబడినట్లే. ఎందుకంటే నిత్యం ఆయన... మనిషిగా మనం పాటించాల్సిన విలువలు, వాటి వల్ల కలిగే తృప్తి తదితరాలనే ఎక్కవగా ప్రస్తావిస్తారట. విప్రో విజయంలోనూ తాను పాటించిన విలువలే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని కూడా ఆయన చెబుతుంటారు. సర్వశక్తులన్నీ కూడదీసుకుని లక్ష్యం దిశగా పరుగు ప్రారంభించాలని చెప్పే ఆయన, ఐదు పౌండ్ల సంపాదన కన్నా, ఒక్క రూపాయి సంపాదనే విలువైనదిగా భావిస్తారట. సత్యనిష్టకే  ప్రాధాన్యతనిచ్చే ప్రేమ్ జీ, విలువలను వదులకునే దుస్సాహసం చేయొద్దంటారు. సామాన్యుడిని కూడా విలువలున్న బృందంలో చేరిస్తే, అతడు మెరుగైన కార్యసాధకుడిగా రూపాంతరం చెందుతాడనడంలో తనకెంత మాత్రం అనుమానం లేదని కాస్త గట్టిగానే వాదిస్తారు.