ఎస్‌బీఐ కస్టమర్లకు ఊరట
- పెనాల్టీ చార్జీలు 75 శాతం తగ్గింపు
- ఏప్రిల్ 1 నుంచి అమలులోకి
- 25 కోట్ల మంది ఖాతాదారులకు లబ్ధి
ముంబై: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఖాతాదారులకు పెనాల్టీ చార్జీల నుంచి భారీ ఊరట కల్పించింది. బ్యాంక్ ఖాతాలో కనీస నగదు నిల్వ ఉంచనందుకు గాను విధించే పెనాల్టీ చార్జీలను ఏప్రిల్ 1 నుంచి 75 శాతం తగ్గిస్తున్నట్లు ఎస్‌బిఐ ప్రకటించింది. జరిమానా రుసుము పేరిట భారీగా లాభాలు దండుకుంటున్నారని కస్టమర్లు గగ్గోలు పెట్టిన నేపథ్యంలో బ్యాంక్ వెనక్కి తగ్గింది. అయితే, కనీస నగదు నిల్వ పరిమితిని మాత్రం యథాతథంగా కొనసాగించింది. మెట్రో నగరాల్లోని శాఖలకు చెందిన కస్టమర్లకు నెలవారీ కనీస నిల్వ పరిమితిని రూ.3,000గా నిర్ణయించింది. సెమీ అర్బన్ బ్రాంచ్‌ల కస్టమర్లకు రూ.2వేలు, గ్రామీణ శాఖల్లోని ఖాతాదారులకు రూ.1,000గా ఉంది. కస్టమర్ల ప్రయోజనాలే బ్యాంక్ మొదటి ప్రాధాన్యమని, వారి అంచనాలను అందుకునే ప్రయత్నాల్లో భాగంగానే జరిమానా రుసుమును తగ్గించినట్లు ఎస్‌బిఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ విభాగ ఎండి పికె గుప్తా పేర్కొన్నారు.
గత ఏప్రిల్ నుంచి మొదలైన వడ్డన
గత ఏడాది ఏప్రిల్‌లో ఎస్‌బిఐ పెనాల్టీ చార్జీలను తిరిగి అమలులోకి తెచ్చింది. తొలుత మెట్రో నగరాల్లోని బ్రాంచ్ కస్టమర్లకు కనీస నిల్వ పరిమితిని రూ.5,000గా నిర్ణయించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవడంతో గత అక్టోబర్‌లో ఈ పరిమితిని రూ.3వేలకు తగ్గించడంతోపాటు జరిమానా రుసుము విషయంలోనూ స్వల్ప ఊరట కల్పించింది. అయినప్పటికీ గత ఏడాదిలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పెనాల్టీ చార్జీల రూపంలో బ్యాంక్‌కు రూ.1,771.67 కోట్ల ఆదాయం లభించింది. ఈ మొత్తం బ్యాంక్ రెండో త్రైమాసిక లాభం కంటే అధికం. బ్యాంక్ తాజా నిర్ణయంతో ఆదాయానికి భారీగా గండి పడనుంది.
41 కోట్ల పొదుపు ఖాతాలు
ప్రస్తుతం ఎస్‌బిఐలో 41 కోట్ల మంది కస్టమర్లున్నారు. జరిమానా రుసుము తగ్గిం పు నిర్ణయంతో 25 కోట్ల మంది కస్టమర్లకు లబ్ధి చేకూరనుంది. బ్యాంక్ తమ ఖాతాదారులకు సాధారణ సేవింగ్ అకౌంట్‌ను బేసి క్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బిఎ్‌సబిడి) మారే అవకాశం కల్పిస్తోందని గుప్తా తెలిపారు. బిఎ్‌సబిడితో పాటు జన్‌ధన్ ఖాతాలకు పెనాల్టీలు వర్తించవు. కాగా ఖాతాల్లో కనీస నిల్వ ఉంచ లేదన్న కారణంతో ఎస్‌బిఐ దాదాపు 41.16 లక్షల ఖాతాలను క్లోజ్ చేసింది.
ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే తక్కువే..
ఎస్‌బిఐ ప్రస్తుతం విధిస్తున్న పెనాల్టీ చార్జీలు ప్రైవేట్ బ్యాంక్‌లతో పోలిస్తే మాత్రం తక్కువే. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంక్ బ్రాంచీల్లో నెలవారీ కనీస నిల్వ పరిమితి రూ.10వేలు. ఖాతాలోని నగదు నిల్వ కనీస స్థాయి కంటే తగ్గిన పక్షంలో ఐసిఐసిఐ బ్యాంక్ రూ.100తోపాటు తగ్గిన మొత్తంలో 5 శాతాన్ని జరిమానాగా వసూలు చేస్తోంది. హెచ్‌డి ఎ్‌ఫసి బ్యాంకైతే ఏకంగా రూ.600 వరకు పెనాల్టీ విధిస్తోంది.
ఎటిఎం లావాదేవీల్లో నష్టపోతున్నాం..
సేవింగ్స్ ఖాతాలపై ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ గత నెలలో స్పందిస్తూ.. వీటి లావాదేవీల నిర్వహణ వ్యయం అధికంగా ఉంటుందని అన్నారు. ఎస్‌బిఐ కస్టమర్ తన డెబిట్ కార్డును ఇతర బ్యాంక్ ఎటిఎంలో ఉపయోగించినప్పుడు, ఎస్‌బిఐ ఆ బ్యాంక్‌కు రూ.17 చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇలా ఏటా రూ.1500 కోట్ల మేర ఇతర బ్యాంకులకు చెల్లించాల్సి వస్తోందని, ఈ ఖర్చులను ఏదో రూపంలో రికవర్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment