Thursday, 25 August 2016

వాణిజ్య శాస్త్రంలో...ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ఎలిజిబిలిటీ టెస్టు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ఎలిజిబిలిటీ టెస్టు లో పేపర్‌ 2 కన్నా 3లో ప్రశ్నల కాఠిన్యతాస్థాయి అధికం. పరీక్ష సమీపిస్తున్న తరుణంలో సన్నద్ధత స్థాయి పెంచుకుంటూ వెళ్ళటం, గత ప్రశ్నపత్రాల అధ్యయనం ప్రయోజనకరం.

వాణిజ్య శాస్త్రంలో...
కొద్దిఏళ్ళుగా నెట్‌/సెట్‌ పరీక్షల్లో జ్ఞానాత్మక ప్రశ్నల సంఖ్య తగ్గి అవగాహన, అనువర్తిత సామర్థ్యాలను మదింపు వేసే ప్రశ్నల సంఖ్య పెరిగింది.
వ్యాపార పర్యావరణం: ఇందులోని అంశాలు, వినియోగదారు రక్షణ, ఆర్థిక విధానాలు, పారిశ్రామిక విధానాలు, పర్యావరణ పరిరక్షణ తెలుసుకోవాలి.
ఆర్థిక, నిర్వహణ అకౌంటింగ్‌: భావనలు, భాగస్వామ్య ప్రవేశం, విరమణ, రద్దు, వాటాల జారీ, జప్తు, నిష్పత్తి విశ్లేషణ, మార్జినల్‌ కాస్టింగ్‌, బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌, ప్రామాణిక కాస్టింగ్‌ అధ్యయనం చేయాలి.
వ్యాపార అర్థశాస్త్రం: డిమాండ్‌ నిర్ణయించే అంశాలు, నిర్వచనాలు, వాటిని నిర్ణయించే అంశాలు, సగటు, ఉపాంత వ్యయాలు తెలుసుకోవాలి. ఉదాసీనతా వక్రరేఖల లక్షణాలు, వాటి రేఖల లక్షణాలు ముఖ్యం. మార్కెట్ల రకాలు, వాటి లక్షణాలు, ఏకస్వామ్య మార్కెట్‌ వంటి వాటిల్లో ధరల నిర్ణయ విధానాలు అధ్యయనం చేయాలి. ఆర్థిక సంఘాల చైర్మన్‌లు, ఆర్థిక సంఘం సిఫార్సులు చదవాలి. ఇటీవలి బడ్జెట్‌ ముఖ్యాంశాలు, అమలులో ఉన్న వివిధ అభివృద్ధి పథకాలు, ప్రణాళికలు, లక్ష్యాలు ప్రధానమైనవి.
వ్యాపార గణాంకశాస్త్రం: సహసంబంధ, ప్రతిగమన అంశాలు, t, F, Chi square పరీక్షలు మొదలైనవి ముఖ్యం.
వ్యాపార నిర్వహణ: నిర్వహణ సూత్రాలు, వాటి అంశాలు చదవాలి.
మార్కెటింగ్‌ నిర్వహణ: మార్కెటింగ్‌ మిశ్రమం- అంశాలు, వినియోగదారు ప్రవర్తన అధ్యయనం చేయాలి.
విత్త నిర్వహణ: మూలధన నిర్మాణం, లివరేజ్‌లు, మూలధన బడ్జెటింగ్‌, డివిడెండ్‌ విధానాలు గణనీయమైనవి.
మానవ వనరుల నిర్వహణ: పాత్ర, విధులు, ప్రణాళిక, ఎంపిక, భారత దేశంలో పారిశ్రామిక సంబంధాలు అధ్యయనం చేయాలి.
బ్యాంకింగ్‌, ఆర్థిక సంస్థలు: బ్యాంకుల రకాలు, విధులు, సంస్కరణలు, అభివృద్ధి బ్యాంకులు, రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధానం వంటివి ముఖ్యం.
ఆదాయపు పన్ను చట్టం, పన్ను ప్రణాళిక: నివాస ప్రతిపత్తి, పన్ను మినహాయింపులు, రిటర్నుల సమర్పణ, వివిధ రకాల అసెస్‌మెంట్‌ వంటవి అధ్యయనం చేయాలి.

GST


Saturday, 6 August 2016

అవకాశాల కామధేనువు ... కామర్స్ – రుణాలపై సలహాలకు.. క్రెడిట్ అనలిస్ట్

అవకాశాల కామధేనువు ... కామర్స్ – రుణాలపై సలహాలకు.. క్రెడిట్ అనలిస్ట్

రుణాలపై సలహాలకు.. క్రెడిట్ అనలిస్ట్

రుణం కోసం బ్యాంకును ఆశ్రయిస్తే... మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి, మీకు రుణం మంజూరు చేయాలా? చేయొద్దా? ఒకవేళ చేస్తే ఎంతమేరకు ఇవ్వొచ్చు అనేది తేల్చిచెప్పే నిపుణులు అక్కడ ఉంటారు. వారే.. క్రెడిట్ అనలిస్ట్‌లు. వీరు రుణ దాతలు, గ్రహీతలకు మధ్య వారధిగా పనిచేస్తుంటారు. కార్పొరేట్ యుగంలో రుణాలు ఇవ్వడం, తీసుకోవడం అనేవి సర్వసాధారణంగా మారాయి. అందుకే క్రెడిట్ అనలిస్ట్‌లకు గిరాకీ పెరిగింది. ఆర్థికాంశాలపై ఆసక్తి ఉన్నవారు దీన్ని తమ కెరీర్‌గా మార్చుకుంటే బ్రహ్మాండమైన అవకాశాలు, భారీ ఆదాయం సొంతం చేసుకోవచ్చు. 
సొంత ఏజెన్సీతో ఆదాయం పుష్కలం క్రెడిట్ విశ్లేషకులకు ప్రస్తుతం ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. బ్యాంకులు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్(కేపీఓ) రంగాల్లో కొలువులు దక్కుతున్నాయి. ఆసక్తి, అనుభవం ఉంటే సొంతంగా ఏజెన్సీని ఏర్పాటు చేసుకొనే అవకాశం కూడా ఉంది. దీంతో పనితీరును బట్టి అధిక ఆదాయం పొందొచ్చు. కార్పొరేట్ సంస్థలు తమకు కావాల్సిన రుణం కోసం బ్యాంకుల తలుపు తడుతుంటాయి. తమకు ఏ మేరకు రుణం అందుతుందో ముందే తెలుసుకోవడానికి క్రెడిట్ అనలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. కంపెనీ బ్యాలన్స్ షీట్లు, ఫైనాన్షియల్ డేటా, న్యూస్ రిపోర్టులను పరిశీలించి తగిన సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే కంపెనీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలి. వ్యక్తులు కూడా రుణానికి సంబంధించిన సలహాల కోసం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రతి రంగంలో క్రెడిట్ అనలిస్ట్‌ల అవసరం ఉంటోంది.

కావాల్సిన నైపుణ్యాలు: క్రెడిట్ అనలిస్ట్‌లకు మెరుగైన క్వాంటిటేటివ్, అనలిటికల్, ఆర్గనైజేషనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆంగ్ల పరిజ్ఞానం అవసరం. ఇంగ్లిష్‌లో రిపోర్ట్ రైటింగ్, ప్రజంటేషన్లను రూపొందించగలగాలి. ఈ వృత్తిలో డెడ్‌లైన్లు, ఒత్తిళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొనే నేర్పు ఉండాలి. వృత్తిపరమైన పరిజ్ఞానం పెంచుకోవాలి.

అర్హతలు: ఎంబీఏ పూర్తిచేస్తే క్రెడిట్ అనలిస్ట్‌గా మారొచ్చు. ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఏ సబ్జెక్టులు చదివినా ఎంబీఏ చేయొచ్చు. అయితే, క్వాంటిటేటివ్, అనలిటికల్ స్కిల్స్ పెంచే సబ్జెక్టులు చదివితే ఈ రంగంలో సులువుగా రాణించడానికి వీలుంటుంది. ప్రస్తుతం చాలా కంపెనీలు బీటెక్, బీకామ్ లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ విద్యార్హతలను కూడా కోరుకుంటున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఎంబీఏ(ఫైనాన్స్) కోర్సు చదివినవారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ లాంటి సర్టిఫికేషన్లను అభ్యసించి అర్హతలు, నైపుణ్యాలను పెంచుకోవాలి.

వేతనాలు: క్రెడిల్ అనలిస్ట్‌లకు వేతనాలు అధికంగా ఉంటాయి. పేరొందిన కంపెనీలో చేరితే ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వేతన ప్యాకేజీ అందుకోవచ్చు. అనుభవం పెరిగేకొద్దీ ఈ ప్యాకేజీ బరువు కూడా పెరుగుతుంది. సంతృప్తికరమైన పనితీరు, ప్రతిభాపాటవాలతో సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) లేదా మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ) స్థాయికి చేరుకోవచ్చు. పీజీ డిగ్రీ ఉండి, వృత్తిలో 20 ఏళ్ల అనుభవం కలిగిన సీఈఓకు ఏడాదికి రూ.40 లక్షలకు పైగా వేతన ప్యాకేజీ ఉంటుంది.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: 
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)- అహ్మదాబాద్.
    వెబ్‌సైట్:
      www.iimahd.ernet.in
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- బెంగళూరు.
    వెబ్‌సైట్:
      www.iimb.ernet.in
  • యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
    వెబ్‌సైట్:
      www.du.ac.in/du
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ
    వెబ్‌సైట్:
      www.iitd.ac.in
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా
    వెబ్‌సైట్:
      www.icai.org
  • జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
    వెబ్‌సైట్:
      www.xlri.ac.in
అవకాశాల కామధేనువు ... కామర్స్ – సవాళ్లతో కూడిన వృత్తి.. మార్కెటింగ్ మేనేజర్!


షేర్ల వ్యాపారానికి స్టాక్ బ్రోకర్!

స్టాక్ ఎక్స్ఛేంజ్, బులియన్ మార్కెట్, షేర్లు, సెన్సెక్స్, నిఫ్టీ.. ఇవి మనం తరచుగా వినే పదాలు. సంప్రదాయ పొదుపు పథకాల కంటే షేర్లలో పెట్టుబడులతో అధిక రాబడి ఉంటుందని ఆర్థిక నిపుణులు సలహాలు ఇస్తుంటారు. అయితే, షేర్లు, అందులో పెట్టుబడులపై చాలామందికి ఏమాత్రం అవగాహన ఉండదు. షేర్ల ఫలాలు పొందాలనుకునే క్లయింట్ల తరఫున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి స్టాక్ బ్రోకర్లు ఉంటారు. ప్రపంచంలో ధనం చెలామణిలో ఉన్నంతకాలం స్టాక్ బ్రోకర్లకు చేతినిండా పని, మంచి ఆదాయం లభిస్తాయని నిపుణులు అంటున్నారు. 
పేరు ప్రఖ్యాతలు, ఆదాయం, అవకాశాలు: స్టాక్ బ్రోకర్లు తమ క్లయింట్లకు సురక్షితమైన పెట్టుబడి పథకాలను సూచించాల్సి ఉంటుంది. వారి తరఫున షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి. షేర్ల కొనుగోలు, అమ్మకం వంటి కార్యకలాపాలు స్వయంగా చేపట్టాలి. ఈ వ్యవహారాలను నిర్వహించినందుకు క్లయింట్ల నుంచి ఆకర్షణీయమైన కమీషన్ పొందొచ్చు. స్టాక్ బ్రోకర్లు తమ పనితీరుతో క్లయింట్లకు లాభాలను ఆర్జించి పెడితే పేరుప్రఖ్యాతలు వస్తాయి. అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి. తాజా గ్రాడ్యుయేట్లు/పోస్టు గ్రాడ్యుయేట్లకు స్టాక్ బ్రోకరేజీ సంస్థల్లో అసిస్టెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్/రిలేషన్‌షిప్ మేనేజర్‌గా కొలువులు అందుబాటులో ఉన్నాయి. బ్రోకరేజీ కంపెనీలో సబ్-బ్రోకర్, ఫ్రాంచైజీగా కూడా చేరొచ్చు.

కావాల్సిన నైపుణ్యాలు: స్టాక్ బ్రోకర్‌కు మార్కెట్ పల్స్‌ను సరిగ్గా గుర్తించే నేర్పు ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో నమ్మకం ప్రధానం. క్లయింట్ల మనోభావాలు దెబ్బతినకుండా, మార్కెట్‌లో కంపెనీ స్థానం దిగ జారకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్టాక్ బ్రోకర్ పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే క్లయింట్ల జీవితాలు తారుమారవుతాయి. కాబట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సదా అప్రమత్తంగా ఉండాలి. ఈ వృత్తిలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి.

అర్హతలు: మన దేశంలో బ్రోకరేజీ సంస్థలు ఎంబీఏ (ఫైనాన్స్) కోర్సు చదివినవారిని అసిస్టెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్‌గా నియమించుకుంటున్నాయి. కాబట్టి ఈ కోర్సు పూర్తిచేస్తే స్టాక్ బ్రోకర్‌గా స్థిరపడొచ్చు. దీంతోపాటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ చేస్తున్న ఫైనాన్షియల్ మార్కెట్స్ సర్టిఫికేషన్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ చేస్తున్న డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ సర్టిఫికేషన్ కూడా పూర్తిచేస్తే అర్హతలను పెంచుకొని, మంచి అవకాశాలను అందుకోవచ్చు.

వేతనాలు: స్టాక్ బ్రోకర్లకు పనితీరును బట్టి ఆదాయం చేతికందుతుంది. ఎంబీఏ(ఫైనాన్స్) కోర్సు చేసిన రిలేషన్‌షిప్ మేనేజర్ సంవత్సరానికి రూ.2.4 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. నాన్-ఫైనాన్స్ రిలేషన్‌షిప్ మేనేజర్‌కు ఇంతకంటే కొంత తక్కువ ఆదాయం లభిస్తుంది. సంస్థ పరిధిని బట్టి ఇందులో మార్పులుంటాయి. రిలేషన్‌షిప్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించినవారు మెరుగైన పనితీరుతో టీమ్ లీడర్, జోనల్ మేనేజర్‌గా పదోన్నతులు పొందొచ్చు.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  • బీఎస్‌ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-ముంబై.
    వెబ్‌సైట్: 
    www.bseindia.com
  • నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్-ముంబై.
    వెబ్‌సైట్:
     www.nseindia.com
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ
    వెబ్‌సైట్:
     www.icsi.edu
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ
    వెబ్‌సైట్:
     www.icai.org 
  • ఎన్‌సీఎఫ్‌ఎం అకాడమీ-హైదరాబాద్.
    వెబ్‌సైట్: 
    www.ascncfmacademy.com
ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగొచ్చు ‘‘భారతీయ స్టాక్ మార్కెట్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. స్టాక్ బ్రోకర్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఫైనాన్స్, మార్కెట్లపై ఆసక్తి ఉన్న ఇంటర్మీడియెట్, డిగ్రీ అభ్యర్థులు ఈ కోర్సులను అభ్యసించొచ్చు. షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్ల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియలో స్టాక్ బ్రోకర్‌దే ప్రధాన పాత్ర. వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన ఈ క్రయవిక్రయాల విషయంలో స్టాక్‌బ్రోకర్... డీలర్‌గా, అడ్వైజర్‌గా, అనలిస్ట్‌గా పనిచేస్తాడు. ఈ కెరీర్‌లో ప్రవేశించిన వారు ఉద్యోగాలకే పరిమితమవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ స్థితిగతులపై పూర్తి అవగాహన ఏర్పడితే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది’’

అవకాశాల కామధేనువు ... కామర్స్ – సవాళ్లతో కూడిన వృత్తి.. మార్కెటింగ్ మేనేజర్!

అవకాశాల కామధేనువు ... కామర్స్ – సవాళ్లతో కూడిన వృత్తి.. మార్కెటింగ్ మేనేజర్!


సవాళ్లతో కూడిన వృత్తి.. మార్కెటింగ్ మేనేజర్!
సేల్స్ అండ్ మార్కెటింగ్... ప్రపంచవ్యాప్తంగా వందల ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ప్రక్రియ. ఇది కంపెనీలో తయారు చేసిన ఉత్పత్తులను, సంస్థల సేవలను సంబంధిత వినియోగదారులకు విక్రయించే బహుముఖ వ్యాపారం. అమ్మకాలపైనే సంస్థల మనుగడ ఆధారపడి ఉంటుంది. ఇలా అమ్మకాలు సాగిస్తూ కంపెనీకి, వినియోగదారులకు మధ్య వారధిగా పనిచేసేవారే.. సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్లు. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని దేశాల మధ్య సరిహద్దులు చెదిరిపోతూ వ్యాపార సంస్కృతి విస్తరిస్తుండడంతో మార్కెటింగ్ నిపుణులకు అవకాశాలు మిన్నంటుతున్నాయి. దేశ విదేశాల్లో భారీగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇకపై భవిష్యత్తంతా సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగానిదేనని చెప్పడం అతిశయోక్తి కాదు. కాబట్టి దీన్ని కెరీర్గా ఎంచుకుంటే అవకాశాలకు, ఆదాయానికి నింగే హద్దు. 

మార్కెటింగ్ నిపుణుల కొరత తీవ్రం 
నేడు అన్ని రంగాల్లో సేల్స్ మేనేజర్ల పాత్ర తప్పనిసరి. ప్రధానంగా రిటైల్, ఐటీ, హాస్పిటాలిటీ, ట్రావెల్, హెల్త్కేర్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో అధిక ఉద్యోగాలున్నాయి. ప్రస్తుతం నిపుణులైన మేనేజర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. డిమాండ్, సప్లై మధ్య అంతరం ఎక్కువగా ఉంది. దీనిపై జనంలో ఇప్పటిదాకా అంతగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. మార్కెటింగ్ను కెరీర్గా ఎంచుకొనే యవత సంఖ్య పెరుగుతోంది. ప్రారంభంలో సేల్స్ పర్సన్గా పనిచేసినవారు వృత్తిలో నైపుణ్యాలను పెంచుకొని మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు. కుటీర పరిశ్రమల నుంచి కార్పొరేట్ సంస్థల వరకు తమ వ్యాపారాభివృద్ధి కోసం మార్కెటింగ్ మేనేజర్లను నియమించుకుంటున్నాయి. ఈ వృత్తి మిగిలినవాటితో పోలిస్తే భిన్నమైనది. తానేం సాధించాలో మేనేజర్కు ముందే తెలుస్తుంది. ఇందులో పోటీ, సవాళ్లు అధికంగా ఉంటాయి. |

కావాల్సిన నైపుణ్యాలు
సేల్స్ మేనేజ్మెంట్లో మెరవాలంటే మాతృభాషతోపాటు ఆంగ్లంపై గట్టి పట్టుండాలి. అనర్గళంగా మాట్లాడే, తప్పుల్లేకుండా రాసే నైపుణ్యం అవసరం. మాటలతో వినియోగదారులను ప్రభావితం చేసి, ఒప్పించగలిగే నేర్పు ఉండాలి. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం ముఖ్యం. సాధారణ వ్యాపార లావాదేవీలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. తార్కికంగా ఆలోచించగలగాలి. ప్రజంటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకొనేదాకా ఓపికతో పనిచేయాలి. నాయకత్వ లక్షణాలుండాలి. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం కావాలి. 

అర్హతలు
సేల్స్ రంగాన్ని కెరీర్గా ఎంచుకోవాలంటే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీఏ పూర్తిచేయాలి. గతంలో మేనేజ్మెంట్ డిగ్రీ లేకపోయినా సేల్స్ మేనేజర్గా అవకాశాలు లభించేవి. ప్రస్తుతం సేల్స్ అండ్ మార్కెటింగ్లో చేరాలంటే బిజినెస్ స్టడీస్లో డిగ్రీ/డిప్లొమా ఉండడం తప్పనిసరి. తగిన విద్యార్హతలతో కెరీర్లో వేగంగా ఎదగడానికి వీలుంటుంది. మార్కెటింగ్ అర్హతలు లేని సాధారణ గ్రాడ్యుయేట్లు సైతం ఈ రంగంలో స్వయం ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. 

వేతనాలు
సేల్స్ మేనేజ్మెంట్ నిపుణులకు అధిక వేతనాలుంటాయి. ప్రారంభంలో సంవత్సరానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వేతన ప్యాకేజీ లభిస్తుంది. సీనియారిటీ పెరిగితే ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అందుకోవచ్చు. 

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
-ఉస్మానియా యూనివర్సిటీ
వెబ్సైట్: www.osmania.ac.in/
-
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-లక్నో. వెబ్సైట్: www.iiml.ac.in/
-
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్
వెబ్సైట్: www.iiswbm.edu/
-
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ 
వెబ్సైట్: www.imt.edu/ 
-
ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్-ఢిల్లీ
వెబ్సైట్: http://fms.edu/
-
జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్
వెబ్సైట్: www.xlri.ac.in/
======================================================
సమర్థతను బట్టి వేతనాలు 
‘‘ప్రపంచ దేశాలు తమ ఉత్పత్తుల విక్రయానికి భారత్నే అతిపెద్ద మార్కెట్గా ఎంచుకున్నాయి. ఇక్కడి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. దీంతో సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఉద్యోగావ కాశాలు పెరుగుతున్నాయి. కేవలం సబ్జెక్టు నాలెడ్జ్ మాత్రమే కాకుండా వృత్తికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలి. కమ్యూనికేషన్స్కిల్స్, ఆటిట్యూడ్, బిహేవియర్ స్కిల్స్ వంటివి అవసరం. మార్కెటింగ్ రంగంలో కెరీర్ పరంగా సాధారణ స్థాయి నుంచి మేనే జింగ్ డెరైక్టర్ వరకూ ఎదగొచ్చు. నైపుణ్యం, సమర్థతను బట్టి వేతనాలు అందుతాయి’’

అవకాశాల కామధేనువు ... కామర్స్ –కామర్స్ తో.. కోరుకునే కొలువులెన్నో..

అవకాశాల కామధేనువు ... కామర్స్ –    కామర్స్  తో.. కోరుకునే కొలువులెన్నో..

గ్లోబలైజేషన్‌తో వ్యాపార, వాణిజ్య రంగాల్లో వినూత్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విదేశీ కంపెనీల రాక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో.. ఎగుమతులు, దిగుమతులు, ట్రేడింగ్, స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి వాటిలో కార్యకలాపాలు పెరిగాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న కంపెనీలు మాల్స్ నుంచి ఈ-కామర్స్‌లో అడుగుపెట్టాయి. ఈ క్రమంలో ఆయా రంగాల్లో నిపుణుల కోసం కంపెనీలు జల్లెడపడుతున్నాయి. కామర్స్ కోర్సుల విద్యార్థులకు కంపెనీలు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులకు దీటుగా కామర్స్ కోర్సుల ఉత్తీర్ణులకూ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నాయి. ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల్లో బీకాం, ఎంకాం కోర్సుల సీట్లన్నీ వంద శాతం భర్తీ కావడమే ఈ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం. ఈ నేపథ్యంలో నగరంలో కామర్స్ కోర్సులను అందించే విద్యా సంస్థలు, అర్హతలు, అవకాశాలపై ఫోకస్...

కామర్స్.. స్పెషలైజేషన్లు 
కామర్స్ అనగానే ఇంటర్ స్థాయిలో సీఈసీ, ఎంఈసీ. డిగ్రీ స్థాయిలో మూడేళ్ల వ్యవధిలో బీకాం(జనరల్), బీకాం (కంప్యూటర్స్) మాత్రమే గుర్తొచ్చేవి. కానీ మారుతున్న జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపారాలకు అనుగుణంగా ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అవసరమైన కాంబినేషన్స్‌ను యూనివర్సిటీలు ప్రవేశపెడుతున్నాయి. బీకాం-మార్కెటింగ్, బీకాం-ఫారెన్‌ట్రేడ్, బీకాం -కార్పొరేట్ సెక్రటరీషిప్, బీకాం-ఫైనాన్స్, అకౌంటెన్సీ, బీకాం-ఒకేషనల్, బీకాం-బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, బీకాం-ఈ-కామర్స్, బీకాం-ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్, బీకాం-అకౌంట్స్(ఆనర్స్), బీకాం-సేల్స్‌మెన్‌షిప్, అడ్వర్‌టైజింగ్, బీకాం-ట్యాక్స్ ప్రొసీజర్ ఇలా ఎన్నో కొత్త కాంబినేషన్లను దేశంలో ఆయా విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ఇవన్నీ ఇంటర్మీడియట్ అర్హతతో ప్రవేశం పొందే అండర్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు. పీజీ స్థాయిలో ఎంకాం-ఫైనాన్స్, ఎంకాం-మార్కెటింగ్, ఎంకాం -ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కంట్రోల్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా మరెన్నో సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను వివిధ విద్యా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రొఫెషనల్ కోర్సుల్లో మంచి ఉద్యోగావకాశాలు అందిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంట్స్, ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ వంటివి ఉన్నాయి.

ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంచే కామర్స్ ల్యాబ్స్
బీకాం కరిక్యులంలో కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్‌సైన్స్‌తోపాటు.. అడ్వర్టయిజింగ్, సేల్స్ మేనేజ్‌మెంట్, ఫారెన్‌ట్రేడ్ ప్రాక్టీసెస్ వంటివాటిని విద్యార్థులు తెలుసుకునేందుకు కళాశాలలు కామర్స్ ల్యాబ్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలలో జరిగే అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులు; పన్నులు, సుంకాలు తదితర విషయాలపై అవగాహన పెంచేందుకు విద్యార్థులకు వేసవి క్యాంపులు నిర్వహిస్తున్నామని విల్లామేరీ కామర్స్ విభాగ అధిపతి రేవతిమాధుర్ తెలిపారు. మూడేళ్ల బీకాం కోర్సులో కేవలం బోధనకే పరిమితం కాకుండా ఆఖరి సంవత్సరంలో ప్రాక్టికల్స్, ప్రాజెక్టు వర్క్‌ను తప్పనిసరి చేశామని చెప్పారు.. కోఠి ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీత. ఇలా విద్యార్థులు.. ఉద్యోగిగా అడుగుపెట్టకముందే కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలను సొంతం చేసుకుంటారని నిపుణులు అంటున్నారు. ఓయూలో ఎంకాం స్థాయిలో ఒక సెమిస్టర్‌లో ప్రాజెక్టు వర్క్‌కు 100 మార్కులను కేటాయించారు. అదేవిధంగా ఎంకాం (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్)లో 60 శాతం ప్రాక్టికల్స్, 40 శాతం థియరీని ప్రవేశపెట్టారు. నూతన ధోరణులకనుగుణంగా ఈ-బిజినెస్‌కు అవసరమైనట్లుగా ఐటీలో విద్యార్థులకు ల్యాబ్స్ ద్వారా ప్రాక్టికల్ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఈ-అకౌంటింగ్, ఈ-కార్పొరేట్, ఈ-ఫైనాన్షియల్, సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలను అందిస్తున్నారు. 

నిపుణులకు అవకాశాలు అనేకం
కామర్స్‌లో గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సులు పూర్తిచేసినవారికి కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ఏడాది నగరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ నుంచి 13 మంది విద్యార్థులు అమెజాన్ కంపెనీ అందించే ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారు. వారిలో 12 మంది బీకాం ఆఖరి సంవత్సరం చదువుతున్నవారే కావడం విశేషం. కామర్స్ గ్రాడ్యుయేట్స్‌కు కంపెనీలు.. అకౌంటింగ్, ఆడిటింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, స్టాక్‌మార్కెట్, ట్రేడింగ్ విభాగాల్లో ఏడాదికి రూ.2.5 లక్షల వరకు అందిస్తున్నాయి. 

ఇవికాకుండా ఈ-బ్యాంకింగ్, ఈ-అకౌంటింగ్, ఈ- ఇన్సూరెన్స్ రంగాల్లో పనిచేయడానికి అకౌంటెంట్స్, ఎగ్జిక్యూటివ్స్, కరెన్సీ అండ్ బ్యాంకింగ్ ఎక్స్‌పర్ట్స్, బిజినెస్ ఎనలిటిక్స్ నిపుణులు భారీ స్థాయిలో అవసరం. హెల్త్, ఐటీ, ఫార్మా సెక్టార్‌లో అకౌంటెంట్స్, అనలిస్టులుగా కంపెనీలు కామర్స్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా మంచి వేతనాలు కూడా అందిస్తున్నాయి. ప్రారంభంలో నెలకు రూ.20,000 వరకు వేతనం ఉంటుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి నెలకు రూ.45,000 వరకు సంపాదించుకోవచ్చు. 

కోర్సులను అందించే సంస్థలు
నగరంలో దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవే ట్ కళాశాలల్లో బీకాం (ఆనర్స్), బీకాం (జనరల్), బీకాం (కంప్యూటర్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం- కాలేజ్ అందించే కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. డిస్టెన్స్ విధానంలో డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మానియా, ఇగ్నో తదితర సంస్థలు మూడేళ్ల డిగ్రీ, రెండేళ్ల పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ఇవేకాకుండా దేశంలో మరెన్నో విద్యాసంస్థలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) కోర్సును ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (www.icaihyd.org ), కంపెనీ సెక్రటరీ(సీఎస్) కోర్సు(www.icsi.edu/hyderabad ), కాస్ట్ అకౌంటెంట్ కోర్సును ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా(icmai.in/ ) అందిస్తున్నాయి. 
చదువుకయ్యే ఖర్చు తక్కువే..
‘‘ఆరేళ్లలో ఇంటర్, డిగ్రీ, సీఏ మూడింట్లోనూ ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్న్‌షిప్ కోసం పనిచేసిన సంస్థే వార్షిక వేతనం రూ.10 లక్షలు ఆఫర్ చేసింది. కానీ.. నాకు టీచింగ్ అంటే ఇష్టం. ఆ ల క్ష్యంతోనే స్నేహితులతో కలిసి సీఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించా. సీఏ పూర్తిచేసేందుకు అయిన ఖర్చు కేవలం రూ.20 వేల లోపే. రెండో సంవత్సరం నుంచి ఆడిటర్ వద్ద, సంస్థలో ఇంటర్న్‌షిప్, పార్ట్‌టైం జాబ్ చేయడం వల్ల పేరెంట్స్‌పై భారం పడలేదు. తక్కువ ఖర్చుతో చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సును పూర్తిచేశా. కోర్సుకు అయ్యే ఖర్చును ఉద్యోగంలో చేరాక ఏడాదిలో సంపాదించుకోవచ్చు
నేహా, డెరైక్టర్, ప్రాజెక్ట్ ప్రిఫిక్స్

నిపుణులకు మంచి ప్యాకేజీ
‘‘సమాజంలో ఆర్థిక కార్యకలాపాలు సాగినంత కాలం వాణిజ్యశాస్త్ర నిపుణుల అవసరం ఉంటుంది. క్రయవిక్రయాలు, మనీ ట్రాన్సాక్షన్స్, లాభనష్టాలు ఇవన్నీ కామర్స్‌తో ముడిపడినవే. అందుకే కామర్‌‌సకు అంతటి డిమాండ్. మార్కెట్ పరిస్థితులను అంచనా వేయాలంటే విశ్లేషణ చేయగలగాలి. భవిష్యత్తుల్లో క్రయవిక్రయాలను పరిశీలించాలన్నా అనలిటిక్స్‌పైనే ఆధారపడాలి. మారిన ఈ-కామర్స్ ట్రెండ్‌లోనూ అకౌంటింగ్స్‌దే కీలకపాత్ర. బ్యాంకింగ్, ఫైనాన్స్, ట్రేడింగ్, స్టాక్‌మార్కెట్ ఇలా కార్పొరేట్ రంగంలోనే కాదు.. ప్రభుత్వ రంగంలోనూ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఆడిటర్స్‌ను ఎంపికచేస్తున్నారు. మున్సిపాలిటీల్లో సీనియర్, జూనియర్ అకౌంటెంట్స్, ఆడిటర్స్‌గా, బీఎస్‌ఎన్‌ఎల్, బీహెచ్‌ఈఎల్, ఏపీ ట్రాన్స్‌కో, రైల్వే, ఆర్టీసీ ఇలా వాణిజ్య కార్యకలాపాలు జరిగే అన్ని విభాగాల్లోనూ కామర్స్ గ్రాడ్యుయేట్స్‌కు అవకాశాలున్నాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ రంగాలు గ్రామీణ ప్రాంతాలకు చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నాయి. దీనికోసం నిపుణులైన మానవ వనరులపైనే ఆధారపడాలి. గతంతో పోల్చితే కామర్స్ చదివిన వారు కేవలం అకౌంటెంట్‌గానే మిగిలిపోవట్లేదు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదుగుతున్నారు. అయితే ఈ రంగంలో రాణించాలంటే కావ్సాలింది.. మంచి కమ్యూనికేషన్‌స్కిల్స్, వర్తమాన అంశాలపై అవగాహన, స్టాటిస్టికల్, అనలిటికల్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పట్టు. ఇవన్నీ కాలేజీలో ఉన్నప్పుడే అలవరుచుకోవాలి. సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే టెక్ట్స్‌బుక్స్‌ను ఫాలో అవ్వాలి. ప్రాజెక్టువర్క్‌ను నిజాయతీగా చేయాలి. విద్యార్థులు తమ క్యాంపస్‌లోని కామర్స్ ల్యాబ్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి. నిపుణులుగా సబ్జెక్టును ఆకళింపు చేసుకోగలిగి, ప్రాక్టికల్‌గా అప్లై చేయగలిగే సామర్థ్యం సంపాదిస్తే లక్షల్లో వేతనాలు ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి’’ 

అవకాశాల కామధేనువు ... కామర్స్ -ఉద్యోగ మార్కెట్ ముఖ చిత్రం

అవకాశాల కామధేనువు ... కామర్స్ -ఉద్యోగ మార్కెట్ ముఖ చిత్రం 

దేశంలో ఉద్యోగ మార్కెట్ ముఖ చిత్రం మారబోతోంది.కంపెనీలు వ్యాపార విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వడం.. విదేశాల్లో కార్యకలాపాలను ప్రారంభించడానికి ఉత్సాహం చూపిస్తుండటం.. ప్రస్తుతం ఉన్న రంగాలతోపాటు నూతన రంగాల్లోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రచిస్తుండడం.. వెరసి నిరుద్యోగులకు వరంగా మారనుంది. ఆర్థిక వ్యవస్థలో ఆశాజనక పరిస్థితుల కారణంగా కంపెనీలు తాజా గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంతోపాటు అనుభవం కలిగిన ఉద్యోగులను మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయిలో రిక్రూట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి. వివిధ రంగాల కంపెనీలకు నెలవైన మన హైదరాబాద్‌లోనూ యువతకు అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ నేపథ్యంలో.. ఉద్యోగాలకు వేదికగా నిలిచే రంగాలు..ఆయా రంగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవడానికి మార్గాలపై ప్రత్యేక కథనం.. 

ఫైనాన్స్/అకౌంటింగ్
చిన్నాపెద్ద ప్రతి కంపెనీకి ఫైనాన్‌‌స/అకౌంటింగ్ విభాగం అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. ఫైనాన్స్/అకౌంటింగ్ రంగంలో నియామక ప్రక్రియ గతేడాది మాదిరిగానే స్థిరంగా ఊర్ధ్వ దిశగా కొనసాగుతోంది. అంతేకాకుండా వేతనాల్లో 18-20 శాతం వృద్ధి చోటుచేసుకునే అవకాశముంది. ముఖ్యంగా బహుళ జాతి సంస్థలు స్థానిక మార్కెట్లోకి ప్రవేశించాలని వ్యూహాలు రచిస్తుండటం, స్వదేశీ కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో వచ్చే 12 నెలల కాలంలో ఈ రంగంలో అవకాశాలు గణనీయంగా పెరగనున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. ఇందులో స్థిరపడాలంటే ఎంబీఏ (ఫైనాన్స్) లేదా ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఈ రంగంలో రాణించేందుకు సంబంధిత అర్హతలతోపాటు కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. ఫైనాన్షియల్ స్కిల్స్ ఉండి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలున్న మానవ వనరులకు డిమాండ్ అధికంగా ఉంది. మారుతున్న అవసరాలను బట్టి సంస్థను సమర్థంగా నడిపించగలిగే నాయకత్వ లక్షణాలతోపాటు వ్యాపార విస్తరణకు దోహదపడే యువత కు ఈ రంగం స్వాగతం పలుకుతోంది.

సేల్స్ అండ్ మార్కెటింగ్
ఏటా స్థిరంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్న రంగం.. సేల్స్ అండ్ మార్కెటింగ్. ఈ విభాగంలోని రిటైల్, హెల్త్‌కేర్, లైఫ్ సెన్సైస్ రంగాలు 12 శాతం వృద్ధిని సాధించాయి. దీంతో ఈ రంగానికి సంబంధించిన కార్యకలాపాలను మెట్రోసిటీల నుంచి చిన్న పట్టణాలకు సైతం విస్తరించడానికి సదరు సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దాని ఫలితమే మనకు కనిపిస్తున్న సూపర్ మార్కెట్ చైన్లు, బ్రాండెడ్ ఫార్మసీ అవుట్‌లెట్లు. వీటికి వినియోగదారుల నుంచి నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. దాంతో విస్తరణకు మార్గం చూపే ఏ చిన్న అవకాశాన్నీ ఈ సంస్థలు వదులుకోవడం లేదు. ఫలితంగా వాటిని నిర్వహించే మేనేజర్/ఫ్లోర్ మేనేజర్ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ వరకు ఎన్నో అవకాశాలను యువత అందిపుచ్చుకోవచ్చు. ఈ రంగంలో స్థిరపడాలంటే.. డిగ్రీ, లేదా మార్కెటింగ్‌లో ఎంబీఏ చేసి ఉండాలి. వినియోగదారులతో నేరుగా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది కాబట్టి సృజనాత్మక ఆలోచనలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సందర్భానుసారంగా నిర్ణయం తీసుకునే చాతుర్యం, మార్కెటింగ్ వ్యూహాలను పసిగట్టే నేర్పు ఉన్న నిపుణులకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) రంగంలో లెక్కకు మించిన అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.

హ్యూమన్ రీసోర్సెస్
ప్రతి కంపెనీకి హ్యూమన్ రీసోర్సెస్ విభాగం తప్పనిసరి. ఎందుకంటే.. నియామకాలు, శిక్షణ, పేరోల్స్ తయారీ వంటి వ్యవహారాలను పక్కాగా నిర్వహించాల్సింది ఈ విభాగమే! కాబట్టి హ్యూమన్ రీసోర్సెస్ రంగంలో మానవ వనరుల అవసరం ఎప్పుడూ అధికంగానే ఉంటోంది. ఈ రంగంలో నియామకాలు గతేడాది కాలంగా ఆశాజనకంగా ఉన్నాయని, హైరింగ్ మరింత ఊపందుకునే పరిస్థితి కనిపిస్తోందని రిక్రూట్‌మెంట్ కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. పని చేస్తున్న ప్రదేశం, త దితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగుల వేతనాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ రంగంలో స్థిరపడాలంటే.. సంబంధిత విభాగంలో ఎంబీఏ/ఎంఏ/ఎంఎస్సీ/పీజీడీఎం వంటి కోర్సులు చేసి ఉండాలి. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ ఆపరేటింగ్, వివిధ వ్యవహారాలను మార్కెట్లోకి కొత్తగా వస్తున్న సాఫ్ట్‌వేర్ల సహాయంతో నిర్వహించే నేర్పు ఉండాలి. ఎక్కువ వేతనం పొందాలంటే మాత్రం కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి.

బ్యాంకింగ్ 
కొంతకాలంగా నియామకాల విషయంలో అన్ని రంగాల కంటే ముందంజలో నిలుస్తోంది.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం. ముఖ్యంగా నూతనంగా బ్యాంకుల ఏర్పాటు కోసం లెసైన్స్‌లను మంజూరు చేయడం, విదేశీ పెట్టుబడిదారులు స్థానిక మార్కెట్‌పై దృష్టిసారించడం వంటివి ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దాంతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, పలు ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్‌‌స కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా రిక్రూట్‌మెంట్లకు తె రదీస్తున్నాయి. స్థానిక బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులు పెరగడం కూడా హైరింగ్ ప్రక్రియ జోరుగా మారడానికి ఒక కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 25 నుంచి 33 శాతం అధిక పే ప్యాకేజ్‌లతో కొత్తగా సిబ్బందిని నియమించుకోవడానికి సంబంధిత సంస్థలు ఉత్సాహం చూపిస్తున్నాయి. కాబట్టి హైరింగ్‌కు సంబంధించి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం రోజురోజుకూ ఆశాజనకంగా మారుతోంద ని చెప్పొచ్చు. ఈ రంగంలో స్థిరపడాలంటే బ్యాంకింగ్/ ఫైనాన్షియల్ సబ్జెక్ట్‌లు ప్రధానంగా ఎంబీఏ/ఎంకామ్/ ఎంఏ/ఎంఎస్సీ/ పీజీడీఎం/డిప్లొమా వంటి కోర్సులను పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు మార్కెట్లను విశ్లేషించడం, తదనుగుణంగా వ్యూహాలను రూపొందించడం, తార్కిక వివేచన వంటి నైపుణ్యాలు ఉంటే కెరీర్‌లో త్వరగా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.

నైపుణ్యాలపై ప్రధాన దృష్టి:
కే వలం ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడానికే పరిమితం కాకుండా.. వారిని మరింత సమర్థులుగా, నాయకులుగా తీర్చిదిద్దడానికి వీలుగా శిక్షణ కార్యక్రమాలను చేపట్టడానికి కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికేతర (నాన్ ఫైనాన్షియల్) రంగంలో ఈ విషయానికి పెద్దపీట వేస్తున్నారు. తద్వారా ఉద్యోగి ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు దీర్ఘకాలంపాటు సేవలు అందించే అవకాశం ఉంటుందని కూడా కంపెనీలు భావిస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపారాన్ని విస్తరించినప్పుడు కొత్తవారి రిక్రూట్‌మెంట్ కంటే సొంత ఉద్యోగులను మిడిల్ మేనేజ్‌మెంట్ నిపుణులుగా తీర్చిదిద్దడమే మేలని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. 

వయా సోషల్ మీడియా:
జాబ్ మార్కెట్‌లో అవకాశాలను అందుకోవాలంటే.. మారుతున్న టెక్నాలజీని తెలివిగా ఉయోగించుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే బహుళ జాతి కంపెనీలు సంప్రదాయ విధానాల కంటే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌ను హైరింగ్ కోసం విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. స్వల్ప సమయంలో తక్కువ ఖర్చుతో ప్రతిభావంతులను ఆకర్షించే, గుర్తించే సులువైన మాధ్యమం సోషల్ మీడియా అని భావిస్తున్నాయి. దాంతో అన్ని రంగాలకు చెందిన కంపెనీల హెచ్‌ఆర్ విభాగంలో సోషల్ రిక్రూట్‌మెంట్కొత్తగా చోటు సంపాదించుకుంది. కంపెనీలో ప్రస్తుత ఖాళీల వివరాలను తెలియజేస్తూ.. అర్హతలు, కావల్సిన నైపుణ్యాలు, తదితర వివరాలను పోస్ట్ చేస్తున్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌పై యువత వెచ్చిస్తున్న సమయం కూడా కంపెనీలు ఈ మాధ్యమం ద్వారా నియామకాలు చేపట్టడానికి కారణమవుతోంది. కాబట్టి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో ప్రొఫైల్స్‌ను జాగ్రత్తగా నిర్వహించాలి. ఫేస్‌బుక్, లింకిడ్‌ఇన్, గూగుల్‌ప్లస్, మైస్పేస్, స్కిల్‌పేజెస్ వంటి సైట్లు ఈ విషయంలో ముందుంటున్నాయి.