Saturday, 6 August 2016

అవకాశాల కామధేనువు ... కామర్స్ – సవాళ్లతో కూడిన వృత్తి.. మార్కెటింగ్ మేనేజర్!


షేర్ల వ్యాపారానికి స్టాక్ బ్రోకర్!

స్టాక్ ఎక్స్ఛేంజ్, బులియన్ మార్కెట్, షేర్లు, సెన్సెక్స్, నిఫ్టీ.. ఇవి మనం తరచుగా వినే పదాలు. సంప్రదాయ పొదుపు పథకాల కంటే షేర్లలో పెట్టుబడులతో అధిక రాబడి ఉంటుందని ఆర్థిక నిపుణులు సలహాలు ఇస్తుంటారు. అయితే, షేర్లు, అందులో పెట్టుబడులపై చాలామందికి ఏమాత్రం అవగాహన ఉండదు. షేర్ల ఫలాలు పొందాలనుకునే క్లయింట్ల తరఫున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి స్టాక్ బ్రోకర్లు ఉంటారు. ప్రపంచంలో ధనం చెలామణిలో ఉన్నంతకాలం స్టాక్ బ్రోకర్లకు చేతినిండా పని, మంచి ఆదాయం లభిస్తాయని నిపుణులు అంటున్నారు. 
పేరు ప్రఖ్యాతలు, ఆదాయం, అవకాశాలు: స్టాక్ బ్రోకర్లు తమ క్లయింట్లకు సురక్షితమైన పెట్టుబడి పథకాలను సూచించాల్సి ఉంటుంది. వారి తరఫున షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి. షేర్ల కొనుగోలు, అమ్మకం వంటి కార్యకలాపాలు స్వయంగా చేపట్టాలి. ఈ వ్యవహారాలను నిర్వహించినందుకు క్లయింట్ల నుంచి ఆకర్షణీయమైన కమీషన్ పొందొచ్చు. స్టాక్ బ్రోకర్లు తమ పనితీరుతో క్లయింట్లకు లాభాలను ఆర్జించి పెడితే పేరుప్రఖ్యాతలు వస్తాయి. అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి. తాజా గ్రాడ్యుయేట్లు/పోస్టు గ్రాడ్యుయేట్లకు స్టాక్ బ్రోకరేజీ సంస్థల్లో అసిస్టెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్/రిలేషన్‌షిప్ మేనేజర్‌గా కొలువులు అందుబాటులో ఉన్నాయి. బ్రోకరేజీ కంపెనీలో సబ్-బ్రోకర్, ఫ్రాంచైజీగా కూడా చేరొచ్చు.

కావాల్సిన నైపుణ్యాలు: స్టాక్ బ్రోకర్‌కు మార్కెట్ పల్స్‌ను సరిగ్గా గుర్తించే నేర్పు ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో నమ్మకం ప్రధానం. క్లయింట్ల మనోభావాలు దెబ్బతినకుండా, మార్కెట్‌లో కంపెనీ స్థానం దిగ జారకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్టాక్ బ్రోకర్ పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే క్లయింట్ల జీవితాలు తారుమారవుతాయి. కాబట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సదా అప్రమత్తంగా ఉండాలి. ఈ వృత్తిలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి.

అర్హతలు: మన దేశంలో బ్రోకరేజీ సంస్థలు ఎంబీఏ (ఫైనాన్స్) కోర్సు చదివినవారిని అసిస్టెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్‌గా నియమించుకుంటున్నాయి. కాబట్టి ఈ కోర్సు పూర్తిచేస్తే స్టాక్ బ్రోకర్‌గా స్థిరపడొచ్చు. దీంతోపాటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ చేస్తున్న ఫైనాన్షియల్ మార్కెట్స్ సర్టిఫికేషన్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ చేస్తున్న డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ సర్టిఫికేషన్ కూడా పూర్తిచేస్తే అర్హతలను పెంచుకొని, మంచి అవకాశాలను అందుకోవచ్చు.

వేతనాలు: స్టాక్ బ్రోకర్లకు పనితీరును బట్టి ఆదాయం చేతికందుతుంది. ఎంబీఏ(ఫైనాన్స్) కోర్సు చేసిన రిలేషన్‌షిప్ మేనేజర్ సంవత్సరానికి రూ.2.4 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. నాన్-ఫైనాన్స్ రిలేషన్‌షిప్ మేనేజర్‌కు ఇంతకంటే కొంత తక్కువ ఆదాయం లభిస్తుంది. సంస్థ పరిధిని బట్టి ఇందులో మార్పులుంటాయి. రిలేషన్‌షిప్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించినవారు మెరుగైన పనితీరుతో టీమ్ లీడర్, జోనల్ మేనేజర్‌గా పదోన్నతులు పొందొచ్చు.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  • బీఎస్‌ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-ముంబై.
    వెబ్‌సైట్: 
    www.bseindia.com
  • నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్-ముంబై.
    వెబ్‌సైట్:
     www.nseindia.com
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ
    వెబ్‌సైట్:
     www.icsi.edu
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ
    వెబ్‌సైట్:
     www.icai.org 
  • ఎన్‌సీఎఫ్‌ఎం అకాడమీ-హైదరాబాద్.
    వెబ్‌సైట్: 
    www.ascncfmacademy.com
ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగొచ్చు ‘‘భారతీయ స్టాక్ మార్కెట్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. స్టాక్ బ్రోకర్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఫైనాన్స్, మార్కెట్లపై ఆసక్తి ఉన్న ఇంటర్మీడియెట్, డిగ్రీ అభ్యర్థులు ఈ కోర్సులను అభ్యసించొచ్చు. షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్ల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియలో స్టాక్ బ్రోకర్‌దే ప్రధాన పాత్ర. వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన ఈ క్రయవిక్రయాల విషయంలో స్టాక్‌బ్రోకర్... డీలర్‌గా, అడ్వైజర్‌గా, అనలిస్ట్‌గా పనిచేస్తాడు. ఈ కెరీర్‌లో ప్రవేశించిన వారు ఉద్యోగాలకే పరిమితమవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ స్థితిగతులపై పూర్తి అవగాహన ఏర్పడితే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది’’

అవకాశాల కామధేనువు ... కామర్స్ – సవాళ్లతో కూడిన వృత్తి.. మార్కెటింగ్ మేనేజర్!

అవకాశాల కామధేనువు ... కామర్స్ – సవాళ్లతో కూడిన వృత్తి.. మార్కెటింగ్ మేనేజర్!


సవాళ్లతో కూడిన వృత్తి.. మార్కెటింగ్ మేనేజర్!
సేల్స్ అండ్ మార్కెటింగ్... ప్రపంచవ్యాప్తంగా వందల ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ప్రక్రియ. ఇది కంపెనీలో తయారు చేసిన ఉత్పత్తులను, సంస్థల సేవలను సంబంధిత వినియోగదారులకు విక్రయించే బహుముఖ వ్యాపారం. అమ్మకాలపైనే సంస్థల మనుగడ ఆధారపడి ఉంటుంది. ఇలా అమ్మకాలు సాగిస్తూ కంపెనీకి, వినియోగదారులకు మధ్య వారధిగా పనిచేసేవారే.. సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్లు. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని దేశాల మధ్య సరిహద్దులు చెదిరిపోతూ వ్యాపార సంస్కృతి విస్తరిస్తుండడంతో మార్కెటింగ్ నిపుణులకు అవకాశాలు మిన్నంటుతున్నాయి. దేశ విదేశాల్లో భారీగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇకపై భవిష్యత్తంతా సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగానిదేనని చెప్పడం అతిశయోక్తి కాదు. కాబట్టి దీన్ని కెరీర్గా ఎంచుకుంటే అవకాశాలకు, ఆదాయానికి నింగే హద్దు. 

మార్కెటింగ్ నిపుణుల కొరత తీవ్రం 
నేడు అన్ని రంగాల్లో సేల్స్ మేనేజర్ల పాత్ర తప్పనిసరి. ప్రధానంగా రిటైల్, ఐటీ, హాస్పిటాలిటీ, ట్రావెల్, హెల్త్కేర్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో అధిక ఉద్యోగాలున్నాయి. ప్రస్తుతం నిపుణులైన మేనేజర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. డిమాండ్, సప్లై మధ్య అంతరం ఎక్కువగా ఉంది. దీనిపై జనంలో ఇప్పటిదాకా అంతగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. మార్కెటింగ్ను కెరీర్గా ఎంచుకొనే యవత సంఖ్య పెరుగుతోంది. ప్రారంభంలో సేల్స్ పర్సన్గా పనిచేసినవారు వృత్తిలో నైపుణ్యాలను పెంచుకొని మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు. కుటీర పరిశ్రమల నుంచి కార్పొరేట్ సంస్థల వరకు తమ వ్యాపారాభివృద్ధి కోసం మార్కెటింగ్ మేనేజర్లను నియమించుకుంటున్నాయి. ఈ వృత్తి మిగిలినవాటితో పోలిస్తే భిన్నమైనది. తానేం సాధించాలో మేనేజర్కు ముందే తెలుస్తుంది. ఇందులో పోటీ, సవాళ్లు అధికంగా ఉంటాయి. |

కావాల్సిన నైపుణ్యాలు
సేల్స్ మేనేజ్మెంట్లో మెరవాలంటే మాతృభాషతోపాటు ఆంగ్లంపై గట్టి పట్టుండాలి. అనర్గళంగా మాట్లాడే, తప్పుల్లేకుండా రాసే నైపుణ్యం అవసరం. మాటలతో వినియోగదారులను ప్రభావితం చేసి, ఒప్పించగలిగే నేర్పు ఉండాలి. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం ముఖ్యం. సాధారణ వ్యాపార లావాదేవీలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. తార్కికంగా ఆలోచించగలగాలి. ప్రజంటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకొనేదాకా ఓపికతో పనిచేయాలి. నాయకత్వ లక్షణాలుండాలి. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం కావాలి. 

అర్హతలు
సేల్స్ రంగాన్ని కెరీర్గా ఎంచుకోవాలంటే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీఏ పూర్తిచేయాలి. గతంలో మేనేజ్మెంట్ డిగ్రీ లేకపోయినా సేల్స్ మేనేజర్గా అవకాశాలు లభించేవి. ప్రస్తుతం సేల్స్ అండ్ మార్కెటింగ్లో చేరాలంటే బిజినెస్ స్టడీస్లో డిగ్రీ/డిప్లొమా ఉండడం తప్పనిసరి. తగిన విద్యార్హతలతో కెరీర్లో వేగంగా ఎదగడానికి వీలుంటుంది. మార్కెటింగ్ అర్హతలు లేని సాధారణ గ్రాడ్యుయేట్లు సైతం ఈ రంగంలో స్వయం ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. 

వేతనాలు
సేల్స్ మేనేజ్మెంట్ నిపుణులకు అధిక వేతనాలుంటాయి. ప్రారంభంలో సంవత్సరానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వేతన ప్యాకేజీ లభిస్తుంది. సీనియారిటీ పెరిగితే ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అందుకోవచ్చు. 

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
-ఉస్మానియా యూనివర్సిటీ
వెబ్సైట్: www.osmania.ac.in/
-
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-లక్నో. వెబ్సైట్: www.iiml.ac.in/
-
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్
వెబ్సైట్: www.iiswbm.edu/
-
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ 
వెబ్సైట్: www.imt.edu/ 
-
ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్-ఢిల్లీ
వెబ్సైట్: http://fms.edu/
-
జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్
వెబ్సైట్: www.xlri.ac.in/
======================================================
సమర్థతను బట్టి వేతనాలు 
‘‘ప్రపంచ దేశాలు తమ ఉత్పత్తుల విక్రయానికి భారత్నే అతిపెద్ద మార్కెట్గా ఎంచుకున్నాయి. ఇక్కడి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. దీంతో సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఉద్యోగావ కాశాలు పెరుగుతున్నాయి. కేవలం సబ్జెక్టు నాలెడ్జ్ మాత్రమే కాకుండా వృత్తికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలి. కమ్యూనికేషన్స్కిల్స్, ఆటిట్యూడ్, బిహేవియర్ స్కిల్స్ వంటివి అవసరం. మార్కెటింగ్ రంగంలో కెరీర్ పరంగా సాధారణ స్థాయి నుంచి మేనే జింగ్ డెరైక్టర్ వరకూ ఎదగొచ్చు. నైపుణ్యం, సమర్థతను బట్టి వేతనాలు అందుతాయి’’

అవకాశాల కామధేనువు ... కామర్స్ –కామర్స్ తో.. కోరుకునే కొలువులెన్నో..

అవకాశాల కామధేనువు ... కామర్స్ –    కామర్స్  తో.. కోరుకునే కొలువులెన్నో..

గ్లోబలైజేషన్‌తో వ్యాపార, వాణిజ్య రంగాల్లో వినూత్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విదేశీ కంపెనీల రాక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో.. ఎగుమతులు, దిగుమతులు, ట్రేడింగ్, స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి వాటిలో కార్యకలాపాలు పెరిగాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న కంపెనీలు మాల్స్ నుంచి ఈ-కామర్స్‌లో అడుగుపెట్టాయి. ఈ క్రమంలో ఆయా రంగాల్లో నిపుణుల కోసం కంపెనీలు జల్లెడపడుతున్నాయి. కామర్స్ కోర్సుల విద్యార్థులకు కంపెనీలు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులకు దీటుగా కామర్స్ కోర్సుల ఉత్తీర్ణులకూ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నాయి. ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల్లో బీకాం, ఎంకాం కోర్సుల సీట్లన్నీ వంద శాతం భర్తీ కావడమే ఈ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం. ఈ నేపథ్యంలో నగరంలో కామర్స్ కోర్సులను అందించే విద్యా సంస్థలు, అర్హతలు, అవకాశాలపై ఫోకస్...

కామర్స్.. స్పెషలైజేషన్లు 
కామర్స్ అనగానే ఇంటర్ స్థాయిలో సీఈసీ, ఎంఈసీ. డిగ్రీ స్థాయిలో మూడేళ్ల వ్యవధిలో బీకాం(జనరల్), బీకాం (కంప్యూటర్స్) మాత్రమే గుర్తొచ్చేవి. కానీ మారుతున్న జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపారాలకు అనుగుణంగా ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అవసరమైన కాంబినేషన్స్‌ను యూనివర్సిటీలు ప్రవేశపెడుతున్నాయి. బీకాం-మార్కెటింగ్, బీకాం-ఫారెన్‌ట్రేడ్, బీకాం -కార్పొరేట్ సెక్రటరీషిప్, బీకాం-ఫైనాన్స్, అకౌంటెన్సీ, బీకాం-ఒకేషనల్, బీకాం-బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, బీకాం-ఈ-కామర్స్, బీకాం-ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్, బీకాం-అకౌంట్స్(ఆనర్స్), బీకాం-సేల్స్‌మెన్‌షిప్, అడ్వర్‌టైజింగ్, బీకాం-ట్యాక్స్ ప్రొసీజర్ ఇలా ఎన్నో కొత్త కాంబినేషన్లను దేశంలో ఆయా విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ఇవన్నీ ఇంటర్మీడియట్ అర్హతతో ప్రవేశం పొందే అండర్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు. పీజీ స్థాయిలో ఎంకాం-ఫైనాన్స్, ఎంకాం-మార్కెటింగ్, ఎంకాం -ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కంట్రోల్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా మరెన్నో సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను వివిధ విద్యా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రొఫెషనల్ కోర్సుల్లో మంచి ఉద్యోగావకాశాలు అందిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంట్స్, ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ వంటివి ఉన్నాయి.

ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంచే కామర్స్ ల్యాబ్స్
బీకాం కరిక్యులంలో కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్‌సైన్స్‌తోపాటు.. అడ్వర్టయిజింగ్, సేల్స్ మేనేజ్‌మెంట్, ఫారెన్‌ట్రేడ్ ప్రాక్టీసెస్ వంటివాటిని విద్యార్థులు తెలుసుకునేందుకు కళాశాలలు కామర్స్ ల్యాబ్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలలో జరిగే అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులు; పన్నులు, సుంకాలు తదితర విషయాలపై అవగాహన పెంచేందుకు విద్యార్థులకు వేసవి క్యాంపులు నిర్వహిస్తున్నామని విల్లామేరీ కామర్స్ విభాగ అధిపతి రేవతిమాధుర్ తెలిపారు. మూడేళ్ల బీకాం కోర్సులో కేవలం బోధనకే పరిమితం కాకుండా ఆఖరి సంవత్సరంలో ప్రాక్టికల్స్, ప్రాజెక్టు వర్క్‌ను తప్పనిసరి చేశామని చెప్పారు.. కోఠి ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీత. ఇలా విద్యార్థులు.. ఉద్యోగిగా అడుగుపెట్టకముందే కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలను సొంతం చేసుకుంటారని నిపుణులు అంటున్నారు. ఓయూలో ఎంకాం స్థాయిలో ఒక సెమిస్టర్‌లో ప్రాజెక్టు వర్క్‌కు 100 మార్కులను కేటాయించారు. అదేవిధంగా ఎంకాం (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్)లో 60 శాతం ప్రాక్టికల్స్, 40 శాతం థియరీని ప్రవేశపెట్టారు. నూతన ధోరణులకనుగుణంగా ఈ-బిజినెస్‌కు అవసరమైనట్లుగా ఐటీలో విద్యార్థులకు ల్యాబ్స్ ద్వారా ప్రాక్టికల్ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఈ-అకౌంటింగ్, ఈ-కార్పొరేట్, ఈ-ఫైనాన్షియల్, సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలను అందిస్తున్నారు. 

నిపుణులకు అవకాశాలు అనేకం
కామర్స్‌లో గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సులు పూర్తిచేసినవారికి కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ఏడాది నగరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ నుంచి 13 మంది విద్యార్థులు అమెజాన్ కంపెనీ అందించే ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారు. వారిలో 12 మంది బీకాం ఆఖరి సంవత్సరం చదువుతున్నవారే కావడం విశేషం. కామర్స్ గ్రాడ్యుయేట్స్‌కు కంపెనీలు.. అకౌంటింగ్, ఆడిటింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, స్టాక్‌మార్కెట్, ట్రేడింగ్ విభాగాల్లో ఏడాదికి రూ.2.5 లక్షల వరకు అందిస్తున్నాయి. 

ఇవికాకుండా ఈ-బ్యాంకింగ్, ఈ-అకౌంటింగ్, ఈ- ఇన్సూరెన్స్ రంగాల్లో పనిచేయడానికి అకౌంటెంట్స్, ఎగ్జిక్యూటివ్స్, కరెన్సీ అండ్ బ్యాంకింగ్ ఎక్స్‌పర్ట్స్, బిజినెస్ ఎనలిటిక్స్ నిపుణులు భారీ స్థాయిలో అవసరం. హెల్త్, ఐటీ, ఫార్మా సెక్టార్‌లో అకౌంటెంట్స్, అనలిస్టులుగా కంపెనీలు కామర్స్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా మంచి వేతనాలు కూడా అందిస్తున్నాయి. ప్రారంభంలో నెలకు రూ.20,000 వరకు వేతనం ఉంటుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి నెలకు రూ.45,000 వరకు సంపాదించుకోవచ్చు. 

కోర్సులను అందించే సంస్థలు
నగరంలో దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవే ట్ కళాశాలల్లో బీకాం (ఆనర్స్), బీకాం (జనరల్), బీకాం (కంప్యూటర్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం- కాలేజ్ అందించే కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. డిస్టెన్స్ విధానంలో డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మానియా, ఇగ్నో తదితర సంస్థలు మూడేళ్ల డిగ్రీ, రెండేళ్ల పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ఇవేకాకుండా దేశంలో మరెన్నో విద్యాసంస్థలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) కోర్సును ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (www.icaihyd.org ), కంపెనీ సెక్రటరీ(సీఎస్) కోర్సు(www.icsi.edu/hyderabad ), కాస్ట్ అకౌంటెంట్ కోర్సును ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా(icmai.in/ ) అందిస్తున్నాయి. 
చదువుకయ్యే ఖర్చు తక్కువే..
‘‘ఆరేళ్లలో ఇంటర్, డిగ్రీ, సీఏ మూడింట్లోనూ ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్న్‌షిప్ కోసం పనిచేసిన సంస్థే వార్షిక వేతనం రూ.10 లక్షలు ఆఫర్ చేసింది. కానీ.. నాకు టీచింగ్ అంటే ఇష్టం. ఆ ల క్ష్యంతోనే స్నేహితులతో కలిసి సీఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించా. సీఏ పూర్తిచేసేందుకు అయిన ఖర్చు కేవలం రూ.20 వేల లోపే. రెండో సంవత్సరం నుంచి ఆడిటర్ వద్ద, సంస్థలో ఇంటర్న్‌షిప్, పార్ట్‌టైం జాబ్ చేయడం వల్ల పేరెంట్స్‌పై భారం పడలేదు. తక్కువ ఖర్చుతో చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సును పూర్తిచేశా. కోర్సుకు అయ్యే ఖర్చును ఉద్యోగంలో చేరాక ఏడాదిలో సంపాదించుకోవచ్చు
నేహా, డెరైక్టర్, ప్రాజెక్ట్ ప్రిఫిక్స్

నిపుణులకు మంచి ప్యాకేజీ
‘‘సమాజంలో ఆర్థిక కార్యకలాపాలు సాగినంత కాలం వాణిజ్యశాస్త్ర నిపుణుల అవసరం ఉంటుంది. క్రయవిక్రయాలు, మనీ ట్రాన్సాక్షన్స్, లాభనష్టాలు ఇవన్నీ కామర్స్‌తో ముడిపడినవే. అందుకే కామర్‌‌సకు అంతటి డిమాండ్. మార్కెట్ పరిస్థితులను అంచనా వేయాలంటే విశ్లేషణ చేయగలగాలి. భవిష్యత్తుల్లో క్రయవిక్రయాలను పరిశీలించాలన్నా అనలిటిక్స్‌పైనే ఆధారపడాలి. మారిన ఈ-కామర్స్ ట్రెండ్‌లోనూ అకౌంటింగ్స్‌దే కీలకపాత్ర. బ్యాంకింగ్, ఫైనాన్స్, ట్రేడింగ్, స్టాక్‌మార్కెట్ ఇలా కార్పొరేట్ రంగంలోనే కాదు.. ప్రభుత్వ రంగంలోనూ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఆడిటర్స్‌ను ఎంపికచేస్తున్నారు. మున్సిపాలిటీల్లో సీనియర్, జూనియర్ అకౌంటెంట్స్, ఆడిటర్స్‌గా, బీఎస్‌ఎన్‌ఎల్, బీహెచ్‌ఈఎల్, ఏపీ ట్రాన్స్‌కో, రైల్వే, ఆర్టీసీ ఇలా వాణిజ్య కార్యకలాపాలు జరిగే అన్ని విభాగాల్లోనూ కామర్స్ గ్రాడ్యుయేట్స్‌కు అవకాశాలున్నాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ రంగాలు గ్రామీణ ప్రాంతాలకు చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నాయి. దీనికోసం నిపుణులైన మానవ వనరులపైనే ఆధారపడాలి. గతంతో పోల్చితే కామర్స్ చదివిన వారు కేవలం అకౌంటెంట్‌గానే మిగిలిపోవట్లేదు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదుగుతున్నారు. అయితే ఈ రంగంలో రాణించాలంటే కావ్సాలింది.. మంచి కమ్యూనికేషన్‌స్కిల్స్, వర్తమాన అంశాలపై అవగాహన, స్టాటిస్టికల్, అనలిటికల్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పట్టు. ఇవన్నీ కాలేజీలో ఉన్నప్పుడే అలవరుచుకోవాలి. సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే టెక్ట్స్‌బుక్స్‌ను ఫాలో అవ్వాలి. ప్రాజెక్టువర్క్‌ను నిజాయతీగా చేయాలి. విద్యార్థులు తమ క్యాంపస్‌లోని కామర్స్ ల్యాబ్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి. నిపుణులుగా సబ్జెక్టును ఆకళింపు చేసుకోగలిగి, ప్రాక్టికల్‌గా అప్లై చేయగలిగే సామర్థ్యం సంపాదిస్తే లక్షల్లో వేతనాలు ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి’’ 

అవకాశాల కామధేనువు ... కామర్స్ -ఉద్యోగ మార్కెట్ ముఖ చిత్రం

అవకాశాల కామధేనువు ... కామర్స్ -ఉద్యోగ మార్కెట్ ముఖ చిత్రం 

దేశంలో ఉద్యోగ మార్కెట్ ముఖ చిత్రం మారబోతోంది.కంపెనీలు వ్యాపార విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వడం.. విదేశాల్లో కార్యకలాపాలను ప్రారంభించడానికి ఉత్సాహం చూపిస్తుండటం.. ప్రస్తుతం ఉన్న రంగాలతోపాటు నూతన రంగాల్లోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రచిస్తుండడం.. వెరసి నిరుద్యోగులకు వరంగా మారనుంది. ఆర్థిక వ్యవస్థలో ఆశాజనక పరిస్థితుల కారణంగా కంపెనీలు తాజా గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంతోపాటు అనుభవం కలిగిన ఉద్యోగులను మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయిలో రిక్రూట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి. వివిధ రంగాల కంపెనీలకు నెలవైన మన హైదరాబాద్‌లోనూ యువతకు అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ నేపథ్యంలో.. ఉద్యోగాలకు వేదికగా నిలిచే రంగాలు..ఆయా రంగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవడానికి మార్గాలపై ప్రత్యేక కథనం.. 

ఫైనాన్స్/అకౌంటింగ్
చిన్నాపెద్ద ప్రతి కంపెనీకి ఫైనాన్‌‌స/అకౌంటింగ్ విభాగం అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. ఫైనాన్స్/అకౌంటింగ్ రంగంలో నియామక ప్రక్రియ గతేడాది మాదిరిగానే స్థిరంగా ఊర్ధ్వ దిశగా కొనసాగుతోంది. అంతేకాకుండా వేతనాల్లో 18-20 శాతం వృద్ధి చోటుచేసుకునే అవకాశముంది. ముఖ్యంగా బహుళ జాతి సంస్థలు స్థానిక మార్కెట్లోకి ప్రవేశించాలని వ్యూహాలు రచిస్తుండటం, స్వదేశీ కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో వచ్చే 12 నెలల కాలంలో ఈ రంగంలో అవకాశాలు గణనీయంగా పెరగనున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. ఇందులో స్థిరపడాలంటే ఎంబీఏ (ఫైనాన్స్) లేదా ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఈ రంగంలో రాణించేందుకు సంబంధిత అర్హతలతోపాటు కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. ఫైనాన్షియల్ స్కిల్స్ ఉండి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలున్న మానవ వనరులకు డిమాండ్ అధికంగా ఉంది. మారుతున్న అవసరాలను బట్టి సంస్థను సమర్థంగా నడిపించగలిగే నాయకత్వ లక్షణాలతోపాటు వ్యాపార విస్తరణకు దోహదపడే యువత కు ఈ రంగం స్వాగతం పలుకుతోంది.

సేల్స్ అండ్ మార్కెటింగ్
ఏటా స్థిరంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్న రంగం.. సేల్స్ అండ్ మార్కెటింగ్. ఈ విభాగంలోని రిటైల్, హెల్త్‌కేర్, లైఫ్ సెన్సైస్ రంగాలు 12 శాతం వృద్ధిని సాధించాయి. దీంతో ఈ రంగానికి సంబంధించిన కార్యకలాపాలను మెట్రోసిటీల నుంచి చిన్న పట్టణాలకు సైతం విస్తరించడానికి సదరు సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దాని ఫలితమే మనకు కనిపిస్తున్న సూపర్ మార్కెట్ చైన్లు, బ్రాండెడ్ ఫార్మసీ అవుట్‌లెట్లు. వీటికి వినియోగదారుల నుంచి నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. దాంతో విస్తరణకు మార్గం చూపే ఏ చిన్న అవకాశాన్నీ ఈ సంస్థలు వదులుకోవడం లేదు. ఫలితంగా వాటిని నిర్వహించే మేనేజర్/ఫ్లోర్ మేనేజర్ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ వరకు ఎన్నో అవకాశాలను యువత అందిపుచ్చుకోవచ్చు. ఈ రంగంలో స్థిరపడాలంటే.. డిగ్రీ, లేదా మార్కెటింగ్‌లో ఎంబీఏ చేసి ఉండాలి. వినియోగదారులతో నేరుగా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది కాబట్టి సృజనాత్మక ఆలోచనలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సందర్భానుసారంగా నిర్ణయం తీసుకునే చాతుర్యం, మార్కెటింగ్ వ్యూహాలను పసిగట్టే నేర్పు ఉన్న నిపుణులకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) రంగంలో లెక్కకు మించిన అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.

హ్యూమన్ రీసోర్సెస్
ప్రతి కంపెనీకి హ్యూమన్ రీసోర్సెస్ విభాగం తప్పనిసరి. ఎందుకంటే.. నియామకాలు, శిక్షణ, పేరోల్స్ తయారీ వంటి వ్యవహారాలను పక్కాగా నిర్వహించాల్సింది ఈ విభాగమే! కాబట్టి హ్యూమన్ రీసోర్సెస్ రంగంలో మానవ వనరుల అవసరం ఎప్పుడూ అధికంగానే ఉంటోంది. ఈ రంగంలో నియామకాలు గతేడాది కాలంగా ఆశాజనకంగా ఉన్నాయని, హైరింగ్ మరింత ఊపందుకునే పరిస్థితి కనిపిస్తోందని రిక్రూట్‌మెంట్ కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. పని చేస్తున్న ప్రదేశం, త దితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగుల వేతనాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ రంగంలో స్థిరపడాలంటే.. సంబంధిత విభాగంలో ఎంబీఏ/ఎంఏ/ఎంఎస్సీ/పీజీడీఎం వంటి కోర్సులు చేసి ఉండాలి. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ ఆపరేటింగ్, వివిధ వ్యవహారాలను మార్కెట్లోకి కొత్తగా వస్తున్న సాఫ్ట్‌వేర్ల సహాయంతో నిర్వహించే నేర్పు ఉండాలి. ఎక్కువ వేతనం పొందాలంటే మాత్రం కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి.

బ్యాంకింగ్ 
కొంతకాలంగా నియామకాల విషయంలో అన్ని రంగాల కంటే ముందంజలో నిలుస్తోంది.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం. ముఖ్యంగా నూతనంగా బ్యాంకుల ఏర్పాటు కోసం లెసైన్స్‌లను మంజూరు చేయడం, విదేశీ పెట్టుబడిదారులు స్థానిక మార్కెట్‌పై దృష్టిసారించడం వంటివి ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దాంతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, పలు ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్‌‌స కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా రిక్రూట్‌మెంట్లకు తె రదీస్తున్నాయి. స్థానిక బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులు పెరగడం కూడా హైరింగ్ ప్రక్రియ జోరుగా మారడానికి ఒక కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 25 నుంచి 33 శాతం అధిక పే ప్యాకేజ్‌లతో కొత్తగా సిబ్బందిని నియమించుకోవడానికి సంబంధిత సంస్థలు ఉత్సాహం చూపిస్తున్నాయి. కాబట్టి హైరింగ్‌కు సంబంధించి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం రోజురోజుకూ ఆశాజనకంగా మారుతోంద ని చెప్పొచ్చు. ఈ రంగంలో స్థిరపడాలంటే బ్యాంకింగ్/ ఫైనాన్షియల్ సబ్జెక్ట్‌లు ప్రధానంగా ఎంబీఏ/ఎంకామ్/ ఎంఏ/ఎంఎస్సీ/ పీజీడీఎం/డిప్లొమా వంటి కోర్సులను పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు మార్కెట్లను విశ్లేషించడం, తదనుగుణంగా వ్యూహాలను రూపొందించడం, తార్కిక వివేచన వంటి నైపుణ్యాలు ఉంటే కెరీర్‌లో త్వరగా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.

నైపుణ్యాలపై ప్రధాన దృష్టి:
కే వలం ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడానికే పరిమితం కాకుండా.. వారిని మరింత సమర్థులుగా, నాయకులుగా తీర్చిదిద్దడానికి వీలుగా శిక్షణ కార్యక్రమాలను చేపట్టడానికి కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికేతర (నాన్ ఫైనాన్షియల్) రంగంలో ఈ విషయానికి పెద్దపీట వేస్తున్నారు. తద్వారా ఉద్యోగి ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు దీర్ఘకాలంపాటు సేవలు అందించే అవకాశం ఉంటుందని కూడా కంపెనీలు భావిస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపారాన్ని విస్తరించినప్పుడు కొత్తవారి రిక్రూట్‌మెంట్ కంటే సొంత ఉద్యోగులను మిడిల్ మేనేజ్‌మెంట్ నిపుణులుగా తీర్చిదిద్దడమే మేలని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. 

వయా సోషల్ మీడియా:
జాబ్ మార్కెట్‌లో అవకాశాలను అందుకోవాలంటే.. మారుతున్న టెక్నాలజీని తెలివిగా ఉయోగించుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే బహుళ జాతి కంపెనీలు సంప్రదాయ విధానాల కంటే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌ను హైరింగ్ కోసం విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. స్వల్ప సమయంలో తక్కువ ఖర్చుతో ప్రతిభావంతులను ఆకర్షించే, గుర్తించే సులువైన మాధ్యమం సోషల్ మీడియా అని భావిస్తున్నాయి. దాంతో అన్ని రంగాలకు చెందిన కంపెనీల హెచ్‌ఆర్ విభాగంలో సోషల్ రిక్రూట్‌మెంట్కొత్తగా చోటు సంపాదించుకుంది. కంపెనీలో ప్రస్తుత ఖాళీల వివరాలను తెలియజేస్తూ.. అర్హతలు, కావల్సిన నైపుణ్యాలు, తదితర వివరాలను పోస్ట్ చేస్తున్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌పై యువత వెచ్చిస్తున్న సమయం కూడా కంపెనీలు ఈ మాధ్యమం ద్వారా నియామకాలు చేపట్టడానికి కారణమవుతోంది. కాబట్టి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో ప్రొఫైల్స్‌ను జాగ్రత్తగా నిర్వహించాలి. ఫేస్‌బుక్, లింకిడ్‌ఇన్, గూగుల్‌ప్లస్, మైస్పేస్, స్కిల్‌పేజెస్ వంటి సైట్లు ఈ విషయంలో ముందుంటున్నాయి.

అవకాశాల కామధేనువు ... కామర్స్ -చక్కని కెరీర్‌కు ఆలంబన

చక్కని కెరీర్‌కు ఆలంబన
దేశ ప్రగతిలో ఆర్థిక రంగానిది కీలకపాత్ర.. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో విస్తరిస్తున్న వాణిజ్యం, వ్యాపారం ఎన్నో అవకాశాలకు కేంద్ర స్థానంగా నిలుస్తోంది..
అదే సమయంలో సుశిక్షితులైన మానవ వనరుల కొరతను ఈ రంగం ఎదుర్కొంటుంది.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సంబంధిత రంగాలకు కావల్సిన నిపుణులు అందించే ఉద్దేశంతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తదితర సంస్థలు సర్టిఫికెట్ నుంచి పీజీ డిప్లొమా స్థాయి కోర్సులకు రూపకల్పన చేశాయి.. చక్కని కెరీర్‌కు ఆలంబనగా నిలుస్తున్న ఈ కోర్సులను పూర్తి చేయడం ద్వారా ఆకర్షణీయ వేతనాలతో కార్పొరేట్ ఉద్యోగాలు అందుకోవచ్చు.. వాటి వివరాలు..

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)
కోర్సులు: 
  • గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్
    కాల వ్యవధి:29 నెలలు
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్టాక్ మార్కెట్స్
    కాల వ్యవధి: 12 నెలలు (డిస్టెన్స్ విధానంలో)
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ జర్నలిజం
    సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఆన్ క్యాపిటల్ మార్కెట్స్ 
    (
    జమన్‌లాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సహకారంతో)
కాల వ్యవధి: 10 వారాలు.
బోధించే అంశాలు: ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిమ్యాట్, డిపాజిటర్స్, ట్రేడింగ్, ఈక్విటీ మార్కెట్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీస్ లా, ఫైనాన్స్, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.

అవకాశాలు: కోర్సు పూర్తి చేసిన తర్వాత బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, రీసెర్చ్ ఫర్మ్స్, బ్రోకింగ్ ఫర్మ్స్, సంబంధిత సంస్థల్లో బిజినెస్ ఎనలిస్ట్, ఇన్వెస్ట్‌మెం ట్ బ్యాంకర్స్, ఫైనాన్షియల్ ఎనలిస్ట్, క్యాపిటల్ మా ర్కెట్ మేనేజర్, రిస్క్ మేనేజర్, రెగ్యులేషన్ మేనేజ ర్ తదితర హోదాలతో కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
వెబ్‌సైట్: www.bseindia.com

క్రిసిల్ (CRISIL)
క్రిసిల్ సర్టిఫైడ్ ఎనలిస్ట్ ప్రోగ్రామ్ (సీసీఏపీ)
కాల వ్యవధి:రెండేళ్లు
బోధించే అంశాలు: ఇది ఎంట్రీ లెవల్, వర్క్ కమ్ స్టడీ ప్రోగ్రామ్. ఇందులో ఫైనాన్స్‌కు సంబంధించి 24 రకాల సబ్జెక్టులను బోధిస్తారు. తద్వారా ఫైనాన్షియల్ రంగాన్ని సమగ్రంగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది.
అర్హత: 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. క్యాట్/ ఎక్స్‌ఏటీ లేదా క్రిసిల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా అర్హులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
అవకాశాలు: కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు క్రిసిల్ సంస్థ మేనేజ్‌మెంట్ ట్రైనీలుగా నియమించుకుంటుంది. ఈ సమయంలో వీరికి రూ. 6 లక్షల వార్షిక వేతనాన్ని చెల్లిస్తారు. అంతేకాకుండా కోర్సు చేస్తున్న సమయంలో.. మొదటి సంవత్సరం రూ. 1.25 లక్షలు, రెండో సంవత్సరం 2.25 లక్షల వార్షిక వేతనం ఇస్తారు.
వెబ్‌సైట్: www.crisil.com

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)
అకౌంటింగ్ టెక్నిషియన్ కోర్సు
ప్రత్యేకత:ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రవేశపెట్టిన కోర్సు అకౌంటింగ్ టెక్నీషియన్. చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సులో సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తిచేయలేను అని అనుకుంటే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తి చేసి, ఒక ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది.
అవకాశాలు: ఈ సర్టిఫికెట్‌కు ప్రత్యేకమైన గుర్తింపు, అంతర్జాతీయ డిమాండ్ ఉంది. ఈ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థలలో అకౌంటెంట్‌గా చేరి నెలకు రూ. 25,000 వేతనం పొందొచ్చు. ఉద్యోగం చేస్తూనే ఐపీసీసీ రెండో గ్రూప్‌లో కూడా ఉత్తీర్ణత పొంది తర్వాత ఫైనల్ రాసి చార్టర్డ్ అకౌంటెంట్ హోదాను పొందొచ్చు. 
వెబ్‌సైట్: www.icai.org

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్)
ఈ సంస్థ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, అడ్వాన్స్‌డ్ వెల్త్ మేనేజ్‌మెంట్ కోర్సు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్రెజరీ, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, సర్టిఫికెట్ ఇన్ ట్రేడ్ ఫైనాన్స్, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బ్యాంకర్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్‌పీ) సర్టిఫికేషన్ ప్రోగ్రాం తదితర కోర్సులను అందిస్తోంది.

బోధించే అంశాలు: ఈ డిప్లొమా అకడెమిక్ కరిక్యులం ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఐటీ, బీపీవో రంగాల్లో ప్రాథమిక స్థాయి ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా రూపొందింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలపై సమగ్ర అవగాహన కల్పించడంతోపాటు, విధి నిర్వహ ణకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలను, పెట్టుబడులు, బీమా, పన్నులు, పదవీ విరమణ ప్రణాళికలు, స్థిరాస్థి, సంబంధిత నిర్ణయాలు వంటి అంశాలను ఆయా కోర్సులను బట్టి బోధిస్తారు.

ఉద్యోగావకాశాలు: ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో సులభంగా ఉద్యోగాలు దొరుకుతాయి. సాధారణ అభ్యర్థులతో పోలిస్తే ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగ సమయంలో అంతర్గత శిక్షణ అవసరం లేకుండానే సమర్థంగా విధులు నిర్వర్తించగలరు. ఇన్ని సానుకూల కారణాల వల్ల వీరికి ఉద్యోగం దొరకడం చాలా సులభం. 
వెబ్‌సైట్: www.iibf.org.in

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్‌ఎం)
కోర్సులు:
  • ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా రిస్క్ మేనేజ్‌మెంట్
  • ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్
  • ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్
  • ఇంటర్నేషనల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యాక్చూరియల్ సైన్స్
అర్హత: గ్రాడ్యుయేషన్.
ఎంచుకున్న కోర్సును అనుసరించి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏ), రిజర్వ్ బ్యాంక్, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్రోకింగ్ హౌసెస్‌లలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది.

అవకాశాలు: ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్రోకింగ్ హౌసెస్, స్టాక్ ఎక్స్ఛేంజ్, రేటింగ్ ఏజెన్సీలు, బ్యాంకులు, ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌షన్స్ తదితరాలు అవకాశాలకు వేదికలుగా నిలుస్తున్నాయి.
వెబ్‌సైట్: www.iirmworld.org.in

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్‌ఐఎస్‌ఎం) 
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ).. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్‌ఐఎస్‌ఎం)ను స్థాపించింది.
  • కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సెక్యూరిటీస్ మార్కెట్
కాల వ్యవధి: 12 నెలలు
అర్హత: 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్
బోధించే అంశాలు: సెక్యూరిటీ మార్కెట్‌లలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి సరిపోయే కోర్సు. ఇందులో ఫండ్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్, సేల్స్/ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్రాండ్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ తదితర అంశాలను బోధిస్తారు.
అవకాశాలు: ఫండ్ మేనేజర్స్, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, సేల్స్ మేనేజర్స్, బ్రాండ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ వంటి హోదాల్లో సెక్యూరిటీ మార్కెట్లు, సంబంధిత సంస్థల్లో కెరీర్ ప్రారంభించవచ్చు.

సర్టిఫికెట్ ఇన్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్
అవకాశాలు: ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సెక్యూరిటీస్ రీసెర్చ్ ఫర్మ్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, ఫెన్షన్ ఫండ్ తదితరాల్లో అవకాశాలు ఉంటాయి.
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సెక్యూరిటీ లా తోపాటు కరెన్సీ డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీ ఆపరేషన్స్ తదితరాల్లో షార్ట్ టర్మ్ కోర్సులను కూడా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ అందిస్తోంది.
వెబ్‌సైట్: www.nism.ac.in

ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్
కోర్సులు:
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఆపరేషన్స్
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిటైల్ బ్యాంకింగ్
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్రాంచ్ బ్యాంకింగ్
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్
  • డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సేల్స్
  • సర్టిఫికెట్ కోర్స్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్ సేల్స్ మేనేజ్‌మెంట్
  • ఎన్‌ఎస్‌ఈ సర్టిఫైడ్ క్యాపిటల్ మార్కెట్ ప్రొఫెషనల్
  • సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇన్సూరెన్స్ సేల్స్
అవకాశాలు: ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ఐసీఐసీఐ,హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, జెన్‌ప్యాక్ట్, కరూర్ వైశ్యా బ్యాంక్ వంటి సంస్థలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వీరికి ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, కస్టమర్ ఆక్విజషన్స్, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్, కస్టమర్ సర్వీస్, రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్,ఫోన్ బ్యాంకింగ్, క్లైమ్స్ ఎగ్జామినర్స్, ఆడిటర్స్ వంటి హోదాలతో కెరీర్ ప్రారంభించవచ్చు. 
వెబ్‌సైట్: www.ifbi.com

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)
  • కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. 
    కాల వ్యవధి: 12 నెలలు.
    ఈ కోర్సును నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఎఫ్‌ఎం) సహకారంతో నిర్వహిస్తుంది. థియరీతోపాటు సంబంధిత నైపుణ్యాలపై ప్రాక్టికల్ శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ, ఫైనాన్షియల్ సెంటర్స్ వంటి అంశాలను బోధిస్తారు. సంబంధిత సాఫ్ట్‌వేర్‌పై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు.
    అర్హత: 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. క్యాట్/ మ్యాట్/ ఎక్స్‌ఏటీ స్కోర్ ఉండాలి. లేదా ఎన్‌ఐఎఫ్‌ఎం-ఎన్‌ఎస్‌ఈ నిర్వహించే అన్‌లైన్ టెస్ట్/ ఇంటర్వ్యూ దశల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.