Sunday, 16 December 2018

విలువల నిచ్చెనపై... 'విప్రో' సారథి!

విలువల నిచ్చెనపై... 'విప్రో' సారథి!


21 ఏళ్ల యవ్వనంలో ప్రతిష్ఠాత్మక వర్సిటీ... స్టాన్ ఫోర్డ్ లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న అజిమ్ హషిమ్ ప్రేమ్ జీ, ఇంకొంత కాలం ఉంటే చదువు పూర్తి చేసేవాడే. అయితే, ఓ రోజు పిడుగులాంటి వార్త అందింది. తండ్రి ఎంహెచ్ హషిమ్ ప్రేమ్ జీ మరణ వార్తను మోసుకొచ్చిన ఆ సందేశంతో ఉన్నపళంగా స్వదేశం వచ్చేయాల్సి వచ్చింది. అయితే మళ్లీ స్టాన్ ఫోర్డ్ వెళ్లే వెసులుబాటు అతడికి చిక్కలేదు. తండ్రి ఆకస్మిక మరణం నేపథ్యంలో కుటుంబంతో పాటు తమనే నమ్ముకున్న వందలాది మంది కార్మికుల జీవనోపాధిని అతడు భుజాన వేసుకోవాల్సి వచ్చింది. తప్పలేదు మరి. ఇంకేముంది... ఇంజినీర్ కావాలన్న కల మధ్యలోనే కొండెక్కేసింది. ఓనమాలు తెలియకుండానే వ్యాపార రంగంలోకి దిగాల్సి వచ్చింది. కాకపోతే తండ్రి తనలో నూరిపోసిన విలువల మంత్రం అప్పటికప్పుడు నిద్ర లేచింది. ముందడుగు వేయమంటూ ఉద్బోధిస్తూ ఊహించని తీరాలకు పరుగులు పెట్టించింది. వందలుగా ఉన్న కార్మికుల సంఖ్య వేలు కూడా దాటేసి, లక్షను తాకింది. అయితే ఈ పరిణామానికి కొంత కాలమైతే పట్టింది కాని, అతడి కీర్తితో పాటు భారత ప్రతిష్ఠ విశ్వవ్యాప్తవంగా మరింత ఇనుమడించింది. 
పట్టుదలతో ఇంజినీరింగ్ సాధించిన ప్రేమ్ జీ
తండ్రి ఆకస్మిక మరణం నేపథ్యంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ను మధ్యలోనే వదిలేసి వచ్చిన ప్రేమ్ జీ, ఎలాగైనా ఇంజినీరింగ్ పట్టాను చేపట్టాల్సిందేనని నిర్ణయించుకున్నారు. అందుకే వదిలేసి వచ్చిన పాఠాలను దూరవిద్య విధానంలో అభ్యసిస్తానని వర్సిటీ అధికారులను ఒప్పించి మరీ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇక చదువు మీదకు దృష్టి సారించే తీరిక ఆయనకు చిక్కలేదు. తండ్రి అప్పగించిపోయిన వ్యాపారాన్ని నిర్వహించేందుకే సమయమంతా సరిపోతుంటే, ఇక చదివెలా సాధ్యం? అందుకే చదువుపై మమకారం వదులుకున్న ప్రేమ్ జీ, దానికి దూరమైన పిల్లలకు మాత్రం చదువు చెప్పించేందుకు కష్టపడుతున్నారు. ఖర్చు పెడుతున్నారు కూడా.
1945, జూలై 24న ముంబైలో జన్మించిన ప్రేమ్ జీ...1966 నాటికే వ్యాపార పగ్గాలు చేపట్టారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుదామనుకుంటే... మెకానికల్, కంప్యూటర్ ఇంజినీరింగ్ నిపుణులు చేయాల్సిన పనులు చేపట్టాల్సి వచ్చిన ప్రేమ్ జీ, అందులో ఆ రంగాల నిపుణులను తలదన్నేలా రాణించారు. తనకు పరిచయం లేని రంగంలోకి కొండంత విశ్వాసంతో దిగి, అనూహ్య ఫలితాలు సాధించారు. మార్కెట్ వర్గాలు ముక్కున వేలేసుకునేలా చేశారు. ఆఖరుకు యావత్తు భారత దేశానికే టెక్నాలజీ కింగ్ గా అవతరించారు. 
నూనెల తయారీతో రంగ ప్రవేశం
జీవించి ఉన్నంత కాలం నూనెల తయారీ వ్యాపారం కొనసాగించిన హషిమ్ ప్రేమ్ జీ, పోతూపోతూ తన వ్యాపారాన్ని అజిమ్ ప్రేమ్ జీకి వారసత్వంగా ఇచ్చి వెళ్లారు. దీంతో అనుభవం, ఇష్టం లేకున్నా ఆ వ్యాపారంలోకి ప్రేమ్ జీ దిగేయాల్సి వచ్చింది. ఒక్కసారి అందులో కాలుపెట్టిన ఆయన, వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. నూనెలు, సబ్బులు, డిటర్జెంట్లు, టాయిలెటరీస్, చిన్నపిల్లల ఉత్పత్తులు తదితరాలతో దినదినాభివృద్ధి చెందిన వ్యాపారం నేడు దేశంలోనే కాక ప్రపంచంలోనూ అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటిగా నిలిచింది. అప్పట్లో 20 లక్షల డాలర్ల విలువ చేసే వ్యాపారాన్ని చేపట్టిన ప్రేమ్ జీ, 8 బిలియన్ డాలర్ల విలువకు తీసుకెళ్లారు. ఈ స్థాయికి చేరేందుకు ప్రేమ్ జీ, అహరహం కృషి చేయాల్సి వచ్చింది. అంతేకాక మరిన్ని కొత్త రంగాలకూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో ఎన్నడూ తొణుకుబెణుకు లేకుండానే ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. 
వెస్టర్న్ ఇండియా... సంక్షిప్తంగా విప్రో
తండ్రి కార్యకలాపాలు సాగించిన వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, కాలక్రమేణా విప్రోగా మారిపోయింది. ప్రస్తుతం విప్రో పూర్తి పేరు చెప్పమంటే ఏ కొద్ది మందో తప్పించి మెజార్టీ ప్రజలకు తెలియదు. అదే విప్రో పేరు చెబితే, ఠక్కున ప్రేమ్ జీ గుర్తుకొచ్చేస్తారు. ఈ గుర్తింపు ఒక్క భారత్ లోనే కాదు సుమా. విశ్వవ్యాప్తంగా విప్రో అంటే, ప్రేమ్ జీ గుర్తుకు రావాల్సిందే. ఐటీ సేవల్లో కాలిడిన ప్రేమ్ జీ అద్భుతాలనే సృష్టించారు. 1970 దశకం చివరలో మొదలైన సాఫ్ట్ వేర్ విప్లవం నేపథ్యంలో 1980లో విప్రో కూడా బెంగళూరు కేంద్రంగా ఐటీ వ్యాపారంలోకి అడుగిడింది. కాలుమోపిన 15 ఏళ్లలోనే భారత్ లోనే అతిపెద్ద ఐటీ ఆధారిత సేవల కంపెనీగా విప్రో అవతరించడం విశేషం. విప్రో టెక్నాలజీస్ పేరిట పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన ఈ సంస్థ, ఒక్కసారిగా రూ.1,042 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. 
వాటాలు కొనిపించి, కోటీశ్వరులుగా మార్చి..!
తన కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన సమయంలో తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్లు, నౌకర్లతో తన షేర్లను బలవంతంగా కొనిపించిన ప్రేమ్ జీ, వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దారు. అంతేకాక, స్నేహితులతో కూడా షేర్లను కొనిపించి, అప్పటిదాకా షేర్ మార్కెట్ దిశగా దృష్టి సారించని ఎందరినో అబ్బురపరిచారు.  
ఎంత ఎదిగినా, సామాన్యుడిగానే!
వ్యాపారంలో కోట్లకు పడగలెత్తిన ప్రేమ్ జీ, ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ఎప్పుడో స్థానం సంపాదించారు. ఒకానొక దశలో భారత్ లోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. అయితే ఇప్పటికీ ఆయన సాధారణ జీవితాన్నే ఇష్టపడతారు. ఎక్కడికెళ్లాలన్నా, ఎకానమీ తరగతిలోనే ప్రయాణిస్తారు. బయటి ప్రాంతాల్లో బస చేయాల్సి వస్తే, కంపెనీ అతిథి గృహాలను ఆశ్రయిస్తారు తప్పించి, లగ్జరీ హోటళ్ల దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. అంతేకాదు, కంపెనీ కార్యాలయ ప్రాంగణంలో ఆయన కారుకు అసలు రిజర్వడ్ పార్కింగ్ అన్న స్థలమే  వద్దంటారు. తానొచ్చిన సమయంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే కారును పార్క్ చేయమని చెబుతారట. ఇక కోట్లు సంపాదించిన ప్రేమ్ జీ, వాడే కారు ఎంత ఖరీదు ఉంటుందోనని ఆరా తీస్తే, ఆశ్చర్యపోక తప్పదు. తాను వాడే హోండా కారు పాతబడింది, కొత్తది కొనండన్న సిబ్బందికి ప్రేమ్ జీ షాకిచ్చారట. తనవద్ద పనిచేస్తున్న సిబ్బంది వాడిన సెకండ్ హ్యండ్ మెర్సిడెజ్ బెంజ్ ను కొనుక్కుని మురిసిపోయారట. 
దాతృత్వంలో అగ్రగణ్యుడు
ఇక సామాజిక సేవా కార్యక్రమాలకు పెద్ద పీట వేసే ప్రేమ్ జీ, అందుకు కేటాయించే నిధుల విలువ చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. గ్రామీణ భారతంలో విద్య, సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు ఒకేసారి రూ.8 వేల కోట్లను విడుదల చేసి, భారత్ లో సేవా కార్యక్రమాలకు అధిక మొత్తం వెచ్చించిన వ్యాపార వేత్తగా అవతరించారు. అంతేకాక తన వ్యక్తిగత ఆస్తిలో 25 శాతం వాటాను సేవా కార్యక్రమాలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుని భారత పారిశ్రామిక వేత్తలకే మార్గదర్శిగా నిలిచారు. 2001లో అజిమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిన ఆయన పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలకు తెరతీశారు. ఈ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల్లో విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలదే అగ్రతాంబూలం. 
విలువలను వల్లె వేస్తూ...!
కార్పోరేట్ ప్రపంచంలో అగ్రభాగాన నిలిచిన ప్రేమ్ జీ, నిత్యం వ్యాపారాంశాలను చర్చిస్తూ గడిపేస్తారనుకుంటే మనం పొరబడినట్లే. ఎందుకంటే నిత్యం ఆయన... మనిషిగా మనం పాటించాల్సిన విలువలు, వాటి వల్ల కలిగే తృప్తి తదితరాలనే ఎక్కవగా ప్రస్తావిస్తారట. విప్రో విజయంలోనూ తాను పాటించిన విలువలే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని కూడా ఆయన చెబుతుంటారు. సర్వశక్తులన్నీ కూడదీసుకుని లక్ష్యం దిశగా పరుగు ప్రారంభించాలని చెప్పే ఆయన, ఐదు పౌండ్ల సంపాదన కన్నా, ఒక్క రూపాయి సంపాదనే విలువైనదిగా భావిస్తారట. సత్యనిష్టకే  ప్రాధాన్యతనిచ్చే ప్రేమ్ జీ, విలువలను వదులకునే దుస్సాహసం చేయొద్దంటారు. సామాన్యుడిని కూడా విలువలున్న బృందంలో చేరిస్తే, అతడు మెరుగైన కార్యసాధకుడిగా రూపాంతరం చెందుతాడనడంలో తనకెంత మాత్రం అనుమానం లేదని కాస్త గట్టిగానే వాదిస్తారు.

సామాన్యులను 'అంబారీ' ఎక్కించిన అంబానీ... భారత పారిశ్రామిక దిగ్గజం!








  • సామాన్యులను 'అంబారీ' ఎక్కించిన అంబానీ... భారత పారిశ్రామిక దిగ్గజం!అభివృద్ధికి పరిమితులు తనకు తెలియవంటారు ఆయన. అనడమే కాదు, దానిని చేతల్లో చూపించారు. ఇంతై...  ఇంతింతై, వటుడింతై అన్నట్లు... ఓ చిన్న అడుగుతో మొదలెట్టి మహా సామ్రాజ్యాన్నే సృష్టించేసి మరీ చూపించారు. భారత పారిశ్రామిక రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. పరిశ్రమల నిర్వహణలో ఏమాత్రం జోక్యం చేసుకోకుండానే లాభాలు స్వీకరించే సౌలభ్యాన్ని సామాన్యుల ముంగిట్లోకి తెచ్చారు. తద్వారా సామాన్యులను సైతం భారత పారిశ్రామిక రంగంలోకి అమాంతం ఎత్తుకొచ్చి పడేశారు. తత్ఫలితంగా అప్పటిదాకా నెమ్మదిగా నడక సాగిస్తున్న భారత పారిశ్రామిక రంగం ఉరుకులు పరుగులు పెట్టింది. ఈ పరుగులో తాను పెరుగుతూ, ఇతరులకూ ఆ భాగ్యం కల్పించారు. అందుకేనేమో, ఆయన సంస్థ ఏటా నిర్వహించే వాటాదారుల సమావేశాలకు పెద్ద, పెద్ద స్టేడియాలు కూడా సరిపోవడం లేదు. ప్రస్తుతం ఆయన లేరు కాని, ఆయన నిర్మించిన సామ్రాజ్యం మాత్రం... ఆయన మాదిరిగానే ’వృద్ధి‘లో తనకు పరిమితులు లేవని చాటిచెబుతోంది. ఆయనే ధీరూభాయి అంబానీ కాగా, ఆయన కలలుగన్న రీతిన ముందుకు సాగుతున్న కంపెనీ ‘రిలయన్స్’ అని చెప్పాల్సిన అవసరం రాదేమో. ఎందుకంటే ఆ సంస్థ పన్నుల రూపేణా చెల్లిస్తున్న మొత్తం, కేంద్రం  పన్నుల ఆధారిత ఆదాయంలో 5 శాతం మరి! 
    నాలుగ్గోడల మధ్య నేర్చుకునేదేంటి...?
    అందరి పిల్లల్లాగే పాఠశాలకు వెళ్లిన పదిహేనేళ్ల ధీరజ్ లాల్ హీరాచంద్ అంబానీకి నాలుగ్గోడల మధ్య కూర్చుని నేర్చుకునేదేమిటని ఒకటే సంశయం. అందుకేనేమో, ఖాళీ సమయాల్లో ఉల్లి, బంగాళదుంప తదితరాలను విక్రయించి, పెట్టుబడి పోను మిగిలిన సొమ్మును, అదేనండి, ఆదాయాన్ని తల్లి జమనాబెన్ చేతిలో పెట్టేవాడట. ఐదుగురు సంతానంతో ఇంటిని నెట్టుకురాలేక సతమతమవుతూ బడిపంతులుగా కాలం వెళ్లదీస్తున్న తండ్రి హీరాచంద్ గోర్ ధన్ దాస్ అంబానీకి చేదోడువాదోడుగా ఉండేందుకు ఆ బుడతడు నాలుగ్గోడల మధ్య నేర్చుకునేదానికి ఫుల్ స్టాఫ్ పెట్టేయాల్సి వచ్చింది.
    అప్పటికే రాసిన పదో తరగతి పరీక్షల్లో అసలు పాసయ్యానా? లేదా? అన్న విషయం కూడా తెలియకముందే నౌక ఎక్కేశాడు. సుదూర తీరానికి వెళ్లిన తర్వాత పాసయ్యానని తెలిస్తే, ఏం లాభం? ఎటూ వచ్చేశాను కదా, ఇక లాగించేద్దాం అన్న భావనతో పనిలో కుదిరిపోయాడు. తీరా పదేళ్లు కూడా అక్కడ పనిచేయకుండానే విశేష అనుభవం గడించి స్వదేశం వచ్చిన ధీరజ్ లాల్ సొంతంగా వ్యాపారం ప్రారంభించి ధీరూభాయి అంబానీగా వినుతికెక్కారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపార సామ్రాజ్యాన్ని వారసులకు అందించి నిష్క్రమించారు. అంతేమొత్తంలో తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సామాన్య ప్రజలకు అందించి చిరస్మరణీయుడిగా మిగిలిపోయారు.
    అడుగడుగునా అవాంతరాలే!
    గుజరాత్ లోని జూనాఘడ్ పరిసరాల్లోని ఛోర్వాద్ లో 1932, డిసెంబర్ 28న గుజరాతీ కుటుంబంలో ధీరూభాయి అంబానీ జన్మించారు. అయిష్టంగానే పదో తరగతి వరకు పాఠశాల విద్య కొనసాగించిన ఆయన, ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడంతో, ఉద్యోగం నిమిత్తం యెమెన్ రేవు పట్టణం ఎడెన్ కు తరలివెళ్లారు. అతి స్వల్ప కాలంలోనే ‘ఏ. బీస్ అండ్ కో’ కార్యకలాపాలను పూర్తిగా అవగతం చేసుకున్నారు. కంపెనీలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ పనిచేసిన అంబానీ, ఆ తర్వాత 1954లో కోకిలాబెన్ ను పెళ్లి చేసుకునేందుకు స్వదేశానికి వచ్చారు. తిరిగి ఉద్యోగం కోసం వెళ్లిన అంబానీని ఏ. బీస్ అండ్ కో మరింత కష్టసాధ్యమైన పనికి బదిలీ చేసింది. మూడేళ్ల పాటు అక్కడే విధులు నిర్వర్తించిన అంబానీ, ఇక ఎంతకాలమని ఎదుగూబొదుగూ లేని ఉద్యోగం చేయాలంటూ... ఉన్నపళంగా స్వదేశం వచ్చేశారు. ఓపక్క ఏం చేయాలి? అన్న మీమాంస. మరోపక్క ఏదో ఒకటి చేయకపోతానా? అన్న ఆత్మ విశ్వాసం. చివరికి సోదరుడితో కలిసి చిన్న వ్యాపారం చేసేందుకు రిలయన్స్ కమర్షియల్ కార్పోరేషన్ ను 1957లో ప్రారంభించారు. అయితే సోదరుడితో పొడచూపిన విభేదాలు, 1965లో దాని నుంచి బయటకు వచ్చేలా చేశాయి.
    ఒంటరి పోరులో విజేతగా నిలిచి...!
    ఈసారి ఒంటరిగానే రిలయన్స్ గ్రూపును ప్రారంభించిన అంబానీ, మరిన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. ‘విమల్’ పేరిట ప్రత్యేక బ్రాండ్ ను అంబానీ రూపొందించారు. ఈ దెబ్బకు కుదేలైన బడా పారిశ్రామిక వేత్తల  కడుపు మండింది. వారంతా కలిసి అంబానీని ఎదగనీయకుండా పలు పన్నాగాలు పన్నారు. వారితో తన సోదరుడు కూడా చేయి కలపడాన్ని జీర్ణించుకోలేని అంబానీ, మరింత దీటుగా ముందుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అంబానీని ఎదగనీయకుండా అడ్డుకున్న వారిలో బాంబే డెయింగ్ యజమాని నస్లీ వాడియా కూడా ఉన్నారు. అయితే ఎక్కడ కూడా రాజీలేని పోరు సాగించిన అంబానీ, దశలవారీగా అందరినీ దాటేసుకుంటూ ముందుకెళ్లిపోయారు. ఈ తరహా భీకర పోరే అంబానీని గుండెపోటు బారిన పడేలా చేశాయేమోనని పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటూ ఉంటాయి. ఇక ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల్లో ధీరూభాయి అంబానీకి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. 2016, మార్చి 28న రాష్ట్రపతి భవన్ లో అంబానీ సతీమణి కోకిలాబెన్ ఆ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకున్నారు.
    మూడు పువ్వులు...ఆరు కాయలు
    ఓ వైపు వ్యాపార ప్రత్యర్థులతో పోరు కొనసాగిస్తూనే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అంబానీ ఒడిసిపట్టుకున్నారు. రియలన్స్ గ్రూపు ప్రారంభమై ఐదేళ్లు గడిచేలోగా 1970 నాటికి ఆ సంస్థ ఆస్తులు రూ.10 లక్షలకు చేరుకోగా... మరో దశాబ్దం గడిచేసరికి 1980 దశకంలో కంపెనీ విలువ రూ.100 కోట్లను తాకేసింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వస్త్ర తయారీని నిర్వహిస్తూనే, ఇతర రంగాల వైపు దృష్టి సారించారు. ఈ క్రమంలో చిన్ననాటి ఉద్యోగంలో నేర్చుకున్న మెళకువలను తిరగదోడిన అంబానీ... పెట్రో కెమికల్స్ రంగంలో శరవేగంగా దూసుకెళ్లారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అద్భుతాలు నమోదు చేస్తూ పోయారు. 2002, జూలై 6న ఆయన మరణించే నాటికి రిలయన్స్ మొత్తం విలువ 6.10 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ను ఈ స్థితికి చేర్చే క్రమంలో అంబానీ... పెట్రో కెమికల్స్, సమాచార, ఇంధన రంగాల్లో అడుగుపెట్టారు. పది పైసలకే సామాన్యుడికి ఫోన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలన్న అంబానీ ఆశయమే, రిలయన్స్ మొబైల్ సేవల ప్రాంభానికి కారణమైంది. అప్పటిదాకా ఈ రంగంలో ఉన్న భారీ రేట్లు క్రమంగా పడిపోయి, ప్రస్తుతం ఒక్క పైసాకు కూడా ఫోన్ చేసుకునే సౌలభ్యం సామాన్యుడి ముందు వాలిపోయింది.
    ప్రతి అడుగులో ప్రత్యేక ముద్ర
    వేసిన ప్రతి అడుగులో అంబానీ తన ప్రత్యేకతను చాటారు. అహ్మదాబాద్ సమీపంలోని నరోడాలో విమల్ వస్త్ర తయారీ యూనిట్ ను 1975లో ప్రపంచ బ్యాంకుకు చెందిన సాంకేతిక నిపుణుల ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రమాణాల కన్నా మెరుగైన ప్రమాణాలతో ప్లాంట్ ను ఏర్పాటు చేశారంటూ అంబానీని కీర్తించింది. భారత పారిశ్రామిక రంగంలో అంబానీ పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. తన కంపెనీల్లో పెట్టుబడులు పెడితే కంపెనీలో వాటాలిస్తానని చెబుతూ, గుజరాత్ గ్రామీణ ప్రాంతాలను చుట్టిన ఆయన అందులో విజయం సాధించడంతో పాటు సామాన్యులకు పారిశ్రామిక ఫలాలు అందేలా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రిలయన్స్ వాటాదారుల సంఖ్య దినదినాభివృద్ధి చెందింది. దీంతో వాటాదారుల వార్షిక సమావేశాలు నిర్వహిచేందుకు ముంబైలోని పెద్ద స్టేడియాలను అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది. ఈ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది. అంబానీ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం నేపథ్యంలో దేశంలోని పరిశ్రమల్లో సామాన్యుల వాటాలు పెరుగుతూ వచ్చాయి. పరిశ్రమలు ఆర్జిస్తున్న లాభాలను సామాన్య ప్రజానీకం కూడా రుచిచూస్తోంది. ఇందుకేనేమో, మొన్నటికి మొన్న అంబానీ చిన్న కొడుకు అనిల్ అంబానీ పబ్లిక్ ఆపర్ కు వెళితే, ఊహించని రీతిలో మదుపరులు స్పందించారు. ఆశించిన దాని కంటే కొన్ని వేల రెట్లలోఆ ఇష్యూకు పెట్టుబడులు బారులు తీరాయి.  
    తనను మించిన రీతిలో వారసులను తీర్చిదిద్దిన ఘనుడు
    అంబానీ నలుగురు సంతానంలో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. కుమార్తెలను పక్కనబెడితే ఇద్దరు కుమారులను అంబానీ తనను మించిన మేధావులుగా మలచారు. తాను జీవించి ఉన్నంత కాలం ఉమ్మడిగానే కుటుంబాన్ని కొనసాగించారు. కొడుకుల మధ్య ఏమాత్రం పొరపొచ్చాలు రానివ్వని రీతిలో వ్యవహారాలు చక్కబెట్టారు. పెద్ద కొడుకు ముఖేష్ ను కెమికల్ ఇంజినీరింగ్ లో నిష్ణాతుడిని చేశారు. రిలయన్స్ కు కేంద్ర బిందువుగా ఉన్న జామ్ నగర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ముఖేష్, కేవలం ఏడాదిన్నరలో పూర్తి చేయించాడని పారిశ్రామిక వర్గాలు చెబుతాయి. ఇక చిన్న కొడుకు అనిల్ వ్యూహ రచనలో తండ్రిని తలదన్నేలా వ్యవహరిస్తారని భారత పారిశ్రామిక వేత్తలు కాస్త గర్వంగానే చెప్పుకుంటారు. తండ్రి మరణం తర్వాత తండ్రి నిర్మించిన రిలయన్స్ ను అన్నకు వదిలేసిన అనిల్, సొంతంగా అనిల్ దీరూభాయి అంబానీ గ్రూప్ ను ఏర్పాటు చేసి శరవేగంగా దూసుకుపోతున్నారు. అన్నదమ్ములిద్దరూ భారత సంపన్న దిగ్గజాల జాబితాలోనే కాక ప్రపంచ దిగ్గజాల జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు.

బడ్జెట్టులోనే నాణ్యమైన విద్యకు కెనడా



కెనడాలో చదవాలనే అభిలాష కలిగిన భారతీయ విద్యార్థుల సంఖ్య తక్కువేమీ కాదు. ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను మద్యస్థాయి బడ్జెట్ లోనే పొందడానికి ఇక్కడ అవకాశం ఉంది. నివాసానికి అత్యంత అనువైన దేశాలలో కెనడా కూడా ఒకటని ఐక్యరాజ్యసమితే ప్రకటించింది.
చక్కని వెసులుబాటు
ముందుగా కెనడాలో గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నట్టుగా లెటర్ ను తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ దేశంలో చదువుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. తర్వాత విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆరు నెలలు, అంతకంటే తక్కువ కాల వ్యవధిగల కోర్సుల విషయానికొస్తే అడ్మిషన్ అనంతరం నేరుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కెనడాలో గ్రాడ్యుయేట్, మాస్టర్స్ తదితర పూర్తి స్థాయి కోర్సుల్లో చేరిన వారు క్యాంపస్ లోపల, బయట కూడా పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అంతేకాదు, శాశ్వత నివాస హోదా పొందవచ్చు. 
వీటిని చూస్తారు...
కెనడా యూనివర్సిటీల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందడానికి నిర్ణీత అర్హతలు ఉండాలి. ఇంటర్ లో కనీసం 70 శాతం మార్కులైనా అవసరం. చేస్తున్న కోర్సు ఉండాల్సిన అర్హతల వివరాలకు http://www.infozee.com/canada/eligibility.htm వెబ్ సైట్ ను చూసి తెలుసుకోవచ్చు. అడ్మిషన్ అనంతరం వీసాకు దరఖాచేస్తు చేసుకోవాలి. ట్యూషన్ ఫీజులు, నివాస ఖర్చులు, కోర్సు అనంతరం స్వదేశం తిరిగి వెళ్లేందుకు వీలుగా తగినంత నగదు ఉందని వీసా దరఖాస్తు సమయంలో ఆధారాలు చూపాల్సి ఉంటుంది. కెనడా చట్టాలకు కట్టుబడి ఉంటానని హామీ ఇవ్వాలి. ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసుల ధ్రువీకరణ కూడా సమర్పించాలి. ఆరోగ్యం మంచిగానే ఉందని వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావాలి. అన్ని విద్యార్హతల పత్రాలు, టోఫెల్, శాట్, జీఆర్ఈ, జీమ్యాట్ పరీక్షలలో స్కోర్స్ ను వీసా జారీ సమయంలో ఇమిగ్రేషన్ అధికారి పరిశీలిస్తారు. స్వల్ప కాలిక కోర్సు కాకుండా పూర్తి స్థాయి అకడమిక్ కో్ర్సుల విద్యార్థులు చదువుకుంటూ క్యాంపస్ లో, క్యాంపస్ వెలుపల వారానికి 20 గంటలపాటు ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. సెలవుల్లో పరిమితి లేకుండా పనిచేసుకోవచ్చు. 
కెనడాలో విద్యా వ్యయం
బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల ట్యూషన్ ఫీజు ఏడాదికి సుమారు 10,730 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఆర్ట్స్, హ్యుమానిటీ కోర్సుల ఫీజులు కొంచెం తక్కువ. ఇంజనీరింగ్ కు 17 వేల అమెరికన్ డాలర్లు,  మెడిసిన్, ఫార్మసీ డిగ్రీ కోసం అయితే ఏటా 22వేల అమెరికన్ డాలర్లు చెల్లించుకోవాలి. పీజీ కోర్సుల ట్యూషన్ ఫీజులు ఇంకా ఎక్కువే ఉంటాయి. ఎంబీయే అయితే 32వేల అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
నివాస వ్యయం...
కెనడాలో ఆహారం, ఇతర ఖర్చులకు నెలకు సరాసరి 450 నుంచి 600 అమెరికన్ డాలర్ల వ్యయం అవుతుంది. నివాస వసతి ఖర్చు అదనం. అన్నీ కలుపుకుని చూస్తే ఏటా 8 వేల నుంచి 12 వేల అమెరికన్ డాలర్ల వరకు వ్యయం అవుతుంది. ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ లో ఉండే అవకాశం చూసుకుంటే ఖర్చు సగానికి పైగా తగ్గుతుంది.
ప్రముఖ విద్యా సంస్థలు...
మెక్ గిల్ యూనివర్సిటీ ప్రపంచంలో 24వ స్థానంలో ఉంది. 150 దేశాలకు చెందిన విద్యార్థులు మెడికల్, డాక్టరేట్ కోర్సులకు ఈ యూనివర్సిటీకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. 1821లో దీన్ని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ అల్బర్టా,  యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్, మెక్ మాస్టర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ, వెస్టర్న్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ, క్వీన్స్ యూనివర్సిటీలను కెనడాలోని టాప్ టెన్ గా పేర్కొంటారు.
సిమన్ ప్రేసర్ యూనివర్సిటీ, డల్హౌసీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా, యూనివర్సిటీ ఆఫ్ విక్టోరియా, లావల్ యూనివర్సిటీ, కాంకార్డియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్యుబెక్, యార్కట్ యూనివర్సిటీ, కార్లెటన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మానిటోబా ప్రముఖమైనవి.
కెనడాలో విద్య, స్కాలర్ షిప్ లు, యూనివర్సిటీలు, అసోసియేషన్లు, స్టడీ పర్మిట్లు, తదితర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్లు చాలా ఉన్నాయి. www.educationau-incanada.cawww.scholarships-bourses.gc.cawww.ican.net.in, www.univcan.cawww.accc.cawww.india.gc.cawww.cic.gc.cahttp://www.vfsglobal.ca/canada/india/www.immigrationdirect.ca ఈ వెబ్ సైట్లను ఆశ్రయించడం ద్వారా పూర్తి సమాచారం పొందవచ్చు. 

Wednesday, 14 March 2018

రిటైల్‌ జాబ్‌ ఇంటర్వ్యూ..సూటైతే సెట్‌ కావచ్చు


రిటైల్‌ జాబ్‌ ఇంటర్వ్యూ..సూటైతే సెట్‌ కావచ్చు


భారత దేశంలో అత్యంత వేగంగా దూసుకువెళుతున్న వాటిలో రిటైల్‌ రంగం ఒకటి. జిడిపిలో దీని వాటా పదిశాతం. ఉద్యోగుల్ల్లో ఎనిమిది శాతం మంది ఈ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. రిటైల్‌ స్పేస్‌కు సంబంధించి ప్రపంచంలోనే అయిదో స్థానంలో భారత్‌ ఉంది. దేశ ప్రజలు ప్రధానంగా మధ్యతరగతి వినియోగ ధోరణిలో వచ్చిన మార్పులు ఈ రంగం వృద్ధికి దోహదపడుతున్నాయన్నది మార్కెట్‌ పరిశోధకుల విశ్లేషణ. ఇదంతా సరే, ఏటా పన్నెండు శాతం ఎదుగుదలను ఊహిస్తున్న రిటైల్‌ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంటే ఏమి చేయాలన్నది ముఖ్యమైన ప్రశ్న. సంబంధిత ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కోవాలన్నది మరో అంశం. ఈ నేపథ్యంలో సంబంధిత నిపుణుల సూచనలు చూద్దాం...
 
ప్ర: రిటైల్‌ రంగంలో గతంలో పని చేశారా?
జ: ఉదాహరణకు రిటైల్‌ రంగంలో పని చేయలేదనే అనుకుందాం. అది నేరుగా ఉత్పత్తి కానక్కర్లేదు. విషయం ఆసాంతం వివరించి ఎదుటి వ్యక్తి లేదంటే స్నేహి తుడిని సమాధానపర్చడం కావచ్చు. అదీ కాదనుకుంటే పేరెంట్స్‌ను ఒప్పించడం కావచ్చు. ఆ రెంటిలో ఏదైనా అమ్మకం కిందే పరిగణించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఒప్పించే కళ మీకు ఉంది. అదే మీ సామర్థ్యం. ఇక్కడ ఎలా సమాధానం చెప్పాలంటే.... ఇంతవరకు అనుభవం లేదు. అయితే నా ఆసక్తులు ఈ రంగంలో పనిచేసేందుకు ఉపకరిస్తాయని భావిస్తున్నాను. వ్యక్తుల్ని కలవడం నాకు సౌకర్యంగానే ఉంటుంది. ఫ్యాషన్‌ ప్రపంచంపై అప్‌టు డేట్‌గా ఉంటాను. మా చుట్టాలు, మిత్రులు దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు నన్ను సంప్రదిస్తుంటారు. ఇలాంటి సమాధానాలతో ఆకట్టుకోవచ్చు.
 
ప్ర: వారానికి కనీసం పదహారు గంటలపైగా పని చేయ గలరా?
జ: సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను కాలేజీ చదువుతూ ఉద్యోగం కోసం వచ్చేవారిని అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నకు ఇచ్చే జవాబులో నిజాయతీ కనిపించాలి. మీ వెసులుబాటుని అనుసరించి సమాధానం చెప్ప గలగాలి. మొన్నటి వేసవి కాలంలో పూర్తి స్థాయిలో పని చేశాను. మళ్ళీ సెమిస్టర్‌ ఆరంభమైన తరవాత పార్ట్‌టైమ్‌ షెడ్యూల్‌ ఎంచుకున్నాను. కాలేజీ నాకు చాలా ముఖ్యం. అలాగే కమిట్‌మెంట్‌ విషయంలో సీరియ్‌సగానే ఉంటాను. అంగీకరించిన పనిని పూర్తి చేసే ఇంటికి వెళతాను.
 
ప్ర: షిఫ్టుల్లో పని చేయగలరా? లేట్‌ నైట్స్‌ ఉండగలరా? ఉదయాన్నే డ్యూటీకి రాగలరా? వీకెండ్స్‌ పనిచేయ మంటే కుదురుతుందా?
జ: పై ప్రశ్నమాదిరిగానే ఇది కూడా ఉంటుంది. పని విషయంలో మీరెంత సీరియస్‌ అన్నది తెలుసుకోవడమే ఈ ప్రశ్న అడగడంలోని ఉద్దేశం. మీలో నిజాయతీపాళ్ళు ఎంతో కనుగొనడం మరో లక్ష్యం. షిఫ్టుల్లో పని చేయడం నాకు సమస్య కాదు. చాలా దూరం నుంచి నేను ఇక్కడికి రావాలి. అందువల్ల నేను నైట్‌ డ్యూటీలను ప్రిఫర్‌ చేస్తాను. ఉదయమే రావడం కొద్దిగా కష్టమే. అవసరమైతే వీకెండ్స్‌లో పని చేయడానికి అభ్యంతరం లేదు అని చెప్పవచ్చు.
 
ప్ర: మిమ్మల్ని మేం ఎందుకు తీసుకోవాలి?
జ: ఇది అన్ని జాబ్‌లకూ వర్తిస్తుంది. ఇంటర్వ్యూలోనే ఈ ప్రశ్నకు చాలా వరకు సమాధానం చెప్పారు. బ్రాండింగ్‌, ఫ్యాషన్‌పై నాకు విపరీతమైన ఆసక్తి. ఇంకా లోతుగా ఈ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వ్యక్తిని. అమ్మకాలు, కస్టమర్‌ సర్వీ్‌సలో మరింత నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఏ రకంగా చూసుకున్నప్పటికీ మీకు నేను సూటవుతాను. ఇలా ప్రశ్నలను కొద్దిగా ఊహించుకుని వెళితే, నిక్కచ్చిగా, నిర్భయంగా సమాధానాలు చెప్పే వీలు ఉంటుంది.

ప్ర: మా రిటైల్‌ సంస్థలో ఎందుకు పని చేయాలని అనుకుంటున్నావు?
జ: రిటైల్‌ అనే కాదు, ఏ కంపెనీ నుంచైనా ఇటువంటి ప్రశ్న ఎదుర్కోవాల్సి రావచ్చు. ‘వై’ అన్నదో సర్వసాధారణమైన ప్రశ్న. సమాధానానికి ముందు అక్కడి మన ఉద్యోగ స్వరూప స్వభావాలను తెలుసుకుని మరీ జవాబు చెప్పాలి. బ్రాండ్‌ అండ్‌ డిజైనింగ్‌పై నాకు విపరీతమైన ఆసక్తి. నేను నమ్మిన కంపెనీలో పని చేయాలంటే నాకు చాలా ఇష్టం.
లేదంటే ఇంకోలానూ సమాధానం చెప్పవచ్చు. నాకు రిటైల్‌లో పని చేయాలని ఉంది. జనాలకు షాపింగ్‌ అంటే చాలా ఇష్టం. వారితో కలసి పని చేయాలంటే నాకు ఆసక్తి. అందువల్లే మీ బిజినెస్‌ లో ఉద్యోగిగా భాగస్వామిని కావాలని అనుకుంటున్నాను.

ఎస్‌బీఐ కస్టమర్లకు ఊరట



ఎస్‌బీఐ కస్టమర్లకు ఊరట 
  • పెనాల్టీ చార్జీలు 75 శాతం తగ్గింపు
  • ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి
  •  25 కోట్ల మంది ఖాతాదారులకు లబ్ధి
ముంబై: ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఖాతాదారులకు పెనాల్టీ చార్జీల నుంచి భారీ ఊరట కల్పించింది. బ్యాంక్‌ ఖాతాలో కనీస నగదు నిల్వ ఉంచనందుకు గాను విధించే పెనాల్టీ చార్జీలను ఏప్రిల్‌ 1 నుంచి 75 శాతం తగ్గిస్తున్నట్లు ఎస్‌బిఐ ప్రకటించింది. జరిమానా రుసుము పేరిట భారీగా లాభాలు దండుకుంటున్నారని కస్టమర్లు గగ్గోలు పెట్టిన నేపథ్యంలో బ్యాంక్‌ వెనక్కి తగ్గింది. అయితే, కనీస నగదు నిల్వ పరిమితిని మాత్రం యథాతథంగా కొనసాగించింది. మెట్రో నగరాల్లోని శాఖలకు చెందిన కస్టమర్లకు నెలవారీ కనీస నిల్వ పరిమితిని రూ.3,000గా నిర్ణయించింది. సెమీ అర్బన్‌ బ్రాంచ్‌ల కస్టమర్లకు రూ.2వేలు, గ్రామీణ శాఖల్లోని ఖాతాదారులకు రూ.1,000గా ఉంది. కస్టమర్ల ప్రయోజనాలే బ్యాంక్‌ మొదటి ప్రాధాన్యమని, వారి అంచనాలను అందుకునే ప్రయత్నాల్లో భాగంగానే జరిమానా రుసుమును తగ్గించినట్లు ఎస్‌బిఐ రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగ ఎండి పికె గుప్తా పేర్కొన్నారు.
 
గత ఏప్రిల్‌ నుంచి మొదలైన వడ్డన
గత ఏడాది ఏప్రిల్‌లో ఎస్‌బిఐ పెనాల్టీ చార్జీలను తిరిగి అమలులోకి తెచ్చింది. తొలుత మెట్రో నగరాల్లోని బ్రాంచ్‌ కస్టమర్లకు కనీస నిల్వ పరిమితిని రూ.5,000గా నిర్ణయించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవడంతో గత అక్టోబర్‌లో ఈ పరిమితిని రూ.3వేలకు తగ్గించడంతోపాటు జరిమానా రుసుము విషయంలోనూ స్వల్ప ఊరట కల్పించింది. అయినప్పటికీ గత ఏడాదిలో ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు పెనాల్టీ చార్జీల రూపంలో బ్యాంక్‌కు రూ.1,771.67 కోట్ల ఆదాయం లభించింది. ఈ మొత్తం బ్యాంక్‌ రెండో త్రైమాసిక లాభం కంటే అధికం. బ్యాంక్‌ తాజా నిర్ణయంతో ఆదాయానికి భారీగా గండి పడనుంది.
 
41 కోట్ల పొదుపు ఖాతాలు
ప్రస్తుతం ఎస్‌బిఐలో 41 కోట్ల మంది కస్టమర్లున్నారు. జరిమానా రుసుము తగ్గిం పు నిర్ణయంతో 25 కోట్ల మంది కస్టమర్లకు లబ్ధి చేకూరనుంది. బ్యాంక్‌ తమ ఖాతాదారులకు సాధారణ సేవింగ్‌ అకౌంట్‌ను బేసి క్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ (బిఎ్‌సబిడి) మారే అవకాశం కల్పిస్తోందని గుప్తా తెలిపారు. బిఎ్‌సబిడితో పాటు జన్‌ధన్‌ ఖాతాలకు పెనాల్టీలు వర్తించవు. కాగా ఖాతాల్లో కనీస నిల్వ ఉంచ లేదన్న కారణంతో ఎస్‌బిఐ దాదాపు 41.16 లక్షల ఖాతాలను క్లోజ్‌ చేసింది.
 
ప్రైవేట్‌ బ్యాంకులతో పోలిస్తే తక్కువే..
ఎస్‌బిఐ ప్రస్తుతం విధిస్తున్న పెనాల్టీ చార్జీలు ప్రైవేట్‌ బ్యాంక్‌లతో పోలిస్తే మాత్రం తక్కువే. మెట్రో, అర్బన్‌ ప్రాంతాల్లో ఐసిఐసిఐ బ్యాంక్‌, హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంక్‌ బ్రాంచీల్లో నెలవారీ కనీస నిల్వ పరిమితి రూ.10వేలు. ఖాతాలోని నగదు నిల్వ కనీస స్థాయి కంటే తగ్గిన పక్షంలో ఐసిఐసిఐ బ్యాంక్‌ రూ.100తోపాటు తగ్గిన మొత్తంలో 5 శాతాన్ని జరిమానాగా వసూలు చేస్తోంది. హెచ్‌డి ఎ్‌ఫసి బ్యాంకైతే ఏకంగా రూ.600 వరకు పెనాల్టీ విధిస్తోంది.
 
ఎటిఎం లావాదేవీల్లో నష్టపోతున్నాం..
సేవింగ్స్‌ ఖాతాలపై ఎస్‌బిఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ గత నెలలో స్పందిస్తూ.. వీటి లావాదేవీల నిర్వహణ వ్యయం అధికంగా ఉంటుందని అన్నారు. ఎస్‌బిఐ కస్టమర్‌ తన డెబిట్‌ కార్డును ఇతర బ్యాంక్‌ ఎటిఎంలో ఉపయోగించినప్పుడు, ఎస్‌బిఐ ఆ బ్యాంక్‌కు రూ.17 చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇలా ఏటా రూ.1500 కోట్ల మేర ఇతర బ్యాంకులకు చెల్లించాల్సి వస్తోందని, ఈ ఖర్చులను ఏదో రూపంలో రికవర్‌ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

జంషెట్జీ టాటా - ఒక గొప్ప పారిశ్రామిక వేత్త




భారత పారిశ్రామిక రంగానికి నడకలు నేర్పిన జంషెట్జీ టాటా!

అప్పటికే బ్రిటిషర్ల కబంధ హస్తాల్లో చిక్కుకున్న భరత మాత విలవిల్లాడిపోతోంది. తనలోని సహజ వనరులన్నింటినీ చేజిక్కించుకునే క్రమంలో బ్రిటిషర్లు పన్నని పన్నాగం అంటూ లేదు. చేయని దురాగతం లేదు. తెల్లదొరల దుర్మార్గ పాలనలో ఛిన్నాభిన్నమైన తన బిడ్డలు ఒక్కటై, శత్రువును తరిమికొట్టేందుకు ఎప్పుడెప్పుడు కదులుతారా? అంటూ చూస్తున్న సమయంలో...1839, మార్చి 3న భరత మాతకు ఓ బిడ్డ జన్మించాడు. తనను విశ్వ వాణిజ్య విపణిలో సమున్నత స్థానంలో నిలపగల సత్తా ఆ బిడ్డ సొంతమని ఆమెకు తెలుసు. అయితే అందుకోసం కాస్త సమయం పడుతుందని కూడా తెలిసిన భరత మాత, ఆ బిడ్డకు జాగ్రత్తగా నడకలు నేర్పింది. అంచెలంచెలుగా ఎదిగిన ఆ బిడ్డ, తన తల్లి రుణం తీర్చుకున్నాడు. ఆమెను విశ్వ వాణిజ్య విపణిలో సమున్నతంగా నిలపడమే కాక, తమపై ఆధిపత్యం చెలాయించిన నోళ్లతోనే పొగడ్తలూ వెల్లువెత్తేలా చేశాడు. అతడే భారత వ్యాపార రంగ నవ వైతాళికుడు... జంషెట్జీ టాటా.

19 ఏళ్లకే గ్రీన్ స్కాలర్ పట్టా!
గుజరాత్ లోని చిన్న పట్టణం నవ్సారిలో పార్సీ మత బోధకుల ఇంట జంషెట్జీ టాటా జన్మించారు. తరాలుగా వస్తున్న మత బోధకుల వృత్తిని వదిలేసి, ఆ తరహా కుటుంబ కట్టుబాట్లను కాదని తొలిసారి వ్యాపార రంగం బాట పట్టిన నుస్సర్వాన్జీ టాటా, జీవన్ బాయి టాటాలకు జ్యేష్ఠ సంతానంగా పుట్టిన జంషెట్జీ, 14 ఏళ్ల వయసుకే పదేళ్ల హీరాబాయి దాబూని బాల్య వివాహం చేసుకోవాల్సి వచ్చింది.
సరిగ్గా సిపాయిల తిరుగుబాటు జరిగిన మరుసటి ఏడాది 19 ఏళ్ల వయసులో జంషెట్జీ టాటా, నాటి బాంబే లోని ఎల్ఫిన్ స్టోన్ కళాశాల నుంచి 1858లో నేటి డిగ్రీతో సమానమైన గ్రీన్ స్కాలర్ పట్టా పొందారు. మరుసటి ఏడాది తండ్రి స్థాపించిన చిన్నపాటి వ్యాపారంలో కుదురుకున్నారు. ఈ క్రమంలో తండ్రి వద్ద వ్యాపార మెళకువలను ఒంటబట్టించుకున్న జంషెట్జీ, 29 ఏళ్ల వయసు వచ్చేసరికి సొంతంగా వ్యాపారం చేసేందుకు సిద్ధపడ్డారు. కేవలం రూ. 21,000లతో మొదలుపెట్టిన ఈ వ్యాపారం, కలిసి రాకపోగా, ఆయనను కుంగదీసింది. ఈ క్రమంలో జరిగిన తన తొలి ఇంగ్లండ్ పర్యటన, ఆయనకు పాఠాలు బాగానే నేర్పింది. వస్త్ర తయారీ రంగం మెళకువలపై అవగాహననూ పెంచింది. 
తుప్పుపట్టిన ఆయిల్ మిల్లునే కాటన్ మిల్లుగా మార్చేశారు!
వస్త్ర తయారీ రంగంలో భారత పరిశ్రమలకు బంగారు భవిష్యత్తు ఉందని గ్రహించిన జంషెట్జీ, ఆ దిశగా అడుగులు వేశారు. బాంబే పారిశ్రామిక వాడలోని చింక్పోలిలో దివాళా తీసి, మూలనపడ్డ ఓ పాడుబడ్డ నూనె మిల్లును1869లో చేజిక్కించుకున్న ఆయన అలెగ్జాండ్రా మిల్లుగా పేరుమార్చి కాటన్ మిల్లుగా తీర్చిదిద్దారు. అయితే స్వల్ప కాలంలోనే దీనిని వదిలించుకున్నారు. అయితే ఈ సందర్భంగా కొంత మేర లాభాన్ని జేబులో వేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇంగ్లండ్ లో పర్యటించి, అక్కడి లాంక్ షైర్ లోని వస్త్ర వ్యాపార రీతులపై సుదీర్ఘ అధ్యయనం చేశారు. అక్కడి మెషీన్లు, వృత్తి నైపుణ్యాలు ఆయనను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే, అక్కడి తీరుతోనే భారత్ లో ప్రయోగాలు చేయాలనే తలంపుతో పర్యటనను ముగించుకుని వచ్చారు. 
సకల సౌకర్యాలుండే ప్రాంతంలోనే ప్రయోగం
ఈ క్రమంలో సొంతంగా జౌళి రంగంలో ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించుకున్న జంషెట్జీ, అందుకు అనువైన ప్రాంతం కోసం వెదకడం మొదలుపెట్టారు. జౌళి రంగానికి కేంద్రంగా ఉన్న బాంబేను మించి మెరుగైన ప్రాంతం ఎక్కడ దొరుకుతుందన్న భావన నుంచి బయటకు వచ్చిన ఆయన, పత్తి సాగు చేసే పొలాలు దగ్గరగా ఉండటంతో పాటు అందుబాటులో రైల్వే జంక్షన్, నీరు, ఇంధనం సమృద్ధిగా లభించే నాగ్ పూర్ ను ఎంచుకున్నారు. 1874లో రూ.1.5 లక్షల పెట్టుబడితో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యూఫ్యాక్చరింగ్ కంపెనీని నెలకొల్పారు. మూడేళ్ల తర్వాత 1877, జనవరి 1న బ్రిటన్ రాణి విక్టోరియా, ’ఇంప్రెస్ ఆఫ్ ఇండియా‘ పొగడ్తతో సదరు కంపెనీ ఒక్కసారిగా ఇంప్రెస్ మిల్స్ గా మారిపోయింది. ఇంప్రెస్ మిల్స్ తో జంషెట్జీ, ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 
తీరని కోరికలు మూడే!
1880 నుంచి తాను మరణించిన 1904 వరకు జంషెట్జీ, ఎప్పుడూ ఓ మూడు కలలు కంటూ ఉండేవారు. ఉక్కు కర్మాగారం, జల విద్యుత్ ప్రాజెక్టు, సైన్స్ సంబంధిత అంశాల్లో భారతీయ విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బోధనలు చేసే విద్యా సంస్థలను నెలకొల్పాలని ఆయన భావించారు. అయితే అవి సాకారం కాకముందే జంషెట్జీ గతించారు. అయితే మరో చిరకాల వాంఛ అయిన హోటల్ నిర్మాణాన్ని మాత్రం పూర్తి చేయగలిగారు. ఏ స్థాయిలోనంటే, అప్పటిదాకా దేశంలో ఎక్కడా లేనంత నూతనత్వంతో నిర్మించారు.
దాదాపు అప్పుడే రూ.4.21 కోట్ల విలువ చేసే తాజ్ మహల్ హోటల్, అమెరికా ఫ్యాన్లు, జర్మన్ ఎలివేటర్లు, టర్కిష్ టాయిలెట్లు, ఇంగ్లీష్ బట్లర్లతో అత్యంత ఆధునిక హంగులతో 1903లో సేవలందించడం ప్రారంభించింది. అప్పటికి బాంబేలో విద్యుత్ వినియోగిస్తున్న హోటల్ గానూ తాజ్ వినుతికెక్కింది. ఆయన గతించినా, ఆయన ఆశయాలు నిజరూపం దాల్చాయి. అందుకు నిదర్శనమే టాటా స్టీల్, టాటా పవర్ కంపెనీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. జంషెట్జీ టాటా ఆశయాలకు ఆయన వారసులు జీవం పోయకపోతే ఇవన్నీ మనకు అందుబాటులోకి వచ్చేవే కావు. 
చేయూతలో విశిష్టత
ఛారిటీ సంస్థలకు నిధులు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం జంషెట్జీకి అసలిష్టం లేదు. అయితే సేవా కార్యక్రమాలను ఆయన ఏమాత్రం అలక్ష్యం చేయలేదు. 1892లో జేఎన్ టాటా ఫౌండేషన్ పేరిట సంస్థను ఏర్పాటు చేసిన ఆయన, కుల, మత, ప్రాంత, జాతి సంబంధిత అంశాలతో ఏమాత్రం సంబంధం లేకుండా భారత విద్యార్థులు ఇంగ్లండ్ లో విద్యనభ్యసింసేందుకు చేయూతనందించారు. ఇది ఎంతగా ఫలితాలిచ్చిందంటే, 1924 వరకు సివిల్ సర్వీసులకు ఎంపికైన ప్రతి ఐదుగురు భారతీయుల్లో, ఇద్దరు టాటా స్కాలర్ షిప్పులతో విద్యనభ్యసించిన వారే నిలిచేంతగా! ఈ దిశలో రూపుదిద్దుకున్నదే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. అయితే ఈ విద్యా సంస్థ ఏర్పాటు కార్యరూపం దాల్చడానికి దాదాపు పుష్కర కాలం పట్టింది. 
కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట
తనతో ఏమాత్రం సంబంధం లేని వారికే ఆ స్థాయిలో చేయూతనందించిన జంషెట్జీ, మరి తన కార్మికులకు ఏం చేయలేదా? అంటే, అదో పెద్ద ఇతిహాసమే అవుతుంది. తన కంపెనీల్లో పనిచేసే కార్మికుల కోసం ఆయన తీసుకున్న పటిష్ఠ చర్యల కారణంగానే నేడు జంషెడ్పూర్ పారిశ్రామిక కళతో అలరారుతోంది. తాను మరణించడానికి ఐదేళ్ల ముందే, కార్మికుల సంక్షేమం కోసం ఆయన ప్రత్యేకంగా చర్యలకు ఉపక్రమించారు. కార్మికుల నివాసం, ఇతర సౌకర్యాల కోసం సేకరించిన ప్రాంతమే, టాటా కంపెనీలతో పాటు ఎదుగుతూ, టాటాల ఆధ్యుడైన జంషెట్జీ పేరిటే, జంషెడ్పూర్ గా రూపాంతరం చెందిందనే విషయం తెలిసిందే. 
కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై చనిపోవడానికి రెండేళ్ల ముందు జంషెట్జీ, తన పెద్ద కుమారుడు దొరాబ్ టాటాకు ఓ లేఖ రాశారు. కార్మికుల కాలనీలో వెడల్పాటి రోడ్లు, అత్యంత వేగంగా పెరిగి నీడనిచ్చే చెట్లు నాటాలని ఆ లేఖలో సూచించారు. అంతేకాక కార్మికులు సేదదీరేందుకు భారీ విస్తీర్ణంలో పచ్చిక బయళ్లను, తోటలను ఏర్పాటు చేయడంతో పాటు ఫుట్ బాల్, హాకీ  తదితర ఆటలు, పార్కుల కోసం కూడా భారీ విస్తీర్ణంలో ఖాళీ స్థలాలను కేటాయించాలని కూడా సదరు లేఖలో జంషెట్జీ సూచించారంటే, ఆయన ముందు చూపు ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది. ఇక కార్మికుల భవిష్యనిధి, గ్రాట్యూటీ తదితరాలు భారత్ లో చట్టబద్ధమయ్యే సమయానికి చాలాకాలం ముందే టాటా కార్మికులకు అందించిన ఘనుడు జంషెట్జీ టాటా. 

Sunday, 6 August 2017

వాట్సాప్ ను వ్యాపార అవసరాలకు వినియోగించుకోవచ్చా...?

వాట్సాప్ సరదా, కాలక్షేపానికి పరిమితం కాదు. ఇదో అతిపెద్ద సమాచార వారధి. వినోదానికే కాకుండా మనసుపెట్టి ఆలోచిస్తే వాట్సాప్ తో బోలెడు ఉపయోగాలున్నాయి. ఎన్నో అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. ఉపాధి, వ్యాపారానికి కూడా ఇది చుక్కాని వంటిదే.

వ్యాపార అవసరాలు కమ్యూనికేషన్ సాధనం అయినందున వాట్సాప్ వ్యాపార వృద్ధికీ చక్కగా ఉపయోగపడుతోంది. సేల్స్ టీమ్ నిర్వహణకు, వారితో  నిరంతరం సంప్రదింపులకు దీన్ని వాడుకోవచ్చు. ఒక గ్రూపు పరిధిలో 250 మందికి చోటు ఉంటుంది గనుక ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్ స్థాయిలో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకోవచ్చు. మెయిల్స్ తో పోలిస్తే వాట్సాప్ సాయంతో చాలా వేగంగా, సులభంగా అవతలివారిని కనెక్ట్ కావొచ్చు.

కస్టమర్ తో సంప్రదింపులకు, సర్వీస్ కు కూడా వాట్సాప్ ఓ చక్కని సాధనం. నేరుగా ఫోన్ కాల్స్ చేసి మాట్లాడడం సమయం తీసుకునే ప్రక్రియ కనుక కస్టమర్లు సేవ, వస్తువులకు సంబంధించి వాట్సాప్ లో సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. కంప్లయింట్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. అయితే, భారీ సంఖ్యలో కస్టమర్ల నుంచి ఫిర్యాదులు, విచారణలు వస్తే వాట్సాప్ వేదికగా సమాధానం ఇవ్వడం కష్టమేనంటున్నారు నిపుణులు. అటువంటప్పుడు కస్టమర్ల నుంచి ఫిర్యాదు స్వీకరించేందుకు వాట్సాప్ ను ఉపయోగించుకుంటూనే, ఆ తర్వాత వాటికి మెయిల్స్ ద్వారా సమాధానం ఇచ్చుకోవచ్చు. మార్కెటింగ్, ప్రమోషన్ కు కూడా వాట్సాప్ ఉపయోగపడుతుందంటున్నారు. కోల్గేట్ కంపెనీ తన టూస్ పేస్ట్ కు ప్రచారం కల్పించుకునేందుకు ఇటీవల వాట్సాప్ ను వాడుకుంది. టూత్ పేస్ట్ ప్యాక్ పై ఉన్న వాట్సాప్ నంబర్ కు కస్టమర్లు నవ్వుతూ ఉన్న సెల్ఫీ ఫొటోలను తీసి పంపించాలని కోరింది. బ్రాండ్ అంబాసిడర్ సోనమ్ కపూర్ చేతుల మీదుగా స్టైలిస్ట్ గా రూపొందే అవకాశాన్ని గెలుచుకోవచ్చని ప్రకటించింది. కస్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్ కోసమూ దీన్ని వాడుకోవచ్చు. ఉత్పత్తుల గురించి సమాచారాన్ని తెలియజేసేందుకు వీలుగా వాటిపై వాట్సాప్ నంబర్ ఇస్తే కస్టమర్ల అభిప్రాయాలు నేరుగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.

భిన్న రకాలుగా...* ముంబైకి చెందిన రష్ అనే సంస్థ వాట్సాప్ నుంచి కేక్, పుష్పాల కోసం ఆర్డర్లను స్వీకరిస్తోంది.  
* నేడు చాలా వేదికలు వాట్సాప్ నుంచి ఫుడ్ కోసం ఆర్డర్లు స్వీకరిస్తున్నాయి. ఉదాహరణకు ఓ రెస్టారెంట్ కు సంబంధించిన మెనూను వాట్సాప్ లో పెడితే, మెనూ చూసి అందులో నంబర్ ను చెబితే చాలు. ఆ నంబర్ పై ఉన్న ఐటమ్ ను ఇంటికే డెలివరీ చేస్తారు.
* వైద్యుల అపాయింట్ మెంట్ బుకింగ్ ను వాట్సాప్ వేదికగా చేసుకునేందుకు కొన్ని చోట్ల అవకాశం ఉంది. అలాగే సాధారణ ఆరోగ్య సమస్యలపై వైద్యుల సూచనలు, సలహాలను కూడా వాట్సాప్ వేదికగా పొందే అవకాశం ఉంది.
* ఫార్మసీ స్టోర్స్ కు సంబంధించిన వాట్సాప్ నంబర్ కు ప్రిస్క్రిప్షన్ పంపితే చాలు. అన్ని మందులను ప్యాక్ చేసి ఇంటికే పంపించేస్తారు.  
* ఢిల్లీ పోలీసులు వాట్సాప్ నంబర్ తో ఓ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. ప్రారంభం రోజున 23,000 ఫిర్యాదులు వచ్చిపడ్డాయి.

ఆమె వ్యాపారానికి చక్కని తోడ్పాటునీతా అడప్పా ప్రకృతి హెర్బల్స్ పేరుతో హెర్బల్ ఉత్పత్తుల విక్రయాల కోసం, ప్రచారం, కస్టమర్ల సేవల కోసం వాట్సాప్ గ్రూపులను ప్రారంభించింది. విసుగు అనుకోకుండా వచ్చిన ప్రతీ సందేశానికి సమాధానమిస్తుంది. దీంతో ఆమె ఉత్పత్తులకు, సేవలకు చక్కని గుర్తింపు లభించింది. దీంతో ఆమె వ్యాపారం మరింత విస్తరించింది. దీనివల్ల కస్టమర్లతో సన్నిహిత సంబంధాలకు అవకాశం ఉంటుందని నిపుణుల అభిప్రాయం.

వాట్సాప్ ట్యూషన్స్
వాట్సాప్ ను చిన్న ఆన్ లైన్ పాఠశాలగానూ ఉపయోగించుకోవచ్చు. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు ఒక  గ్రూపులోకి రావచ్చు. టీచర్లు పాఠశాల ముగిసిన తర్వాత కూడా విద్యార్థులతో విద్యకు సంబంధించి ట్యూషన్స్ ను వాట్సాప్ లో చెప్పుకోవచ్చు. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు, వారికి అసైన్ మెంట్స్, పాఠాలకు సంబంధించిన ఆడియో, వీడియోలు క్లిప్పులు పంపడం, గ్రాఫిక్స్, చార్టులు పంపడం చేసుకోవచ్చు. విద్యార్థులకు వాట్సాప్ యాక్సెస్ ఇవ్వడం అంతగా మంచిది కాదు గనుక వారి తల్లిదండ్రుల ద్వారా అనుసంధానం కావచ్చు.  

వ్యాపారుల కోసం ప్రత్యేక యాప్వాట్సాప్ వ్యాపారుల కోసం త్వరలోనే ప్రత్యేకంగా ఓ యాప్ రానుంది. చిన్న వ్యాపారులు ప్రస్తుత యాప్ కు భిన్నమైన వర్షన్ ను డౌన్ లోడ్ చేసుకుని మరింత మంది కస్టమర్లకు వాట్సాప్ వేదికగా సేవలు అందించొచ్చు. ప్రస్తుతం సాధారణ గ్రూపులో గరిష్టంగా 250కి మించి ఉండేందుకు అవకాశం లేదు. కానీ వ్యాపారుల కోసం రానున్న యాప్ లో సభ్యుల సంఖ్య మరింత ఎక్కువే ఉండనుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది.